Tuesday, July 29, 2025
E-PAPER
Homeమానవిమ‌హిళ‌లు.. మార్గ‌ద‌ర్శ‌కులు

మ‌హిళ‌లు.. మార్గ‌ద‌ర్శ‌కులు

- Advertisement -

నాలుగ్గోడలు దాటుకొని మహిళలు నేడు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. ‘ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది’ అన్నట్లుగా ఒకరిపై ఆధారపడకుండా తమ కాళ్ళపై తాము నిలబడటం కోసం స్వయం ఉపాధిని ఎంచుకుంటున్నారు. జనాభాలోనే కాదు ఆర్థికవృద్ధిలోనూ సగభాగమని నిరూపించు కుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలకు పదును పెడుతున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలా పైసా ఖర్చు లేకుండా సోలార్‌ ప్యానల్‌ సిస్టంతో స్వయం ఉపాధి పొందుతున్న తెలంగాణ ఆడబిడ్డల గురించి ఈ రోజు మానవిలో తెలుసుకుందాం…

నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ మండలం అయిటిపాముల గ్రామంలో కట్టంగూర్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ సోలార్‌ సిస్టం ఏర్పాటు చేసింది. అక్కడ ఉత్పత్తి అయ్యే వాట్స్‌ను మరింత అభివృద్ధి చేయాలని మహిళలు ఆలోచించారు. సోలార్‌ ఎనర్జీని ఉపయోగించుకుని ఛార్జింగ్‌ పెట్టాలని ఆలోచనతో స్వాపింగ్‌ సిస్టంను ఎంచుకున్నారు. మహిళల ఆసక్తిని గమనించి వారికి ఉపాధి కల్పించాలని ఆ కంపెనీ గౌరవ సలహాదారులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, ఎపిఓ చైర్మన్‌ చెవుగోని సైదమ్మ, స్వబాగ్‌ ల్యాబ్‌ ఫౌండర్‌ సుధాకర్‌, ఐఆర్డీఎస్‌ రమేష్‌ భావించారు. ఇదే విషయాన్ని ఆ జిల్లా కలెక్టర్‌ కంపెనీ సందర్శించేందుకు వచ్చినపుడు పంచుకున్నారు.

స్పందించిన కలెక్టర్‌
కలెక్టర్‌ వెంటనే స్పందించి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ఇదెంతో ఉపయోగపడుతుందని, అలాగే విద్యుత్‌ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు అనే ఉద్దేశంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పూర్తి వివరాలు అందజేశారు. వెంటనే స్పందించిన మంత్రి ప్రతీకెరెడ్డి ఫౌండేషన్‌ ద్వారా రూ.50 లక్షలు మంజూరు చేశారు. ఈ డబ్బులతో స్వబాగ్‌ ల్యాబ్స్‌ వారు స్వచ్ఛ శక్తి కేంద్రం, మహిళా సంఘాలతో రెండేండ్ల పాటు అగ్రిమెంట్‌ చేసుకున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన 50 మంది మహిళలను ఎంపిక చేసి వారి ఇళ్లపై స్వచ్ఛ శక్తి ఆఫ్డ్‌ సోలార్‌ సిస్టమ్‌ చార్జింగ్‌ బ్యాటరీ యూనిట్లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా చార్జింగైన బ్యాటరీలకు యూనిట్‌కి రూ.16.50 చెల్లించి బ్యాటరీలను స్వభాగ్‌ సంస్థ కొనుగోలు చేస్తున్నారు.

పైసా ఖర్చు లేకుండా
ఈ సిస్టమ్‌ ద్వారా పైసా ఖర్చు లేకుండా, పని ఒత్తిడి లేకుండా 50 మంది మహిళలు ప్రతినెల 2000 నుండి 3000 రూపాయలు లబ్ది పొందుతున్నారు. ఈ డబ్బు నేరుగా వారి అకౌంట్లో జమ చేస్తున్నారు. పేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇది కొంత వరకు ఉపయోగపడుతుంది. సమిష్టిగా కృషి చేస్తే సాధించలేనిది ఏమీ ఉండదని నిరూపిస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది మహిళలు ఈ రంగంలోకి వస్తున్నారు.

మొదటి పైలట్‌ ప్రాజెక్ట్‌
ఈ దేశంలోనే ప్రధమంగా, ప్రయోగాత్మకంగా ఇక్కడ ఈ సోలార్‌ విద్యుత్‌ బ్యాటరీ ఏర్పాటు చేశారు. అంటే దేశంలోనే ఇది మొదటి పైలట్‌ ప్రాజెక్ట్‌. ఇది అభివృద్ధి చెందితే మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి. దాంతో మరింత మంది మహిళలు ఉపాధి పొందవచ్చు. ఎలక్ట్రిక్‌ వాహనాలకు విద్యుత్‌కు బదులుగా ఈ బ్యాటరీలను వాడవచ్చు. పర్యావరణ పరి రక్షణకు, వాతావరణ కాలుష్యాన్ని నివారిం చేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ‘భవిష్యత్తులో మరిన్ని స్వచ్ఛ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మేమే బ్యాటరీలను కొనుగోలు చేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకొని మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం’ అంటున్నారు ఆ కంపెనీ యజమానులు.

మహిళలకు ఆర్థికవృద్ధి
మహిళలు కాలు బయట పెట్టకుండా ఇంటి నుండే సోలార్‌ సిస్టం ద్వారా ఆదాయం సంపాదించుకునే మంచి అవకాశం ఇది. దీని వల్ల మహిళలు ఆర్థికంగా బలపడవచ్చు. ప్రతి అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. అన్ని
రంగాల్లో రాణించాలి.
– ఇలా త్రిపాటి, నల్లగొండ జిల్లా కలెక్టర్‌

ఇంటి ఖర్చుల మందం
సోలార్‌ సిస్టం ద్వారా మాకు నెలకు రెండు వేల రూపాయలు వస్తున్నాయి. ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేసుకుంటున్నాం. దీని కోసం మేము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వచ్చిన డబ్బులను ఇంటి అవసరాల కోసం వాడుకుంటున్నాం. ఇది మాకెంతో ఉపయోగంగా వుంది. భవిష్యత్తులో దీన్ని మరింత పెంచుకుంటాము.
– బెల్లి పద్మజ

ఉపాధి పొందుతున్నాం
పైసా ఖర్చు, పైసా పెట్టుబడి లేకుండా సోలార్‌ సిస్టం ద్వారా మేము ఛార్జింగ్‌ పెట్టిన బ్యాటరీలకు స్వబాగ్‌ ల్యాబ్‌ వారు యూనిట్‌కు రూ.16.50 చెల్లిస్తున్నారు. ప్రస్తుతం నెలకు 2000 రూపాయల వరకు మాకు ఆదాయం వస్తుంది. దీనితో మేము కొంత ఉపాధి పొందుతున్నాం. ఆదనంగా సోలార్‌ ప్యానల్‌ యూనిట్ల సంఖ్య పెంచుకుంటే మహిళలు ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందేందుకు అవకాశం ఉంది. ఆ దిశగా ఆలోచిస్తున్నాం.
– చెవుగోని సైదమ్మ.

వారికి ధన్యవాదాలు

ప్రతీకెరెడ్డి ఫౌండేషన్‌ సహకారంతో మా ఇంట్లో ఏర్పాటు చేసిన సోలార్‌ ఆఫ్‌ గ్రిడ్‌ కో ఆపరేటివ్‌ సిస్టమ్‌తో నెలకు రూ.2 వేలు ఆదాయం వస్తోంది. నాలుగు నెలలుగా రూ.8 వేలు సంపాదిం చాను. సోలార్‌ ప్లేట్ల క్లీనింగ్‌, సిబ్బందికి సహకరించడం తప్ప మాకు ఎలాంటి రిస్క్‌ లేదు. మాకు ఉపాధి కల్పించినందుకు ధన్యవాదాలు.
– గోలి రాజేశ్వరి

పిల్లల చదువులకు…

సోలార్‌ సిస్టం ద్వారా మాకు ఇప్పటి వరకు ఎనిమిది వేల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ డబ్బులను పిల్లల చదువుల కోసం, ఇంటి ఖర్చులకోసం ఉపయోగిస్తున్నాం. గతంలో ఈ మాత్రం ఆదాయం కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఎంతో కొంత సంపాదిస్తున్నందుకు ధైర్యంగా ఉంది.
– రేహానా బేగం

పొదుపు చేసుకుంటున్నాం
వచ్చిన ప్రతి రూపాయిని పొదుపు చేసుకుంటున్నాం. అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాం. ఎలాంటి కష్టంలేకుండా, బయట అడుగు పెట్టే పని లేకుండా కొంత సంపాదించు కోగలుగుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇదే మరింత అభివృద్ధి చేసుకుంటే మా బతుకులు మరింత బాగుపడతాయి.
– ముక్కెర పార్వతమ్మ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -