నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్ కేసులో బుధవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచిన సంగతి విదితమే. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ప్రకాష్ రాజ్‌తో పాటు పలువురు సినీనటులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ నోటీసుల మేరకు నేడు ప్రకాష్ రాజ్ హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు పలువురు సినీ సెలబ్రిటీలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌ల ప్రమోషన్ ద్వారా పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే హీరోలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, సినీనటి మంచు లక్ష్మి వంటి వారికి కూడా ఈడీ నోటీసులు పంపింది.
రానా దగ్గుబాటి ఇప్పటికే విచారణకు హాజరుకావాల్సి ఉండగా, సినిమా షూటింగ్‌లు ఉండడంతో విచారణకు మరికొంత సమయం కోరారు. కాగా, ఆగస్టు 6 న విజరు దేవరకొండ, ఆగస్టు 13 న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాల్సి ఉంది.