అమ్మతనానికో రేటు పెట్టేశారు.. ఇష్టానుసారం అమ్మేస్తున్నారు… ఐవీఎఫ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా…ఒక్కో జంట నుంచి రూ.10 లక్షల నుంచి 15 లక్షల వరకూ లాగేస్తున్నా…పిల్లలు కావాలనే ఆశతో వస్తున్న దంపతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. అయినా అడిగే నాథుడు లేడు…ఎవరు ఎంతచెబితే అంత…ఆదివారం సికింద్రాబాద్‌లోని ఒక సంతాన సాఫల్యత కేంద్రంలో జరిగిన ఘరానా మోసం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఒక చిన్నారికి క్యాన్సర్ రావడంతో తల్లిదండ్రులకు కలిగిన అనుమానం ‘సృష్టి’ సంతాన సాఫల్య కేంద్రం నిర్వాకం పేరుతో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. పుట్టిన బిడ్డ తమ వీర్యకణాలతోనే కలిగిందా లేదా అనే అనుమానంతో డీఎన్‌ఏ పరీక్ష చేయించగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
అతి సహజంగా, సాఫీగా సాగే ప్రక్రియ గర్భధారణ. అదేంటో కొందరికిదే అత్యంత సంక్లిష్టంగా మారుతుంది. ఏండ్లకేండ్లు సంతానం కోసం నిరీక్షిస్తున్నా కలగానే మిగిలిపోతుంటుంది. పెండ్లై ఏండ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవడంతో కుటుంబాల ఒత్తిడి, పిల్లలు కలగాలనే ఆశతో చాలామంది దంపతులు ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితు ల్లోనే కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఎంత గానో ఆదుకుంటున్నాయి. ఎందరికో సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. అయితే… సంతానలేమితో మానసికంగా, భావోద్వేగ పరంగా బలహీనంగా ఉండే దంపతులు పిల్లలకోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతుంటారు. ఇదే అదనుగా భావించిన కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాలు మోసాలకు తెగబడుతూ…మగ బిడ్డకైతే ఒక రేటు…ఆడ బిడ్డకైతే మరో రేటు…కవల పిల్లలకైతే ఇంకో రేటు.. ఇలా అమ్మతనమివ్వడానికి రేటు కట్టేశాయి…వైద్యం పేరుతో ఇష్టానుసారం దోచేస్తూ…వారి బలహీనతను క్యాష్ చేసుకుంటున్నాయి. ”సంతానం లేని దంపతులకు పిల్లలు కలిగించే పూచీ మాది” అని చెప్పుకొనే సాఫల్య కేంద్రాల నయవంచన ఇది.
ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా కలిగిన మనదేశంలో ఏ వీధికెళ్లినా ఓ ఫెర్టిలిటీ సెంటర్ దర్శనిమిస్తున్నది. ఐవీఎఫ్ నుంచి సరొగసీ వరకూ అన్ని సేవలూ అందించే ఈ క్లినిక్‌లు సాధారణ నర్సింగ్‌హోమ్‌ల కన్నా రద్దీగా ఉంటున్నాయి. ఇండియన్ సొసైటీ ఆఫ్ అసిస్టెడ్ రిప్రొడక్షన్ అంచనా ప్రకారం దేశంలో దాదాపు మూడు కోట్లమంది సంతానరాహిత్యంతో బాధపడుతు న్నారట. సంతానలేమి సమస్య అనగానే మొదట స్త్రీలవైపే వేలెత్తి చూపే సమాజం…ఇప్పుడిప్పుడే స్త్రీ పురుషులిద్దరి ఆరోగ్య సమస్యగా చూడడం పెరుగుతోంది. ప్రాథమికంగా ఇది శారీరక స్థితికి సంబంధించినదే అయినప్పటికీ జీవనశైలీ, వాతావరణ ప్రభావం దానిని ఎక్కువగా ప్రభావితం చేస్తుందన్నది కాదనలేని వాస్తవమని ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం స్పష్టంచేస్తోంది. సంతానరాహిత్యానికి జన్యుపరమైన సమస్యలూ కొంత కారణమైనప్పటికీ, కుటుంబ, సామాజిక వాతావరణం, ఒత్తిళ్లూ, ఆహారపుటలవాట్లూ ఆ సమస్యని పెంచుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సమస్యలోనూ స్త్రీపురుషులిద్దరి భాగస్వామ్యమూ సమానమన్నది పచ్చి వాస్తవం.
సికింద్రాబాద్ స్పెర్మ్ టెక్ సంస్థపై జరిగిన పోలీసుల దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. మంచి శరీరపుష్టి ఉండి.. క్రీడాకారుల్లా కనిపించే యువకులను వీర్యదానానికి.. మేలిమిరంగు శరీరచ్ఛాయతో.. చక్కటి ఆకర్షణీయంగా ఉండే యువుతులను అండ దానానికి ఎంచుకుంటూ…బతుకు తెరువుకు భాగ్యనగరం వచ్చి ఉద్యోగాలు దొరక్క ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతకు డబ్బుల ఆశ చూపి వారికి గాలం వేస్తున్నారు నిర్వాహకులు. అంతేకాకుండా అధిక ఎక్కువ అండాలు, వీర్యకణాలు ఉత్పత్తి అయ్యేలా హార్మోన్ ఇంజెక్షన్లు చేస్తూ మరో దారుణానికి ఒడికడుతున్నారు. ఈ ఇంజెక్షన్లను అతిగా తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో వంధ్యత్వం దారితీసే ప్రమాదాలు లేకపోలేదని గైనకాలజిస్టుల ఆందోళన పరిస్థితి తీవ్రతను తెలుపుతుంది. ఈ దందా పూర్తిగా అక్రమమే అయినా ‘మూడు స్పెర్మ్‌లు ఆరు అండాలు’గా పెరిగిపోతున్నదని పోలీసులే చెబుతున్నారు. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం 2021, సరోగసీ చట్టం 2021లను ఈ సంస్థ ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. మనదేశంలో సరోగసీ, స్పెర్మ్ కలెక్షన్లకు సంబం ధించి నిర్దిష్ట చట్టాలున్నాయి. మరి వాటి అమలు ఏందుకు కుంటుబడింది. ఇవి ప్రశ్నలుగానే మిగిలిపో తున్నాయి. విద్యా వైద్యం ప్రయివేటుపరమైన తర్వాత వ్యాపార ధోరణి పెరిగిపోవడం వలన ఇలాంటి అనార్ధాలు చోటుచేసుకుంటు న్నాయి. వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వాలు చర్యలకు మీనమేషాలు లెక్కిం చడం… ఉదాసీనత ప్రదర్శించడంతో ఇలాంటి దందాలు కొనసాగుతు న్నాయి. వీటి తక్షణమే నివారించే దిశగా ప్రభుత్వ చర్యలుండాలి.
‘ఫెక్’ర్టిలిటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES