Tuesday, July 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఓయూలో పీహెచ్‌డీ రిజర్వేషన్ల లొల్లి

ఓయూలో పీహెచ్‌డీ రిజర్వేషన్ల లొల్లి

- Advertisement -

– విద్యార్థుల విజ్ఞప్తులతో కమిటీ ఏర్పాటు
– ఫలితాలు నిలిపివేసిన అధికారులు
– నిబంధనలు పాటిస్తూ అందరికీ న్యాయం చేస్తాం : ఓయూ వీసీ ప్రొ. కుమార్‌ మెలుగరం
నవతెలంగాణ-ఓయూ

పీహెచ్‌డీ ప్రవేశాల్లో రిజర్వేషన్ల వివాదం గందరగోళానికి దారి తీసింది. దాంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇంటర్వ్యూల ఫలితాలను ఓయూ అధికారులు నిలుపుదల చేశారు. రిజర్వేషన్ల అంశంపై వివిధ విద్యార్థి సంఘాల నుంచి వెలువడిన నిరసన, వినతులు.. విద్యార్థుల విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న యూనివర్సిటీ అధికారులు కమిటీని ఏర్పాటు చేశారు. దాంతో కమిటీ రిపోర్టు వచ్చే వరకు ఫలితాలు వెలువడే అవకాశం లేదని తెలుస్తోంది. రిజర్వేషన్లు అమలు చేయకుండా ఫలితాలు విడుదల చేస్తే పోరాటం తప్పదని పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.

8 మంది సభ్యులతో కమిటీ..
సీనియర్‌ ప్రొఫెసర్‌ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కర్ణసాగర్‌ నేతృత్వంలో 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అనేక విషయాలపై సుదీర్ఘంగా చర్చించి.. తద్వారా అన్ని వర్గాల విద్యార్థులకూ న్యాయం చేయటానికి ప్రయత్నం చేస్తుందని అధికారులు తెలిపారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపైనా సమగ్రంగా అధ్యయనం చేయనున్నట్టు సమాచారం.

కమిటీ అధ్యయనం చేస్తున్న విషయాలు
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై జీవో ఇచ్చినందున ఈ మేరకు పీహెచ్‌డీ సీట్లు కల్పించాలని యూనివర్సిటీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పుట్టి పెరిగిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదువుకుని తిరిగి ఉన్న చదువుల కోసం తెలంగాణకు వచ్చినప్పుడు వారు నాన్‌ లోకల్‌గా మారుతున్నారు. ఈ విషయంపైనా పూర్తిస్థాయిలో చర్చ కొనసాగుతూ కమిటీ పలు రకాల అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. ఇటీవల ఈడబ్ల్యూఎస్‌ వల్ల తమకు అన్యాయం జరుగుతోందని బీసీ విద్యార్థులు బీసీ కమిషన్‌ను సంప్రదించారు. ఈ విషయంపై కూడా కమిటీ చర్చించనున్నట్టు తెలుస్తోంది. పీహెచ్‌డీలో సీట్లు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మందికి లబ్ది చేకూరాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో ఆలోచిస్తున్నట్టు సమాచారం. న్యాయపరమైన సమస్యలు ఎదురవకుండా పీహెచ్‌డీ అడ్మిషన్స్‌ ఇవ్వడానికి అవసరమైన చర్యల గురించి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఓయూలో మొట్ట మొదటిసారిగా పీహెచ్‌డీ సీట్ల మ్యాట్రిక్స్‌పై అత్యంత ప్రామాణికతో కూడిన సమాచారంతో శాస్త్రీయంగా విశ్లేషిస్తూ కమిటీ ముందుకు పోతున్నదని, అందువల్లే ఫలితాల విడుదలలో ఆలస్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు.

అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి
ఓయూ వీసీ ప్రొ. ఎం.కుమార్‌
ఎస్సీలో ఇరువర్గాలు, బీసీ, వికలాంగుల విద్యార్థులు రిజర్వేషన్స్‌ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. దాంతో ఫలితాలను ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేశాం. సీనియర్‌ ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేశాం. విద్యార్థులు మా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి అంశాన్నీ లోతుగా, రాజ్యాంగ బద్ధంగా, నిబంధనల ప్రకారమే పరిశీలిస్తాం. కమిటీ రిపోర్ట్‌ వచ్చాక వారం చివర్లో స్టాండింగ్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఆమోదించిన అనంతరం 10 రోజుల్లో ఓయూ పీహెచ్‌డీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేస్తాం. ఈ విషయంలో పలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి కూడా సలహాలు సూచనలు స్వీకరించాం. అందరూ మా విద్యార్థులే.. ఎవరికీ అన్యాయం చేయాల్సిన అవసరం మాకు లేదు.

వికలాంగుల యాక్ట్‌ను అమలు చేయాలి
వికలాంగుల హక్కుల పోరాట సమితి నేత పి.అంజిగౌడ్‌

2016 వికలాంగుల యాక్ట్‌ ప్రకారం వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి. ఓయూలో పీహెచ్‌డీకి సంబంధించిన సీట్లలో వికలాంగులకు వారి రోస్టర్‌ పాటించడం లేదు.

పీహెచ్‌డీ ప్రవేశాల్లో వర్గీకరణ అమలు రాజ్యాంగ విరుద్ధం
ఆల్‌ మాల స్టూడెంట్‌ అసోసియేషన్‌ ఓయూ అధ్యక్షులు నామ సైదులు
ఓయూ పీహెచ్‌డీ ప్రవేశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. వర్గీకరణ కంటే ముందే వచ్చిన నోటిఫికేషన్లలో వర్గీకరణ ఎలా అమలు చేస్తారు. ఇప్పటికే రోస్టర్‌ విధానం వల్ల మాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలి
ఎంఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్‌ మాదిగ

అంబేద్కర్‌ జయంతి నుంచి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈఏపీసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ అడ్మిషన్లలో.. దోస్త్‌ ద్వారా డిగ్రీ అడ్మిషన్లలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేస్తున్నప్పుడు ఓయూ పీహెచ్‌డీ అడ్మిషన్లలో కూడా అమలు చేయాలి.

రిజర్వేషన్లు సరిగ్గా అమలు చేయాలి
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఆర్‌.ఎల్‌.మూర్తి

ఓయూ పీహెచ్‌డీ అడ్మిషన్‌ ప్రక్రియలో రిజర్వేషన్లు సరిగ్గా అమలు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం జరగకుండా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలి. గత పీహెచ్‌డీ అడ్మిషన్స్‌లో కూడా తప్పుడు పద్ధతిలో చేసి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేశారు. వాటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కామన్‌ పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌లో విద్యార్థుల సీట్‌ మ్యాట్రిక్స్‌ను బహిర్గతపరచాలి.

విద్యార్థులకు న్యాయం చేయండి
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్వామి గౌడ్‌

పీహెచ్‌డీ అడ్మిషన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఓయూ ఓఎస్డీ జితేందర్‌ నాయక్‌, రిజిస్ట్రార్‌ నరేష్‌రెడ్డి, బీసీ కమిషన్‌ చైర్మెన్‌ నిరంజన్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఓయూ అధికారుల నుంచి స్పందన లేకపోవడం బాధాకరం. 40పైన సీట్లు ఉన్నప్పుడు మాత్రమే లేదా అదనపు సీట్లు పెంచినపుడు మాత్రమే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలవుతుంది. కానీ పీహెచ్‌డీ సీట్లు పరిమిత సంఖ్యలో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈడబ్ల్యూస్‌ రిజర్వేషన్‌ను అమలు చేయడానికి వీల్లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -