నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తూ.చ తప్పకుండా అమలు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు మంజూరైన కొత్త రేషన్ కార్డులను సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అదనపు కలెక్టర్ అంకిత్ లబ్దిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, గడిచిన 13 సంవత్సరాల తరువాత ప్రజల కొత్త రేషన్ కార్డుల కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేసిందని అన్నారు.
గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా అందించలేదని ఆక్షేపించారు. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ, తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్డులు అందిస్తోందని గుర్తు చేశారు. ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఇంకనూ అర్హులైన వారు మిగిలి ఉంటే, దరఖాస్తులు చేసుకోవాలని, కార్డులు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని భరోసా కల్పించారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 11,852 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, మరో 84,232 మంది సభ్యుల పేర్లను కొత్తగా రేషన్ కార్డుల జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని నార్త్, సౌత్ మండలాల పరిధిలోని 3174 కుటుంబాలకు కొత్త కార్డులు, 16,687 మంది సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేయడం జరిగిందని వివరించారు.
గత ప్రభుత్వ అసంబద్ధ పాలనా విధానాల వల్ల రూ.7.80 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యతాక్రమంలో అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు 22వేల కోట్ల రూపాయల రుణ మాఫీ, 9వేల కోట్ల రైతుబంధు నిధులు ఖాతాలలో జమ, రూ. 500 లకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాల అమలు తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని స్పష్టం చేశారు. సన్న బియ్యం పంపిణీ బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా దేశంలోనే మరెక్కడా లేదని, కేవలం తెలంగాణలో అమలవుతోందని అన్నారు.
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు మంజూరు చేశామని, ఒక్కో లబ్ధిదారుకు రూ. 5 లక్షలు అందిస్తున్నామని తెలిపారు. ఈ నిధులను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని సూచించారు. ఎవరైనా లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని షబ్బీర్ అలీ హెచ్చరించారు. అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, పూర్తి పారదర్శకంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అర్హులైన వారికి మాత్రమే కార్డులు మంజూరు అయ్యేలా పకడ్బందీ పరిశీలన జరుపుతున్నామని అన్నారు.
ఇంకనూ దరఖాస్తుల వెరిఫికేషన్ జరుగుతోందని, అర్హత కలిగిన కుటుంబాలకు కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా ఛైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సౌత్, నార్త్ తహసీల్దార్లు బాలరాజు, విజయ్ కాంత్, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.