Tuesday, July 29, 2025
E-PAPER
Homeజాతీయంప్రజాస్వామ్యంపై ఎస్‌ఐఆర్‌ దాడి

ప్రజాస్వామ్యంపై ఎస్‌ఐఆర్‌ దాడి

- Advertisement -

– పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళన
– వాయిదాల పర్వంలో ఉభయ సభలు
– క్రైస్తవులపై హింసాత్మక ఘటనపై చర్చించాలి : సీపీఐ(ఎం) ఎంపీ వి. శివదాసన్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

బీహార్‌లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఐదో రోజూ ప్రతిపక్షాలు గళమెత్తాయి. ఇందులో భాగంగా సోమవారం పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభం, వాయిదా తరువాత పెద్దఎత్తున ఇండియా బ్లాక్‌ ఎంపీలు నిరసనకు దిగారు. మకరద్వారానికి ఎదురుగా చేపట్టిన ఈ ఆందోళనలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌, సీపీఐ(ఎం) ఎంపీలు అమ్రారామ్‌, శివదాసన్‌, జాన్‌ బ్రిట్టాస్‌, టీఎంసీ ఎంపీలు డెరిక్‌ ఓ బ్రెయిన్‌, సాగరికా ఘోష్‌, డీఎంకే ఎంపీలు కనిమొళి, ఎ రాజాతో పాటు ఇండియా బ్లాక్‌ ఎంపీలు పాల్గొన్నారు. బీహార్‌ ఓటర్ల జాబితాల స్పెషల్‌ ఇంటెన్సీవ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

‘సర్‌-ప్రజాస్వామ్యంపై దాడి’ అనే భారీ బ్యానర్‌, ఎస్‌ఐఆర్‌ను ఆపాలి అనే ప్లకార్డులను ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష ఎంపీలు నిరసించారు. ప్రజల అభిప్రాయం లేకుండా, ఎన్నికల తరువాత ఓటర్లను మత, కుల ప్రాతిపదికన వడపోసే ఈ ప్రయత్నాన్ని ప్రజా స్వామ్యాన్ని నాశనం చేసే కుట్రగా ప్రియాంక గాంధీ పేర్కొ న్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఓటర్లను తొలగించడం కాదు… వారి గొంతుకను వినడమే ప్రభుత్వాల బాధ్యత అని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. బీహార్‌ ఎన్నికలకు ముందు కుట్ర పూరితంగా ఎస్‌ఐఆర్‌ను తీసుకువచ్చారని విమర్శించారు.

ఉభయ సభల వాయిదాల పర్వం
వారం రోజుల అవాంతరాలు, ప్రతిష్టంభన అనంతరం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులవుతున్నా ఎలాంటి చర్చ లేకుండానే లోక్‌సభ, రాజ్యసభ వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశ మయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. బీహార్‌లో ‘సర్‌’ పేరుతో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎస్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ఓంబిర్లా ప్రకటించారు. మరోవైపు రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగింది. సభ ప్రారంభంకాగానే బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్ష కూటమి ఎంపీలు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం ఏర్పడింది.

దీంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. సభలు తిరిగి ప్రారంభమైన తరువాత కూడా అదే సీన్‌ రిపీట్‌ కావడంతో లోక్‌సభను మధ్యాహ్నం 1 గంట వరకు, రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. వాయిదాకు ముందు ప్రతిపక్ష సభ్యుల తీరుపై స్పీకర్‌ ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ‘సభలో పోస్టర్లు ప్రదర్శించొద్దని, నినాదాలు చేయవద్దని మీ సభ్యులకు చెప్పండి’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానిం చారుసభ్యులు ఈ రీతిన పదేపదే ఆందోళనకు దిగడం సభా గౌరవమర్యాదలను తగ్గిస్తుందని స్పీకర్‌ అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులకు మాట్లాడే అనుమతి ఉండదని, అయినా ప్రతిపక్ష సభ్యులు నినాదా లతో సభా కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తు న్నారని విమర్శించారు. దేశ ప్రజలు ప్రతిపక్షాల తీరును గమనిసు ్తన్నారని హెచ్చరించారు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమా వేశంలో ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు అంగీకారం తెలిపి, ఇప్పుడు ఎందుకు ఆందోళన చేస్తున్నారని ఆయన ప్రశ్నిం చారు. గంట విరామం తరువాత ప్రారంభమైన సభ.. వెంటనే వాయిదా పడింది. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలతో సభను 2 గంటల వరకూ వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు సభలో సిందూర్‌పై చర్చ చేపట్టారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసా గింది. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు క్రైస్తవుల అరెస్టుపై చర్చించాలి : సీపీఐ(ఎం)
దేశంలో క్రైస్తవులపై కొనసాగుతున్న హింసాత్మక ఘటనపై చర్చించాలని సీపీఐ(ఎం) ఎంపి వి. శివదాసన్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన రాజ్యసభలో రూల్‌ 267 కింద నోటీసు ఇచ్చారు. అస్సిసీ సిస్టర్స్‌ ఆఫ్‌ మేరీ ఇమ్మాక్యులేట్‌ సభ్యులు సిస్టర్‌ ప్రీత మేరీ, సిస్టర్‌ వందన ఫ్రాన్సిస్‌లను ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అరెస్టు చేయడం ఆందోళన కలిగించిందని, క్రైస్తవ సమాజ సభ్యులపై వేధింపులకు పాల్పడుతున్న ధోరణిని ప్రతిబింబిస్తూ నిరాధారమైన ఆరోపణల ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా క్రైస్తవులు క్రమబద్ధమైన హింస, బెదిరింపులను ఎదుర్కొంటున్నారన్నారు. రాజ్యాంగబద్ధంగా న్యాయం, సమానత్వాన్ని కాపాడాల్సిన సంస్థలు ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘించే చర్యలకు పాల్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వెంటనే చర్చకు తీసుకోవాలని, అన్ని స్థాయిలలో జవాబుదారీతనం ఉండేలా చూసుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -