– ఏడు జిల్లాల్లోనే రూ.258 కోట్లకు పైగా స్వాహా
– తాజా సోదాల్లో వెల్లడైన నిజాలు : ఈడీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ స్కీమ్‌కు సంబంధించి ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ”గతనెల 30న హైదరాబాద్‌లో తాము ఎనిమిది మంది ఇండ్లలో జరిపిన సోదాల్లో జరిగిన కుంభకోణానికి సంబంధించి పలు ఆధారాలు లభించాయి. రాష్ట్ర పశుసంవర్థక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వద్ద ఓఎస్డీగా పని చేసిన జి.కళ్యాణ్ నివాసంతో పాటు మరికొందరు మధ్య దళారుల నివాసాల్లో తమ సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో ఒకరి ఇంటి నుంచి రూ.200కు పైగా నకిలీ లబ్దిదారులకు సంబంధించిన పాస్‌బుక్‌లు, డెబిట్‌కార్డులు, బ్లాంక్ చెక్‌బుక్‌లు, ఇతర సామాగ్రిని స్వాధీనపర్చుకున్నాం. మరో ఇంటి నుంచి 32 సెల్‌ఫోన్లు, 20కి పైగా సిమ్‌కార్డులను స్వాధీనపర్చుకున్నాం. ఇప్పటివరకూ తాము జరిపిన దర్యాప్తులో ఏడు జిల్లాల్లోనే రూ.258.98 కోట్లు స్వాహా చేసినట్టు తేలింది.
ఈ దామాషాలోనే పరిశీలించగా మొత్తం 33 జిల్లాలకు సంబంధించి రూ.వెయ్యి కోట్ల వరకు పశుసంవర్థక శాఖకు చెందిన కొందరు అధికారులు, దళారులు స్వాహా చేసినట్టు రూఢ అవుతున్నది. 2021లోనే గొర్రెల పంపిణీకి సంబంధించి కాగ్ జరిపిన ఆడిట్‌లో భారీ ఎత్తున నిధుల గోల్‌మాల్‌తో పాటు అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్టు తేలింది. ముఖ్యంగా నకిలీ లబ్దిదారులను సృష్టించి వారి పేరిట బ్యాంకు ఖాతాలు తయారు చేసి, అందులోకి గొర్రెల పంపిణీ స్కీమ్‌కు సంబంధించిన నిధులను డిపాజిట్ చేసి మోసానికి పాల్పడ్డారు. కొన్ని రాష్ట్రాల నుంచి గొర్రెలను తీసుకువచ్చినట్టు, వాటిని లబ్దిదారులకు చేరవేసినట్టు నకిలీ బిల్లులు, ఇన్వాయిస్‌లు సృష్టించి భారీ ఎత్తున నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డారు. ముఖ్యంగా గొర్రెలను పంపిణీ చేయటానికి ఉపయోగించిన వాహనాల నెంబర్లు కూడా నకిలీవేనని బయటపడ్డాయి. ఇందులోనే ఒక గొర్రెల పంపిణీదారుడికి చెల్లించాల్సిన రూ.2.1 కోట్లను ఆయన ఖాతాలో వేయకుండా ఈ శాఖకు చెందిన ఒక డిప్యూటీ డైరెక్టర్ దారి మళ్లించినట్టుగా కూడా బయటపడింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే తమ దర్యాప్తు కొనసాగుతున్నది. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము స్వాహా వెనుక మనీలాండరింగ్ కూడా చోటు చేసుకున్నది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది” అని ఈడీ అధికారులు వివరించారు.
గొర్రెల పంపిణీ స్కాం రూ.వెయ్యి కోట్ల పైనే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES