నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ కవి, మహాకవి దాశరధి కృష్ణమాచార్యుల శత జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమానికి ఆరంభంగా దాశరధి జీవితం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శించగా, అనంతరం ఆయన రచించిన సినీ గీతాలను ప్రేక్షకులు ఆస్వాదించారు.
వేదికపై జరిగిన సభలో ప్రముఖ సినీరచయిత సుద్దాల అశోక్ తేజ ముఖ్య అతిధిగా, నవతెలంగాణ బుక్ హౌస్ ఎడిటర్ కె. ఆనందాచారి ఆత్మీయ అతిధిగా పాల్గొన్నారు. వారు దాశరధి వ్యక్తిత్వం, రచనా శైలిపై విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు.
ఈ కార్యక్రమాన్ని దాశరధి ఫిలిం సొసైటీ అధ్యక్షుడు ఎస్. వినయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం గురు ఇందిరా పరాశరం శిష్య బృందం దాశరధి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని నృత్య రూపకాన్ని అత్యంత శాస్త్రీయంగా ప్రదర్శించారు.
కార్యక్రమానికి కార్యదర్శి బి. డి. యల్. సత్యనారాయణ స్వాగత ప్రసంగం అందించగా, ఉపాధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు వందన సమర్పణ చేశారు. అనేక మంది సాహిత్యాభిమానులు, కళా ప్రియులు, యువత ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

