నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్, బారాబంకి జిల్లాలోని అవసానేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఈ తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 19 మందికి విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. శ్రావణ మాసం మూడో సోమవారం (వారికి) సందర్భంగా జలాభిషేకం కోసం భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య విద్యుత్ తీగ తెగి టిన్ షెడ్‌పై పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదర్‌గఢ్‌లోని అవసానేశ్వర్ మహాదేవ్ ఆలయంలో జలాభిషేకం కోసం భారీ సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. ఆ సమయంలో ఆలయం పైనున్న విద్యుత్ తీగలపై ఒక కోతి దూకడంతో పాత తీగ ఒకటి తెగి ఆలయ ఆవరణలోని టిన్ షెడ్‌పై పడింది. ఈ లైవ్ వైర్ వల్ల టిన్ షెడ్‌లో విద్యుత్ ప్రవాహం వ్యాపించి, భక్తుల మధ్య తీవ్ర భయాందోళనలు చెలరేగి తొక్కిసలాట జరిగింది. విద్యుత్ షాక్ కారణంగా ఇద్దరు భక్తులు మరణించారు. మృతుల్లో ఒకరిని లోనికత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్‌పుర గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్రశాంత్‌గా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. ఇద్దరూ త్రివేదీగంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
కాగా, రెండు రోజుల్లో ఇది రెండో తొక్కిసలాట కావడం గమనార్హం. నిన్న ఉత్తరాఖండ్, హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. విద్యుత్ షాక్ పుకార్లతో ఏర్పడిన గందరగోళం ఈ తొక్కిసలాటకు కారణమైంది.