– అర్ధరాత్రి సోదాలు, రూ.11 కోట్ల నగదు స్వాధీనం
– ‘వర్ధమాన్’ లిక్కర్ వ్యాపారంతో కలకలం
– కీలక ఉద్యోగి వినరురెడ్డి అరెస్టు
నవతెలంగాణ-శంషాబాద్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యానికి ఏపీలోని లిక్కర్ స్కామ్‌తో సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మంగళవారం అర్థరాత్రి మంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఏపీ సీట్ అధికారులు కాలేజ్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా లిక్కర్ స్కామ్‌పై సిట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నలభై మందిని విచారించారు. రెండు రోజుల క్రితం శంషాబాద్ మండలంలోని కాచారం వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ఉద్యోగి వినరురెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన వర్ధమాన్ కళాశాలలో కీలకపాత్ర పోషిస్తూ.. యాజమాన్యానికి అత్యంత సన్నిహితునిగా కొనసాగుతున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించిన సిట్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. వర్ధమాన్ కాలేజీకి చెందిన తీగల విజయేందర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డికి చెందిన సులోచన ఫామ్‌హౌస్‌లో నగదును అట్టపెట్టెల్లో దాచిపెట్టినట్టు సిట్ అధికారులకు వినరురెడ్డి చెప్పారు. ఆయన ఇచ్చిన సమాచారంతో మంగళవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో సిట్ అధికారులు ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు లిక్కర్ స్కాంకు సంబంధించినట్టుగా అధికారులు గుర్తించారు. వినరురెడ్డితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా సోదాలు నిర్వహించిన అనంతరం ఫామ్‌హౌస్ యాజమాన్యం గేటుకు తాళం వేసి లోపలికి ఎవరూ వెళ్లకుండా చేసింది.
వర్ధమాన్ కళాశాల ఇష్టారాజ్యం
కొంతకాలంగా వర్ధమాన్ కళాశాలలోకి మీడియాను కూడా అనుమతించకుండా యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. అక్కడ ఏం జరుగుతోందన్న విషయం ప్రజలకు తెలియకుండా అత్యంత గోప్యత పాటిస్తూ వచ్చారు. కళాశాలతో సంబంధం కలిగిన అన్నింటిని తన మేనేజ్‌మేంట్ స్కిల్స్‌తో తొక్కిపెట్టారు. సమాచార హక్కు చట్టం కింద ఇవ్వాల్సిన సమాచారాన్ని కూడా తమచెప్పు చేతుల్లోకి తీసుకున్నారని తెలిసింది.
కళాశాల అనుమతులు రద్దు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రణయ్
విద్యా వ్యాపారంతో లిక్కర్ వ్యాపారం.. తెలంగాణ రాష్ట్ర విద్యాభివృద్ధికి తీవ్ర ఆటంకమని ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రణరు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ లిక్కర్ కుంభకోణంలో వర్ధమాన్ కళాశాల యాజమాన్యం కుమ్మక్కు అయిందని, వెంటనే కళాశాల యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకుని విచారించాలన్నారు. కళాశాల లైసెన్స్‌ను కూడా రద్దు చేసి, ఆర్థిక కుంభకోణాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కళాశాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
సులోచన ఫామ్‌హౌస్‌లో ఏపీ సీట్ అధికారుల దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES