Tuesday, July 29, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాపై దాడుల్లో 55మంది మృతి

గాజాపై దాడుల్లో 55మంది మృతి

- Advertisement -

– రేషన్‌ కేంద్రాల వద్ద కాల్పుల్లో 17మంది హతం
– స్వల్పంగా ఆంక్షలు సడలించిన ఇజ్రాయిల్‌
– సముద్రంలో నీటి బిందువంతన్న ఐక్యరాజ్య సమితి
డేర్‌ అల్‌ బాలాహ్‌ :
గాజాలో అన్నార్తుల ఆకలి కేకలపై ఇజ్రాయిల్‌ కర్కశంగా వ్యవహరిస్తూ జరుపుతున్న దాడుల్లో తాజాగా సోమవారం 55మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. వీరిలో ఆహార కేంద్రాల వద్ద జరిగిన కాల్పుల్లో మరణించినవారు 17మంది కాగా అనేకమంది గాయపడ్డారు.
గాజాలో మానవతా సంక్షోభం దుర్భరంగా మారిన నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఇజ్రాయిల్‌ ఆహార సాయంపై అమలవుతున్న ఆంక్షలను ఆదివారం కొద్దిగా సడలించింది. ఆహార సరఫరా మెరుగవడానికి గానూ గాజా నగరం, డేర్‌ అల్‌ బాలాహ్‌, మౌవసి ప్రాంతాల్లో రోజుకు 10గంటల పాటు మిలటరీ ఆపరేషన్లకు విరామం ఇవ్వనున్నట్లు ఇజ్రాయిల్‌ ఆదివారం ప్రకటించింది. తదుపరి సమాచారం ఇచ్చేవరకు ఇది అమలవుతుందని తెలిపింది. సాయం అందేందుకు సురక్షితమైన మార్గాలను కూడా కొన్నింటిని నిర్దేశించింది. మానవతా సాయం అందేందుకు తీసుకుంటున్న కొత్త చర్యలతో పాటూ తమ మిలటరీ ఆపరేషన్లు కొనసాగుతాయని ప్రకటించింది. అయితే తాజా దాడుల గురించి మిలటరీ వెంటనే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఉదయం 10గంటల నుండి రాత్రి 8గంటలవరకు కాల్పులకు విరామం వుంటుందని ప్రకటించింది.
సముద్రంలో నీటి బిందువంత !
అయితే పాలస్తీనా భూభాగంలో రోజు రోజుకు ఉధృత మవుతున్న దుర్భిక్షాన్ని ఎదుర్కొనేందుకు ఇజ్రాయిల్‌ ప్రకటించిన ఈ కాస్త చర్యలు సరిపోవని సహాయక సంస్థలు వ్యాఖ్యానించాయి. ‘ఇజ్రాయిల్‌ తీసుకున్న చర్యలు సముద్రంలో నీటి బొట్టంత’ అని ఐక్యరాజ్య సమితి మానవతా విభాగ చీఫ్‌ విమర్శించారు. ప్రాణాధార మందులు, అత్యవసరాలైన ఉత్పత్తుల సరఫరాపై తీవ్ర ఆంక్షలు అమలవుతుండగా, ఆహారం అందేందుకు అంటూ ఇజ్రాయిల్‌ సడలించిన ఆంక్షలు ఏ మాత్రమూ లెక్కలోకి రావని అన్నారు.
ఆహార కేంద్రాల వద్ద కాల్పుల్లో 17మంది మృతి
గాజాలో ఆహారం అందించే కేంద్రాల వద్ద వేచివున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో 17మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. వీరిలో రాఫా నగరానికి ఉత్తరాన మోరాగ్‌ కారిడార్‌కు సమీపంలో జరిగిన దాడిలో మృతి చెందిన ఐదుగురు కూడా వున్నారు. దీంతో మొత్తంగా మరణించినవారి సంఖ్య 55కి చేరింది. 80మందికి పైగా గాయపడ్డారు. తీవ్ర పోషకాహారం లోపంతో ఆదివారం మరో 14మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో ఒక చిన్నారి కూడా వుంది. పాలస్తీనియన్ల సాగుభూములపై, ఆలీవ్‌ చెట్లపై ఇజ్రాయిల్‌ బలగాలు విరుచుకుపడ్డాయి. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లోని జెనిన్‌ నగరానికి సమీపంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి.
యుద్ధం ఆపండి
గాజాలో యుద్ధం ఆపేందుకు చొరవ చూపాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతాహ్‌ అల్‌ సిసి బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. యుద్ధాన్ని ఆపే సమర్ధత ఆయనకుందని టెలివిజన్‌లో ప్రసంగిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సంవత్సరాల తరబడి దాడుల్లో మగ్గిపోతున్న పాలస్తీనియన్లకు ఉపశమనం కలిగించేలా తక్షణమే ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకువచ్చి యుద్ధాన్ని ముగించాలని కోరారు. యుద్ధాన్ని ఆపే సమయమిదేనని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. స్కాట్లాండ్‌లో పర్యటిస్తున్న ఆయన గాజా ప్రజలకు ఆహారం, భద్రత అవసరమని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశముందని వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -