నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన ఐఐసీసీ లీగల్ సెల్ కార్యక్రమంలో ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజా పక్షంలో నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని బీజేపీ ప్రశ్నిస్తోందని 140 ఏళ్ల కిందటే ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు కదంతొక్కిందే కాంగ్రెస్ పార్టీ అని బ్రిటీష్ పాలకులను తరిమికొట్టింది కాంగ్రెస్సే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ సహా మిగతా పార్టీలు అధికారం లేకపోతే ఇంటికి పరిమితం అవుతాయని ఎద్దేవా చేశారు.
ఇందిరా గాంధీ పాకిస్తాన్ ను ముక్కలు చేసిందని, తీవ్రవాదంపై పోరాటం చేసి ఇందిరా, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారన్నారు. ప్రధాని పదవిని త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీ అని చెప్పారు. దేశం కోసం మన్మోహన్ ను ప్రధానిని చేశారన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో అవకాశం వచ్చినా కేంద్ర మంత్రి పదవిని, ప్రధాన మంత్రి పదవిని తీసుకోకుండా సీనియర్లకు అవకాశం ఇచ్చి తాను కార్యకర్తలా పేద ప్రజల కోసం పని చేస్తున్నారన్నారు. పదవులు త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిదని చెప్పారు.
కానీ నరేంద్ర మోడీ మాత్రం పదవిని వదులుకోవడం లేదని విమర్శించారు. 75 ఏళ్ల తర్వాత పదవిలో ఉండొద్దని ఇటీవలే మోహన్ భగవత్ చెప్పారు. అయినా మోడీ మాత్రం తన కుర్చీ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. గతంలో అద్వానీ, మురళీ మనోహర్ కు వర్తించిన వయస్సు మోడీకి వర్తించదా అని ప్రశ్నించారు. మోడీని దించడం బీజేపీ, సంఘ్ పరివార్ నేతల వల్ల కాదని, మోడీని పదవి నుంచి దించబోయేది రాహుల్ గాంధీ మాత్రమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీని ఓడించి దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతామన్నారు. సామాజిక న్యాయం కాపాడుతామన్నారు. మోడీ లేకుండా బీజేపీ 150 సీట్లు గెలవదని ఇటీవలే బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చెప్పారు. నిశికాంత్ దూబే రాసిపెట్టుకోండి.. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మోడీతో తలపడి బీజేపీకి 150 కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుటుంబం సిద్ధంగా ఉందన్నారు.