Tuesday, July 29, 2025
E-PAPER
Homeజాతీయంఫోన్లకు అతుక్కుపోతున్నారు..

ఫోన్లకు అతుక్కుపోతున్నారు..

- Advertisement -

– బాల్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న స్క్రీన్‌ ఎక్స్‌పోజర
– వైద్యులు సిఫారసు చేసిన దానికంటే రెట్టింపు
– హెచ్చరిస్తున్న వైద్య, ఆరోగ్య నిపుణులు

యువతీ, యువకులు సామాజిక మాధ్యమాల్లో పడిపోయి, దానినే ప్రపంచంగా భావిస్తున్నారు. యువతులు రీల్స్‌కు యువకులు గేమింగ్‌లకు బానిసలవుతున్నారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, టీనేజర్లే కాకుండా అన్ని వయసుల వారూ అధికంగా స్క్రీన్‌పై సమయాన్ని గడపకుండా ఆరోగ్యంపై దృష్టిని సారించాలని వారు సూచిస్తున్నారు.
న్యూఢిల్లీ : ఒకప్పుడు బాల్యం అంటే మైదానంలో ఆటలు, పాటలు, అల్లరి చేష్టలతో ఆనందంగా గడిచేది. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. దేశంలో డిజిటల్‌ విప్లవం మనుషుల జీవితాల్లో పలు మార్పులు తీసుకొచ్చింది. అయితే పిల్లల్లో తీసుకొచ్చిన మార్పు మాత్రం మరీ ఆందోళనకు గురి చేస్తోంది. తమ పిల్లలు ఏడుస్తున్నారంటే చాలు.. తల్లిదండ్రులు వారికి ఫోన్‌ ఇచ్చేసి, తమ పని తాము చూసుకుంటున్నారు. దీంతో పిల్లలు అధిక సమయం ఫోన్లతో గడుపుతున్నారు. అది వారిని మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నదని వైద్య, ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లోని పిల్లలు స్క్రీన్‌ ఎక్స్‌పోజర్‌ (అధికంగా మొబైల్‌ ఫోన్లను, టీవీలు, ల్యాప్‌టాప్‌లను చూడటం) కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నారని హెచ్చరిస్తున్నారు. అధిక స్క్రీన్‌ సమయంలో పిల్లల విలువైన బాల్యాన్ని నష్టపరుస్తున్నది.

శారీరకంగా, మానసికంగా వారి ఎదుగుదలను అడ్డుకుంటున్నది. ప్రస్తుతం దేశంలో ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ ఫోన్లు సర్వసాధారణమైపో యాయి. మరీ ముఖ్యంగా కరోనా, తదనంతర పరిస్థితులు పిల్లలను ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు దగ్గరయ్యేలా చేశాయి. అప్పటి నుంచి పిల్లల్లో స్క్రీన్‌ ఎక్స్‌పోజర్‌ తీవ్రంగా పెరిగిపోయింది. భారత్‌లో పిల్లలు (ఐదేండ్ల కంటే తక్కువ వయస్నున్న వారిలో) రోజుకు సగటున 2.2 గంటలు ఈ పరికరాలతోనే గడుపుతున్నారు. ఇది వైద్యులు సిఫారసు చేసినదాని కంటే రెట్టింపు కావటం ఆందోళనకరమైన విషయం. కొన్ని గణాంకాల ప్రకారం భారత్‌లో 70 కోట్లకు పైగా ఇంటర్నెట్‌ వినియోగదారులు, 60 కోట్ల స్మార్ట్‌ఫోన్లు చలామణిలో ఉన్నాయి.

అధిక స్క్రీన్‌ సమయం గురించి దేశవ్యాప్తంగా ఒక నిర్దిష్టమై న సర్వే, సమాచారం వంటివి లేకపోయినప్పటికీ.. స్థానికంగా జరిపే కొన్ని సర్వేలు ఆసక్తికర విషయాలను బయట పెడుతున్నాయి. మహారాష్ట్ర లో అయితే 9-17 ఏండ్ల వయసున్న పిల్లల్లో 22 శాతం మంది రోజుకు సగటున ఆరు గంటలకు పైగా స్క్రీన్‌లపై సమయాన్ని గడుపుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఒకే ఏజ్‌గ్రూప్‌లోని వారు 60 శాతం కంటే ఎక్కువ మంది మొబైల్‌ గేమ్‌లు, సోషల్‌ మీడియాలో రోజుకు కనీసం మూడు గంటలు గడుపుతు న్నారు. ఐదు సంవత్సరాల కంటే తక్కువున్న పిల్లల్లోనూ అధిక స్క్రీన్‌ సమయం ఆందోళనను కలిగిస్తున్నదని వైద్యులు చెప్తున్నారు. టీనేజర్లు, డిగ్రీ కాలేజీ విద్యార్థులలోనూ స్క్రీన్‌ ఎక్స్‌పోజర్‌ ఆందోళన కలిగించే రీతిలోనే ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులలో నాలుగింటా ఒక వంతు మందికి స్మార్ట్‌ఫోన్‌ వ్యసనంగా మారిందని ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ కమ్యూనిటీ మెడిసిన్‌ అధ్యయనంలో వెల్లడైంది. మగ విద్యార్థులలో ఈ వ్యసనం 33 శాతానికి పెరగటం గమనార్హం. చిన్నారులకు స్మార్ట్‌ఫోన్లను ఇస్తున్న తల్లిదండ్రులలో చాలా మంది స్క్రీన్‌ ఎక్స్‌పోజర్‌ తీవ్రతను తక్కువగా అంచనా వస్తున్నారని ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ ఒక సర్వేను ఉదహరిస్తూ తెలిపింది. స్క్రీన్‌ వ్యసనం తీవ్రతను తల్లిదండ్రులు తక్కువగా అంచనా వేస్తున్నారని హెచ్చరించింది. చాలా మందికి వారి పిల్లలు ఫోన్లలో ఎంత సమయాన్ని గడుపుతున్నారన్నది తెలియదని వివరించింది. అధిక స్క్రీన్‌ సమయం ప్రభావం చాలా మందిలో భావోద్వేగ, మానసిక పరిణామాలను విస్మరించేలా చేస్తున్నది. ముఖ్యంగా సోషల్‌ మీడియా ప్రభావంతో అశ్లీల, దారుణమైన పరిస్థితులనూ వారు సర్వసాధారణంగా భావిస్తున్నారని వైద్య నిపుణులు చెప్తున్నారు. సెంటర్‌ ఫర్‌ ఇంటర్నెట్‌ అండ్‌ సొసైటీ (సీఐఎస్‌) 2020 నుంచి 2023 మధ్య సేకరించిన సమాచారం ప్రకారం 18-24 ఏండ్ల వయసున్న యువకులలో 27 శాతం మంది ప్రాబ్లమేటిక్‌ ఇంటర్నెట్‌ యూజ్‌(పీఐయూ)ను ప్రదర్శిస్తున్నారు. అంటే ఇంటర్నెట్‌ను అధికంగా వాడటం, అది వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపెట్టే పరిస్థితిని పీఐయూగా అభివర్ణిస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ల అధిక వినియోగం దీనికి కారణంగా సదరు సమాచారం చెప్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -