Saturday, August 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసైబర్‌ క్రిమినల్స్‌ అడ్డాలపై 'నిఘా'

సైబర్‌ క్రిమినల్స్‌ అడ్డాలపై ‘నిఘా’

- Advertisement -

– హైదరాబాద్‌ పోలీసుల స్పెషల్‌ ఆపరేషన్‌
– 8 రాష్ట్రాల్లో దాడులు
– దేశవ్యాప్తంగా 179 కేసుల నమోదు, 48 మంది అరెస్ట్‌
– బాధితులకు రూ.2,21,70,130 కోట్లు అందజేత
నవతెలంగాణ-సిటీబ్యూరో

దేశవ్యాప్తంగా ఉన్న సైబర్‌ క్రైమ్‌ అడ్డాల్లో హైదరాబాద్‌ పోలీసులు స్పెషల్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్‌ యాప్‌లు వినియోగించి నేరాలకు పాల్పడుతున్న వారిపై పంజా విసిరారు. కస్టమర్‌కేర్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో కొందరు అమాయకులను మోసగిస్తుంటే.. మరికొందరు క్రెడిట్‌ కార్డులు, ట్రేడింగ్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌ పేరుతో అందినకాడికి దండుకుంటున్న వారి తాటతీశారు. డిజిటల్‌ అరెస్టులు, లోన్స్‌, ఉద్యోగ్యాలు ఇప్పిస్తామంటూ మాయమాటలతో చదువుకున్న వారిని సైతం బుట్టలో వేసి బ్యాంక్‌ ఖాతాలను ఖాళీ చేస్తున్న దుండగులను గుర్తించారు. ముఖ్యంగా రాజస్థాన్‌, బీహార్‌, ఢిల్లీ, గోవా, బెంగళూర్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో అడ్డావేస్తున్న సైబర్‌ నేరస్థులు దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలోనూ వారి ఆగడాలు మితిమీరుపోతుండటంతో హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. సైబర్‌క్రైమ్‌ అడ్డాల్లోకే వెళ్లి నిందితుల వెంటపడి, వేటాడి పంజా విసిరారు.
8 రాష్ట్రాల్లో ప్రత్యేక తనిఖీలు.. 179 కేసుల నమోదు
వివిధ రాష్ట్రాలను అడ్డాగా మార్చుకున్న సైబర్‌ క్రైమ్‌ నిందితులు ఇంటర్నెట్‌ కాల్స్‌, కృత్రిమ మేధ సహాయంతో మార్ఫింగ్‌ వీడియోలు, వాయిస్‌ కాల్స్‌ లాంటి మోసాలపై తర్ఫీదు పొందు తున్నట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. ఆ దిశగా ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌, అస్సాం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, గుజరాత్‌, గోవా, హర్యానా, జార్ఖండ్‌, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిషా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, సిక్కిం, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, జమ్ము అండ్‌ కాశ్మీర్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 179 కేసులు నమోదు చేసిన సీసీఎస్‌ పోలీసులు 48 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 89 సెల్‌ఫోన్లు, చెక్‌బుక్‌లు-56, డెబిట్‌ కార్డ్‌లు-94, ల్యాప్‌టాప్‌లు-03, షెల్‌ కంపెనీ స్టాంపులు-12, సిమ్‌కార్డులు-25, బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలు-39, ట్యాబ్‌లు-2, ప్యాక్‌ ఆఫ్‌ విజిటింగ్‌ కార్డులు, నగదు రికవరీ చేశారు. వారి చేతుల్లో మోసపోయిన బాధితులకు కోర్డు ఆదేశాలతో రూ.2,21,70,130 కోట్లు అందజేశారు.
ఒక్క నెలలోనే 301 ఫిర్యాదులు
ఈ ఏడాది ఒక్క జులైలోనే సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్లకు 301 ఎన్‌సీఆర్‌పీ ఫిర్యాదులు అందాయి. బాధితుల ఫిర్యాదుతో హైదరాబాద్‌ నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దేశమంతటా ప్రత్యేక తనిఖీలను నిర్వహించారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన నేరస్థులను వెంటాడి 48 మందిని అరెస్టు చేశారు వారిలో ఆరుగురు డిజిటల్‌ అరెస్ట్‌ మోసాల్లో పాలుపంచుకోగా, 21 మంది పెట్టుబడి, ట్రేడింగ్‌ మోసాలకు పాల్పడుతున్నారు. మిగిలిన 21 మంది వివిధ రకాల మోసాలలో పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. దేశం అంతటా మొత్తం 415 కేసుల్లో నిందితులు పాల్గొన్నట్టు తేలింది. వీరిలో 78 మంది నిందితులు తెలంగాణలో వివిధ నేరాలకు పాల్పడ్డారు.
స్పందించకపోవడమే ఉత్తమ మార్గం
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌కు స్పందించకపోవడమే ఉత్తమ మార్గం. అటు నుంచి రికార్డ్‌ చేసిన వీడియో కాల్‌ను మార్ఫింగ్‌ చేసి బెదిరించి డబ్బులు గుంజుతారని గ్రహించాలి. ప్లస్‌(ం)తో మొదలయ్యే కాల్‌ వస్తే పట్టించుకోవద్దు. అనుమానాస్పదంగా అనిపించినా, మోసపోయినట్టు గ్రహించినా 1930కు ఫిర్యాదు చేయండి.
– డీసీపీ డి.కవిత

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -