ప్రేమ, ఇష్టం, అభిమానం.. వీటి మధ్య తేడా చాలా ఉంటుంది. అన్నింటినీ ఒకే విధంగా చూడలేము. ఒక వ్యక్తికి ఎదుటి వ్యక్తి నుండి ఏమి కోరుకుంటున్నారో ఒక స్పష్టత ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. మనం ఒకరిపై ఇష్టాన్ని ప్రదర్శిస్తే ఎదుటి వారు దాన్ని ప్రేమగా భావించవచ్చు. కాబట్టి మనం ఎదుటి వ్యక్తిపై చూపుతుంది ఇష్టమా లేదా ప్రేమా అనేది వారికి అర్థమయ్యేలా నడుచుకోవాలి. అది వాళ్లకు కూడా అర్థం కావాలి. లేదంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలిపే కథనమే ఈ వారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో…
సాహితికి శ్రీకాంత్‌తో పెండ్లి జరిగి ఎనిమిదేండ్లు అవుతుంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఆమె ఒక ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంది. భర్త బిజినెస్ చేస్తున్నాడు. శ్రీకాంత్ తల్లిదండ్రులు గ్రామంలో ఉంటారు. వీరు మాత్రం వృత్తిరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. శ్రీకాంత్‌కు వేరే అమ్మాయితో సంబంధం ఉందని సాహితికి అనుమానం. ఆ విషయం భర్తను నేరుగా అడిగితే అతను ఏమనుకుంటాడో, లేకపోతే నిజంగానే అలాంటి సంబంధం వుంటే తనకు తెలియకుండా జాగ్రత్త పడతాడో ఏమో అని అడగకలేక పోతుంది.
భర్త ఫోన్ తీసుకుని తరచూ చెక్ చేసేది. బ్యాంకు డీటెయిల్స్ చెక్ చేసేది. కానీ శ్రీకాంత్‌కు ఎప్పుడూ ఎలాంటి అనుమానం వచ్చేది కాదు. శ్రీకాంత్ తన స్నేహితులను ఇంటికి పిలిచేవాడు. వీళ్లు కూడా స్నేహితుల ఇంటికి వెళ్లడం, రావడం జరుగుతూనే ఉంటుంది. శ్రీకాంత్ స్నేహితుడు దినేష్, సాహితిని బాగా అభిమానించేవాడు. ఆమెతో ఎక్కువగా మాట్లాడే వాడు. ఆమె మాట్లాడే విధానం చూసి సాహితిపై మరింత గౌరవం పెరిగింది. ఆ విషయం శ్రీకాంత్‌కు తెలుసు. అయినా శ్రీకాంత్ ఎప్పుడూ ఆమెను అనుమానించలేదు.
అయితే శ్రీకాంత్ తన చిన్ననాటి స్నేహితురాలు కవితతో మాట్లాడినా, ఆమెను వారి ఇంటికి పిలిచినా సాహితికి నచ్చేది కాదు. దాంతో ఇద్దరి మధ్య అప్పుడప్పుడు వాదులాట జరిగేది. తిరిగి ఉదయం మామూలుగా ఉండేవాళ్లు. కానీ ఈసారి గొడవ జరిగినపుడు అలా జరగలేదు. శ్రీకాంత్ సాహితితో మాట్లాడడం తగ్గించాడు. ఏం మాట్లాడినా అవును, కాదు అంటూ సమాధానం ఇచ్చేవాడు. అతని బిజినెస్ గురించి సాహితితో చర్చించడం మానేశాడు. ఇదంతా సాహితి తట్టుకోలేకపోయింది. సహాయం కోసం ఐద్వా అదాలత్‌కు వచ్చింది.
మేము శ్రీకాంత్‌కు ఫోన్ చేసి పిలిపిస్తే అతను ‘కవిత అంటే నాకు గౌరవం, అభిమానం, ఇష్టం ఎందుకంటే కవిత నాకు మంచి స్నేహితురాలు. అలాగే నా శ్రేయోభిలాషి. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం కవిత. ఆమె ప్రోత్సాహం లేకపోతే బిజినెస్‌లో నేను ఈ రోజు ఇంతగా ఎదిగేవాడిని కాదు. నాపై నా తల్లిదండ్రులకే నమ్మకం లేని రోజు నేను వ్యాపారం చేసి విజయం సాధిస్తానని నమ్మిన ఒకే ఒక్క వ్యక్తి కవిత. ఆమె నమ్మడమే కాదు నాకు ఆర్థికంగా కూడా సహాయం చేసింది. ఆ డబ్బు నేను ఆమెకు తిరిగి ఇచ్చేశాను. కానీ ఆరోజు ఆమె నాపై చూపిన నమ్మకం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవిత కాలం నేను ఆమెకు రుణపడి ఉంటాను. కవిత అంటే నాకు ఇష్టం. కానీ సాహితి అనుకున్నట్టు కాదు. ఒక స్నేహితుడిగా, ఒక సోదరుడిగా ఆమె నాపై కూడా ప్రేమ చూపుతుంది. నేను కూడా అంతే. నాకు ఆమెంటే అపారమైన గౌరవం.
వ్యాపారంలో నేను ఎక్కడ పొరపాటు చేస్తానో అని అన్ని విధాలుగా నాకు అండగా వుంటుంది. ఆ విషయం ఆమె భర్తకు కూడా తెలుసు. కానీ అతను ఏ రోజు మమ్మల్ని అనుమానించలేదు. మా బంధం అలాంటిది. నేను కూడా ఆ నమ్మకంతోనే సాహితిని ఏ రోజూ అనుమానించలేదు. నా స్నేహితులు కూడా సాహితితో చాలా సన్నిహితంగా ఉంటారు. బాగా మాట్లాడతారు. సాహితి వాళ్లతో కలిసి నన్ను ఆటపట్టిస్తుంది. కానీ నేను ఆమెను అనుమానించలేదు. నేను ఆపని చేయలేను. ఎందుకంటే ఆమెపై నాకు అంత నమ్మకం, ప్రేమ, అభిమానం.
సాహితి ప్రతి రోజూ నా ఫోన్ తీసుకొని చెక్ చేస్తుంది. నేను ఇప్పటి వరకు ఆమె ఫోన్ తీసి చూడలేదు. కావాలంటే ఆమెనే అడగండి. భార్యపై నమ్మకం లేని వ్యక్తి అసలు నా దృష్టిలో మనిషే కాడు. కానీ సాహితి నన్ను అనుమానిస్తుంది. ఆ బాధతోనే ఆమెతో మాట్లాడడం మానేశాను. నా విషయాలు ఆమెతో పంచుకోవడం లేదు. దానికి కారణం సాహితి. ఆమెకు నాపై నమ్మకం లేదు. పెండ్లికి ముందు నుండే మాకు పరిచయం ఉంది. నా స్నేహితులు అందరూ ఆమెకు తెలుసు. నా జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఉంటుంది. అన్ని తెలిసి కూడా నన్ను అనుమానిస్తుంది. అది కూడా కవిత విషయంలో ఆమె అలా అనుకోవడం నాకు చాలా బాధ కలిగించింది. సాహితిని నేను తిట్టలేను. అందుకే మాట్లాడడం మానేశాను. ఇంతకు మించి మా మధ్య ఎలాంటి సమస్యా లేదు’ అని చెప్పాడు.
శ్రీకాంత్ చెప్పింది మొత్తం విన్న తర్వాత సాహితికి తాను చేసిన పొరపాటు ఏమిటో అర్థమయింది. భర్త తనను ఎంతగా నమ్ముతున్నాడో తెలుసుకొని గర్వపడింది. అలాంటి భర్తను అనుమానించినందుకు పశ్చాత్తాప పడింది. శ్రీకాంత్‌ను క్షమించమని అడిగింది. కానీ శ్రీకాంత్ ‘నాకు కొంత సమయం పడుతుంది. నేను ఇంతగా నమ్మే నా భార్యే నా గురించి ఇలా అనుకుంటే ఇక ఇతరులు ఏమనుకుంటున్నారో అనే అనుమానం వస్తుంది. ఇదంతా మర్చిపోయి నేను మామూలు మనిషిని కావాలంటే కొంత సమయం పడుతుంది’ అన్నాడు.
భర్త మాటలకు సాహితి ‘మీకు కావల్సినంత సమయం తీసుకోండి. నాతో మాట్లాడకుండా ఉండకండి. నేను భరించలేను’ అని చెప్పింది. సాహితి బాధను చూసి శ్రీకాంత్ కాస్త మెత్తబడ్డాడు. ఇకపై ఎలాంటి అనుమానాలు లేకుండా హాయిగా ఉందామని ఒకరికొకరు మాట ఇచ్చుకుని ఐద్వా ఆఫీస్ నుండి సంతోషంగా వెళ్లారు.
ప్రేమ అందిరిపైనా ఒకేలా ఉండదు. వ్యక్తులు, బంధాలను బట్టి మారుతుంది. భార్యపై చూపించే ప్రేమ వేరు, స్నేహితులపై చూపే ప్రేమ వేరు, తల్లిదండ్రులపై చూపే ప్రేమ వేరు. ఇది ప్రతిఒక్కరూ అర్థం చేసుకోవాలి.
– వై వరలక్ష్మి,
9948794051
మనిషిని అర్ధం చేసుకుంటేనే..
- Advertisement -
- Advertisement -