కరపత్రాలను విడుదల చేసిన టీజీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 9 నుంచి 11వరకు తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘గిరిజన హక్కుల గర్జన’ నిర్వహించనున్నట్టు టీజీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండాలు, మండల కేంద్రాల్లో హక్కుల గర్జన కార్యక్రమం జరగనుందనీ, 11న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి గిరిజన హక్కుల గర్జన నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ‘రాజ్యాంగంలోని గిరిజన హక్కులను కాపాడుకుందాం, అడవులు, భూముల నుండి గిరిజనులను గెంటేయడాన్ని ఆపాలి, గిరిజనులకిచ్చిన హామీల అమలుకై పోరాడుదాం’ అనే నినాదాలతో ప్రపంచ ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జరుపుతున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజన తెగలు తమ హక్కుల సాధన కోసం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని హక్కుల దినోత్సవంగా జరుపుకుంటోందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా గిరిజన హక్కుల దినోత్సవాన్ని టీజీఎస్ నిర్వహిస్తున్నదని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చిన నాటి నుండి రాజ్యాంగంలో ఆదివాసీ గిరిజనులకు కల్పించిన హక్కులు, చట్టాలను ఎన్నడూ లేని విధంగా కాలరాస్తున్నదని విమర్శించారు. అడవులు, అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టపెట్టేందుకే నూతన అటవీ సవరణ చట్టాన్ని 2023లో ఆమోదించిందని గుర్తు చేశారు. దీంతో ఆదివాసీ గిరిజనులు అడవుల నుండి గెంటి వేయబడి నిరాశ్రయులుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గిరిజనులకిచ్చిన 16 రకాల వాగ్దానాలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ గిరిజనులను మోసం చేస్తుందని విమర్శించారు. సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నామని గొప్పలు చెపుతున్న ప్రభుత్వం ఇప్పటివరకు గిరిజన శాఖకు మంత్రిని ఎందుకు నియమించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై రాబోయే కాలంలో పోరాడేందుకు ఉద్యమ కార్యాచరణను వచ్చేనెల 11న జరిగే గిరిజన హక్కుల గర్జన లో ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్షులు రాంకుమార్ నాయక్, రంగారెడ్డి జిల్లా నాయకులు ఎం గోపి నాయక్, ఆర్ శేఖర్, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 11న గిరిజన హక్కుల గర్జన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES