నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు జరగబోతున్నాయా? అందుకు త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలు ఊతమిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరనున్నారని గుసగుస్సలు బహిరంగంగా వినపడుతున్నాయి. ఇప్పటికే 10మంది గులాబీ ఎమ్మెల్యేలు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో ఇద్దరు మాజీ మంత్రులు కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారని ఆయా పార్టీల శ్రేణుల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో ఉద్యమ పార్టీగా నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది రాష్ట్రంతోపాటు జాతీయంగా తన పొలిటికల్ మార్క్‌ను చూపించడానికి కేసీఆర్ పెద్ద ప్లానే వేశారు. కానీ ముచ్చటగా మూడో సారి సీఎం అవుతారని ఆశపడగా గులాబీ బాస్ కు భంగపాటు ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దళం ఘోర పరాభవం చవిచూసింది. వామపక్షాల పొత్తుతో 65 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకొని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. 38 స్థానాలతో కేసీఆర్ అట్లర్ ప్లాప్ అయ్యారు.
ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలతో గులాబీ దళంలో వలసల గుబులు అలజడి సృష్టించింది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొద్ది రోజులుకే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పెద్ద షాకిచ్చారు. 10మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని బీఆర్ఎస్ బలాన్ని తగ్గించారు.
మరోవైపు బీఆర్ఎస్ లోని ఇద్దరు ఎమ్మెల్యేల అకాల మరణంతో కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. కంటోన్మెంట్ స్థానం నుంచి గెలుపుపొందిన లాస్యనందిత కారు ప్రమాదంలో చనిపోగా, జూబ్లీహీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాలతో కన్నూమూశారు. దీంతో 38 నుంచి 28 స్థానాలకు బీఆర్ఎస్ పడిపోయింది. ఇప్పుడు ఈ సంఖ్య తగ్గనుందని భారీ ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారని ప్రచారం ఊపందుకుంది. స్థానిక సంస్థలు, త్వరలో గ్రేటర్ హైదరాబాద్‌లో జరగబోయే మున్సిపాల్ ఎన్నికలలో హస్తం గూటికి చేరనున్నరాని ఆయా పార్టీల శ్రేణులు భావిస్తున్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు. 2023లో కూడా తన సిట్టింగ్ స్థానం సనత్‌నగర్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. తలసాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా కీలక పదవుల్లో పనిచేశారు. 1986లో రాజకీయ అరంగేట్రం చేశారు. 1986లో కార్పొరేటర్‌గా గెలిచారు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ 2014లో సనత్‌నగర్ నియోజకవర్గానికి మారి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల్లో కూడా మళ్లీ సనత్‌నగర్ నుంచే గెలుపొంది కేసీఆర్ మంత్రివర్గంలో పశుసంవర్థక శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు.
భర్త ఇంద్రారెడ్డి మరణాంతరం సబితా ఇంద్రెరెడ్డికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభించింది. ఉమ్మడి ఏపీకి తొలి హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సంచలనం సృష్టించారు.2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బలమైన టిఆర్ఎస్ తరంగం ఉన్నప్పటికీ , ఆమె కాంగ్రెస్ టికెట్‌పై విజయం సాధించగలిగింది. తరువాత, ఆమె అధికార పార్టీలో చేరి కేసీఆర్ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రి అయ్యారు.
పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ అధినేత కాంగ్రెస్ పార్టీలో గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను తన పార్టీలో విలీనం చేసుకొని..తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేశారు. దీంతో అదే స్థాయిలో కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరిస్తున్నా తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డితో తన వ్యూహాన్ని అమలు చేయనున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి ఆ ఎమ్మెల్యేల రాక కీలకం కానుంది. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి ఏమేరకు తన ప్లాన్ ను సక్సెస్ చేయనున్నారో వేచి చూడాల్సిందే..!