సాగర్‌లో పెరుగుతున్న వరద ఉధృతి
సందర్శకుల రద్దీ
నవతెలంగాణ-నాగార్జునసాగర్
ఎగువనున్న శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వస్తున్న వరద ఉధృతి మరింతగా పెరిగింది. శ్రీశైలంలో ఎనిమిది గేట్లను ఎత్తారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో మంగళవారం మంత్రులు డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేసిన విషయం విధితమే. మంగళవారం సాయంత్రం వరకు నాగార్జునసాగర్ డ్యాం మొత్తం 26 గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తగా.. ఆ తర్వాత వరద ప్రవాహం పెరగడంతో 16 గేట్లను ఐదు అడుగుల మేరకు, 10 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. బుధవారం వరద ఇంకా ఎక్కువగా వస్తుండటంతో క్రస్ట్ గేట్లను మరింత ఎత్తు పైకి ఎత్తారు. శ్రీశైలం నుంచి 282,364 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 586 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి రెండు లక్షల 65 వేల 80 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ ద్వారా 7894 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాలువ ద్వారా 7272 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 29029 క్యూసెక్కులను, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులను, వరద కాలువ ద్వారా 300 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి శ్రీశైల జలాశయానికి 255439 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. ప్రస్తుతం 885 అడుగులకుగాను 882.80 అడుగుల వద్ద నీరు ఉంది. శ్రీశైలం డ్యాం ఎనిమిది గేట్లను 10 అడుగులకు మేరకు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
పర్యాటకుల సందడి
నాగార్జునసాగర్ జలాశయం పూర్తిగా నిండటం డ్యాం క్రస్ట్ గేట్లు మొత్తం ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో పర్యాటకుల సందడి పెరిగింది. సాగర్ అందాలను చూడటానికి అధిక సంఖ్యలో వస్తున్నారు. నాగార్జునసాగర్‌లోని డ్యాం దిగువ భాగాన, ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద, పాత బ్రిడ్జి వద్ద, లాంచి స్టేషన్ లాంటి పర్యటక ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ పెరిగింది. డ్యాం దిగువ భాగాన నీరు విడుదల అయ్యే ప్రాంతంలో పర్యాటకుల వాహనాలతో కొత్త బ్రిడ్జిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో చాలాసేపు నిలిచిపోయాయి. పర్యాటకుల సౌకర్యార్థం తెలంగాణ టూరిజం లాంచ్ స్టేషన్‌ను, విజయ విహార్ లెఫ్ట్ ఎర్త్ డ్యాం లాంచ్ యూనిట్‌ను తాత్కాలికంగా మార్చి నాగార్జునకొండకు లాంచీల రాకపోకలు నిర్వహిస్తున్నారు.
శ్రీశైలంలో 8 గేట్ల ఎత్తివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES