నవతెలంగాణ – హైదరాబాద్: రష్యా తూర్పు ప్రాంతంలో సంభవించిన పెను భూకంపంతో పసిఫిక్ మహాసముద్రంలో సునామీ ఏర్పడింది. దీని ప్రభావంతో ఉవ్వెత్తున ఎగిసిన అలలు జపాన్ తీరంపై విరుచుకుపడ్డాయి. సముద్రగర్భంలో సంచరించే భారీ తిమింగలాలను తీరానికి ఎత్తిపడేశాయి. జపాన్‌లోని చింబా తీరానికి నాలుగు భారీ తిమింగలాలు కొట్టుకొచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ తిమింగలాలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. సునామీ కారణంగా ఫుకుషిమా డయీచీ అణుకేంద్రం నుంచి ఉద్యోగులను సురక్షిత ప్రాంతలకు తరలించారు.
పసిఫిక్ తీరంలోని పలు దీవులను సునామీ అలలు ముంచెత్తాయి. టొకచాయ్ పోర్టులో 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడగా, హన్సంకిలో 30 సెంటీమీటర్లు, ఎరిమో పట్టణంలో 30 సెంటీమీటర్ల మేర అలలు వచ్చాయి. థోకు, కాంటో ప్రాంతాల్లోనూ భారీ అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లోని ఎయిర్ పోర్టుల్లో జపాన్ అలర్ట్ ప్రకటించింది. సెండాయ్ విమానాశ్రయాన్ని అధికారులు మూసివేసి విమానాలను దారిమళ్లించారు.