నవతెలంగాణ-హైదరాబాద్: దక్షిణ కాశ్మీర్‌లో మరో ఉగ్రవాది మృతి చెందాడు. శనివారం దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా అఖల్ ప్రాంతంలో భద్రతా దళాలు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించాయి. శుక్రవారం (ఆగస్టు 1) సాయంత్రం నుండి ఆ ప్రాంతంలోని అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులపై ఆర్మీ, సిఆర్పీఎఫ్, పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజి) సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. రాత్రి సమయంలో తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాలు అప్రమత్తంగా స్పందించడంతో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. ఇంకా కొంతమంది ఉగ్రవాదులు అక్కడే దాక్కుని ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ విషయాన్ని చినార్ కార్ప్స్ అధికారికంగా వెల్లడించింది.
ఈ వారం జమ్మూ & కాశ్మీర్‌లో ఇది మూడవ ఎన్‌కౌంటర్. ఇటీవల పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులతో పాటు ఇప్పటివరకు ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా పరంగా పరిస్థితిని అదుపులో ఉంచేందుకు దళాలు భారీ నిఘా కొనసాగిస్తున్నాయి.