చిన్న, పెద్ద హీరోలు అనే తారతమ్యం లేకుండా పురాణాలు, ఫాంటసీ కథలు, సూపర్ హీరోల కథలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాలని మేకర్స్ ఆరాటపడుతున్నారు.
దీని కోసం అవసరమయ్యే గ్రాఫిక్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్‌కి వందల కోట్ల రూపాయల్ని రాజీపడకుండా ఖర్చు చేస్తున్నారు. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వాలనే
ఈ లక్ష్యంలో కొంతమంది మేకర్స్ మాత్రమే ఎందుకు విజయం
సాధిస్తున్నారు?.
‘హరి హర వీరమల్లు’ డిజాస్టర్‌కి అత్యంత దారుణంగా ఉన్న గ్రాఫిక్ వర్క్ కూడా ఓ ప్రధాన కారణం. ఇందులోని నాసిరకం గ్రాఫిక్క్ వర్క్, విజువల్ ఎఫెక్టులు ప్రేక్షకులకు పరమ చిరాకు తెప్పించాయి. కథాకథనాలు, హీరో యాక్టింగ్ కంటే ఈ గ్రాఫిక్ వర్క్ మీదే తీవ్ర విమర్శలొచ్చాయి.
దీంతో చేసేది ఏమీ లేక చిత్ర బృందం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గ్రాఫిక్ వర్క్ ఉన్న సన్నివేశాలను కొంత మేరకు సరి చేసింది. అలాగే వాటి నిడివిని కూడా బాగా ట్రిమ్ చేసి సరికొత్త వర్షెన్‌ను మరోమారు విడుదల చేసింది. అయినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ కూడా గ్రాఫిక్స్ విషయంలో ఇదే తరహా విమర్శలు ఎదుర్కొంది. ఈ సినిమా ఫెయిల్యూర్‌లోనూ నాసిరకం గ్రాఫిక్ వర్కే కీలక పాత్ర పోషించింది.
రిలీజ్ తర్వాత గ్రాఫిక్ వర్క్ మీద ఈ సినిమాలు విమర్శలు ఎదుర్కొంటే, విడుదలకు ముందే చిరంజీవి కొత్త సినిమా ‘విశ్వంభర’ విమర్శలు ఎదుర్కోవడం మేకర్స్ అందరూ ఆలోచించాల్సిన విషయం.
‘విశ్వంభర’ టీజర్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఇదేం గ్రాఫిక్ వర్క్‌రా బాబూ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. చిరంజీవిలాంటి స్టార్ సినిమాలో ఇంత నాసిరకం గ్రాఫిక్ వర్క్ ఏంటి? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ప్రేక్షకులతోపాటు మెగాస్టార్ అభిమానులు సైతం పెదవి విరిచారు. ఈ విమర్శల ఫలితం వల్ల ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘విశ్వంభర’ ఇంతవరకు థియేటర్ల ముఖం చూడలేకపోయింది.
అయితే ఈ విమర్శలను తాము పాజిటివ్‌గా తీసుకుని, వాటిని సరిచేసే పనిలో ఉన్నామని దర్శకుడు వశిష్ట ఇటీవల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
‘విశ్వంభర’లోని గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆయన స్పందిస్తూ, మన పురాణల్లో ఉన్న లోకాలు కాకుండా ‘విశ్వంభర’ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. దీనికి అనుగుణంగా ఆ ప్రపంచంలో కనిపించే ప్రతీదీ ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతి ఇవ్వాలనుకున్నాం. అలాగే ఏడు లోకాలు దాటిన తరువాత హీరో ‘విశ్వంభర’కు చేసే ప్రయాణంలో పంచభూతాలను రిప్రజెంట్ చేసేలా కొత్తగా ఐదు లోకాలను సృష్టించాం. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఈ సినిమాలో ఒక గంటా పదిహేను నిమిషాలు ఉంటాయి. సినిమా నిడివిలో ఇవి 70%. అయితే టీజర్ విడుదలైన తరువాత గ్రాఫిక్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దీంతో వాటిని మళ్ళీ సరికొత్తగా చూపించాలనుకున్నాం. ఈ కారణంగా అనుకున్న టైమ్‌కి సినిమాని విడుదల చేయలేక పోయామన్నారు.
అయితే ఇంత టైమ్ తీసుకున్నా, దీని కోసం ఎన్నో అంతర్జాతీయ విఎఫ్‌ఎక్స్ సంస్థలు పని చేస్తున్నా, ఇప్పటికీ సినిమా రిలీజ్‌పై ఆయన స్పష్టత ఇవ్వలేకపోవటం గమనార్హం.
అంతేకాదు ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్ పరిధి ఇప్పటికే ఎన్నో రెట్లు దాటిపోయింది.
కేవలం గ్రాఫిక్స్ కారణంగా చిరంజీవి వంటి అగ్రహీరో సినిమా విడుదల ఆగిపోవడమే కాదు.. ఇకపై ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉండటం అనేది.. కేవలం మేకర్ల స్వయంకృతమేనని అంటున్నారు విఎఫ్‌ఎక్స్ నిపుణులు.
కథలోని సన్నివేశాల పరంగా ఎంత శాతం గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్ అవసరం అవుతాయి?, వాటిని క్రియేట్ చేయటానికి ఎంత సమయం పడుతుంది?, క్రియేట్ చేసిన వాటిల్లో మార్పులు, చేర్పులకు పట్టే సమయం ఎంత?, వీటి కోసం షూటింగ్ టైమ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వంటి తదితర విషయాలను ప్రీ ప్రొడక్షన్ టైమ్‌లోనే మేకర్స్ ఓ అవగాహనకు రావాలి. అలాగే ఈ ఎఫెక్ట్స్‌ని మన దేశంలో చేయిస్తామా లేక విదేశాల్లో చేయిస్తామా?, ఒకవేళ విదేశాల్లో చేయిస్తే ఎలాంటి పంథాని అనుసరించాలి?, వారికి మన కథ లోని ఎమోషన్ అర్థమైందా లేదా అనేది కూడా గ్రహించాలి.
ఈ విషయాలన్ని విఎఫ్‌ఎక్స్ నిపుణులతో చర్చించి, పక్కాగా ఓ క్లారిటీ వచ్చిన తర్వాతే షూటింగ్‌కి వెళ్ళాలి. చిత్రీకరణ జరుగు తున్నప్పుడు, అలాగే విఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతున్న టైమ్‌లోనూ కథతోపాటు దర్శకుడి విజన్‌పై పూర్తి అవగాహన ఉన్న చిత్ర సభ్యులు కచ్చితంగా విఎఫ్‌ఎక్స్ నిపుణులతో ఉండాలి.
అనుకున్న టైమ్‌కి, ఆశించినట్టే అవుట్‌ఫుట్ వచ్చిందనే నమ్మకం కుదిరిన తరువాతే విడుదల తేదీని ప్రకటించాలి. అయితే దురదృష్టవ శాత్తు వీటిని చాలా మంది మేకర్స్ పాటించడం లేదంటున్నారు విఎఫ్‌ఎక్స్ నిపుణులు.
అలాగే కొంత మంది మేకర్స్ ప్రతీదీ విఎఫ్‌ఎక్స్‌లో చూసు కుందాలే అనే నిర్లక్ష్య ధోరణిలోనూ ఉంటున్నారన్నారు.
ఇక కొంత మందికి వీటిపై అవగాహన ఉన్నా పెద్ద హీరో సినిమా అనో, ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశామనే ప్రస్టేజ్ కారణం తోనో, ఇతర సినిమాలకు పోటీ ఇవ్వాలనో, తీవ్ర ఆర్థిక ఒత్తిడి కారణంగానో హడావుడిగా రిలీజ్ చేస్తున్నారు. తీరా రిలీజ్ అయ్యాక విజువల్ ఎఫెక్ట్స్ బాగోలేవనే విమర్శలతో తీవ్రంగా నష్టపోతున్నారని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– రెడ్డి హనుమంతరావు
‘హరి హర వీరమల్లు’ లాంటి పెద్ద సినిమా ఉన్నప్పటికీ, ‘మహావతార్ నరసింహ’ వంటి అనువాద చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందు కొచ్చి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అందరికీ తెలిసిన నరసింహస్వామి, ప్రహ్లాదుడి కథే అయినప్పటికీ ఈ యానిమేషన్ చిత్రంలోని గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల ఊహకు అందకుండా ఆసాంతం మెస్మరైజ్ చేశాయి. దీనికి మించి ప్రేక్షకుల భావోద్వేగంతో
ఈ విజువల్ ఎఫెక్ట్స్ మమేకమయ్యాయి. దీంతో ఈ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.
భావోద్వేగాలతో మమేకమవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES