– సరిగ్గా చదవడం లేదని మందలించడమే కారణమా..?
– హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో ఘటన
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
తీవ్ర మనస్థాపానికి గురై బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ మూడో ఫేజ్‌లోని మంజీరా త్రినిటీ హౌమ్స్‌లో పదేండ్ల నుంచి ఆకుల హరి నారాయణమూర్తి భార్య, ఇద్దరు కుమార్తెలతో నివసిస్తున్నాడు. పెద్ద కుమార్తె బీటెక్ 2వ సంవత్సరం ఐఐటీ పాట్నాలో చదువుకుంటుంది. చిన్న కుమార్తె ఆకుల లాస్య ప్రియ (13) కేపీహెచ్‌బీ అడ్డగుట్టలోని నారాయణ హై స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. కాగా, గురువారం లాస్య ప్రియ స్కూలుకు వెళ్ళింది అయితే మధ్యాహ్నం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌కు హాజరుకావాలని లాస్య తల్లిదండ్రులకు స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. దాంతో లాస్య తల్లి మీటింగ్‌కు వెళ్లింది. అక్కడ టీచర్స్ లాస్య సరిగ్గా చదవడం లేదని, చదువు పట్ల అశ్రద్ధ చూపిస్తున్నదని, కౌన్సెలింగ్ ఇవ్వాలని తెలిపారు. ఈ మేరకు సాయంత్రం లాస్య తల్లి తన భర్తకు విషయాన్ని చెప్పింది. ఇదిలా ఉండగా రాత్రి 8.30 గంటల సమయంలో లాస్య తల్లిదండ్రులతో కలిసి డిన్నర్ చేసింది. అదే సమయంలో లాస్య తండ్రి తన కూతురును బాగా చదవాలని చెప్పాడు. అనంతరం లాస్య తన బెడ్‌రూమ్‌కు వెళ్లింది. అయితే సుమారు 10:30 గంటలకు అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ నరసింహారావు, లాస్య తండ్రికి ఫోన్ చేసి, మొదటి అంతస్తుకు రావాలని చెప్పారు. అనుమానంతో లాస్య తండ్రి తన కూతురు బెడ్‌రూమ్ తలుపు తీయడానికి ప్రయత్నించగా అది లాక్ చేసి ఉంది. తండ్రి కీతో తలుపు తీశాడు. కానీ లోపల లాస్య కనిపించలేదు. బాత్‌రూమ్ తలుపు కూడా తట్టి చూశాడు. స్పందన లేకపోవడంతో కీ తో తలుపు తెరిచాడు. అక్కడ కూడా ఆమె కనిపించలేదు. బాత్‌రూమ్ విండో గ్లాస్ తొలగించి ఉన్నట్టు గమనించారు. వెంటనే నారాయణమూర్తి మొదటి అంతస్తుకు వెళ్లగా అక్కడ తన కుమార్తె మృతదేహం కనిపించింది. 17వ అంతస్తు నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయిందని గుర్తించారు. తన కూతురు ఎందుకు ఇలా చేసిందో అర్థం కావట్లేదని తండ్రి కేపీహెచ్‌బీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాలిక ఆత్మహత్య..!
- Advertisement -
- Advertisement -