Sunday, August 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅమరుల స్ఫూర్తితో హక్కుల కోసం ఉద్యమిస్తాం

అమరుల స్ఫూర్తితో హక్కుల కోసం ఉద్యమిస్తాం

- Advertisement -

– కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ
– వడ్లకొండలో అమరుల యాదిలో గీతన్నల సామాజిక చైతన్య యాత్ర ప్రారంభం
నవతెలంగాణ-జనగామ

అమరుల స్ఫూర్తితో హక్కుల కోసం ఉద్యమిస్తామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ అన్నారు. జనగామ జిల్లాలోని వడ్లకొండలో శనివారం అమరుల యాదిలో గీతన్నల సామాజిక చైతన్య యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ.. కల్లుగీత కార్మికు లను సంఘటితం చేసేందుకు 1957లోనే సంఘం ఏర్పాటు చేసుకు న్నామన్నారు. ధర్మభిక్షం, తొట్ల మల్సూర్‌, బైరు మల్లయ్య, దేశిని చిన్న మల్లయ్య తదితర నాయకుల నాయకత్వంలో సొసైటీ, టీఎఫ్‌టీల ఏర్పాటు, చెట్టుపై గీత కార్మికునికే హక్కు, ఎక్స్‌గ్రేషియా, పెన్షన్‌ తదితర సదుపాయాలు సాధించుకు న్నట్టు వివరించారు. కల్లుగీత వృత్తిపై లక్షలాది మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. కార్పొరేట్‌ సంస్థలు, పెట్టుబడుదారులు తమ లాభాల కోసం లిక్కర్‌, థమ్స్‌అప్‌, కోకోకోలా లాంటి శీతల పానీయాలు విపరీతంగా తీసుకురావడం వల్ల వృత్తి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెన్షన్‌ రూ.4 వేలకు, ఎక్స్‌గ్రేషియా రూ.10లక్షలకు పెంపు, సొసైటీకి 5 ఎకరాల భూమి, నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమ అభివృద్ధి, ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలన్నారు.
జనగామ జిల్లా కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య మాట్లాడుతూ.. వృత్తి చేసే గీత కార్మికులందరికీ సేఫ్టీ కిట్టు ఇవ్వాలని, పెండింగ్‌ ఎక్స్‌గ్రేషియా డబ్బులు రూ.12 కోట్ల 94 లక్షలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో నీరా, తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమ ప్రారంభించాలన్నారు. బొలగాని పుల్లయ్య వర్ధంతి సందర్భంగా ప్రారంభమైన ఈ యాత్ర సర్దార్‌ సర్వాయి పాపన్న 375వ జయంతి రోజు ముగుస్తుందని అన్నారు. కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు భీమగోని చంద్రయ్య జండా విష్కరణ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుర్ర ఉప్పలయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కనకటి రాజయ్య, జిల్లా కమిటీ సభ్యులు పరిధిల భాస్కర్‌, వడ్లకొండ సొసైటీ అధ్యక్షులు నామాల ఎల్లేష్‌, వడ్లకొండ వెంకటేష్‌, బసవగాని మహేందర్‌, బండపల్లి శంకరయ్య, బాల్నే రాజయ్య, బుర్ర లక్ష్మీనారాయణ, కుర్ర రాజు, తాళ్లపెల్లి అంజయ్య, బైరగోని బలరాములు, బైరగోని వెంకటయ్య, బుసి గంపల సమ్మయ్య, మండల కార్యదర్శి బాల్నే కార్తీక్‌, మూల వైకుంఠం, మాజీ సర్పంచ్‌ అంబాల ఆంజనేయులు, టిసిఎస్‌ అధ్యక్షులు బైరు బాలరాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -