– అధికారం అండతో దేశానికి సవాల్
– ఎంహెచ్ స్మారకోపన్యాసంలో ప్రబీర్ పుర్కాయస్థ
– గేదెల మాధవరావుకు ఎంహెచ్, శివాజీ, రాజశేఖర్‌లకు బొమ్మారెడ్డి ఉత్తమ జర్నలిస్టు అవార్డుల ప్రదానం
అమరావతి : దేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటిపై మతతత్వ శక్తుల దాడి పెరుగుతోందని న్యూస్‌క్లిక్ చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాశక్తి 45వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో మోటూరు హనుమంతరావు 24వ స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు ప్రదానోత్సవ సభ శుక్రవారం జరిగింది. ప్రజాశక్తి సంపాదకులు బి.తులసీదాసు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రజాశక్తి సాహితీ సంస్థ ప్రతిష్టాత్మకంగా అందించే మోటూరు హనుమంతరావు (ఎంహెచ్) స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డును గిరిజన ప్రాంత సమస్యలపై కథనాలు ఇచ్చిన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి ఆంధ్రజ్యోతి విలేకరి గేదెల మాధవరావుకు ప్రబీర్ పుర్కాయస్థ ప్రదానం చేశారు. విఆర్.బొమ్మారెడ్డి ఉత్తమ జర్నలిస్టు అవార్డులను ఎం.శివాజీ (ప్రజాశక్తి బ్యూరో), డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రజాశక్తి విలేకరి పి.రాజశేఖర్‌లకు మాజీ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు, ప్రముఖ జర్నలిస్టులు తెలకపల్లి రవి, నల్లి ధర్మారావు, ప్రజాశక్తి ఎడిటర్ బి.తులసీదాస్ ప్రదానం చేశారు. ‘ప్రజాస్వామ్యం-పత్రికాస్వేఛ్చ’ అనే అంశంపై మోటూరు హనుమంతరావు స్మారకోప న్యాసాన్ని ప్రబీర్ పురకాయస్థ అధికారం అండతో చెలరేగుతున్న మతతత్వం దేశానికి పెనుసవాలుగా మారిందని అన్నారు. దీనిలో భాగంగానే మీడియా కూడా తీవ్ర సవాళ్లను ఎదుర్కుంటోందని చెప్పారు. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తరు వాత పత్రికారంగం కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోయింద న్నారు. వాస్తవాలు చెప్పడం కంటే ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయో చెప్పడానికి పరిమితం అయ్యేలా పాలకులు వాటిపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటకాలంలో పత్రికా రంగం కీలకపాత్ర పోషించిందని పేర్కొన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని ఆందోళన జరుగుతున్న సమయంలోనే ప్రజల భావాలను వ్యక్తం చేయడంలో పత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయన్నారు. ప్రాంతీయ భాషల్లో భావాలను ప్రజలకు వివరించడంలో పత్రికలు కీలకపాత్ర పోషించాయని, అది వివిధ సమూహాల మధ్య ఐక్యతకు బాటలువేసిందని చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సమైక్యంగా పోరాడేందుకు దోహదపడిందని అన్నారు.ఎమర్జెన్సీ సమయంలోనూ పత్రికల ద్వారానే జనసమూహానికి సమాచారం అందేదని చెప్పారు. అలాంటి పత్రికా రంగానికి ప్రస్తుతం మతతత్వశక్తుల రూపంలో ప్రమాదం వచ్చిపడిందని వివరించారు. మరోవైపు సోషల్ మీడియాను తిరోగామి శక్తులు చేజిక్కించుకుని ప్రజల్లో విషబీజాలు నాటుతున్నాయని చెప్పారు. దీనివల్ల ప్రజల్లో ఐక్యత దెబ్బతింటోందని వివరించారు. మీడియా రంగంలోకి వచ్చి న్యూస్‌క్లిక్ ఏర్పాటు చేసిన తరువాత పత్రికా రంగం ఎంత ఒత్తిడులకు గురవుతుందో అర్థం చేసుకోగలిగామని, ఇటీవల మోడీ అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ఈ ప్రమాదం మరింత తీవ్రమైందని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకుని మతోన్మాదశక్తులు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నాయని, ఇది ప్రమాదకరమైన ధోరణని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజల అభిప్రాయాన్ని సంఘటితం చేయడం, భావజాలాన్నీ నవీకరించుకోవడం ద్వారానే ఏదైనా ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. అనేక పరిశోధనల వల్ల శాస్త్ర పరిజ్ఞానం పురోగమించడం వల్ల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. దీనిని సక్రమంగా ప్రజలకు చేరవేయడం ప్రజాపత్రికల బాధ్యత అని చెప్పారు. ప్రతితరం కొత్త సవాళ్లను ఎదుర్కొంటుందని, దాన్ని తట్టుకుని ముందుకు వెళితేనే విజయం సాధ్యమవుతుందని ప్రబీర్ పురకాయస్థ వివరించారు. ప్రజాశక్తి చీఫ్ జనరల్ మేనేజర్ వై.అచ్యుతరావు అవార్డు పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పెరుగుతున్న మతతత్వ ముప్పు
- Advertisement -
- Advertisement -