నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం’ లబ్ధిదారులకు మరో శుభవార్త.. డ్వాక్రా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిరుపేదలకు గూడు కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకంలో లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఈ రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో లబ్ధిదారులకు రుణం మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ప్రభుత్వం తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4,16,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. లబ్ధిదారులకు అందించాల్సిన రూ.5 లక్షలను విడతల వారీగా విడుదల చేస్తోంది. పునాది వరకు నిర్మిస్తేనే తొలి విడత సాయంగా రూ.లక్ష జమ చేస్తోంది. అయితే, ఈ పథకానికి ఎంపికైనప్పటికీ పునాది నిర్మించుకునేందుకు ఆర్థిక వెసులుబాటు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో అలాంటి కుటుంబాలకు చెందిన మహిళలు స్వయం సహాయక గ్రూపుల్లో సభ్యులుగా ఉంటే రుణం అందజేస్తోంది.