కవిగా, అనువాదకుడిగా మంచి గుర్తింపు పొందిన ముకుంద రామారావు తెలుగులోనే కాదు. దేశీ విదేశీ కవులు, వారి కవిత్వాన్ని వివరణాత్మకంగానూ, విశ్లేషణాత్మకంగానూ పరిచయం చేస్తూ, వారు పత్రికలలో చాలా కాలం నుండి రాస్తున్నారు. పంచభూతాలను సంకేతిస్తూ ముకుంద రామారావు అనువదించిన ‘అదే ఆకాశం, అదే గాలి, అదే నేల, అదే కాంతి, అదే నీరు’ అనే ఐదు సంకలనాల్లో, వందల సంఖ్యలో కవుల రచనలకు అనువాదాలు వెలువరించారు. ‘శతాబ్దాల సూఫీ కవిత్వం, నోబెల్ కవిత్వం, చర్యా పదాలు, బెంగాలీ బౌల్ కవిత్వం’ అనే మరో నాలుగు సంకలనాల్లో సుమారు 200 మంది రాసిన కవితలను కూడా అనువదించి అందించారాయన.
ఇప్పుడు ‘ఆసక్తి’ పేరుతో వెలువరించిన విమర్శా వ్యాసాలలో తెలుగు, బెంగాలీ భాషల సాహిత్య సంబంధాలను తులనాత్మకంగా విశ్లేషించడంతోపాటు, ఠాగూర్ మొదలుకొని ఇతర బెంగాలీ కవుల ప్రాశస్యాన్ని వివరించారు. నోబెల్ అవార్డు గ్రహీతలతో పాటు ఇతర దేశాల కవిత్వాన్ని కూడా పరిచయం చేశారు. స్త్రీల కవిత్వం, చిత్రకళపై కూడా కొన్ని వ్యాసాలు ఉన్నాయి. అనువాదాల ప్రాముఖ్యత తెలియజేయడంతో పాటు, కవిగా తన ప్రయాణాన్ని- జ్ఞాపకాలను – ఇంటర్వ్యూలను కూడా ఇందులో జతపరిచారు.
రాయప్రోలు సుబ్బారావు మొదటిసారిగా బెంగాలీ కవిత్వాన్ని తెలుగులోకి తెస్తే, వచనాన్ని మొట్టమొదట వెంకట పార్వతీశ్వర కవులు బెంగాలీ డిటెక్టివ్ నవలల అనువాదంతో ప్రారంభించారు. తెలుగు వారు ఎక్కువగా ఠాగూర్ ప్రభావానికి గురయ్యారు. ముఖ్యంగా భావకవుల మీద వీరి ముద్రను స్పష్టంగా గుర్తించవచ్చు. ఠాగూర్ కవిత్వం, కథలు, నవలలు అన్నీ తెలుగులో వచ్చాయి. ఠాగూర్ తర్వాత బంకింబాబు, శరత్ బాబు వీరే కాకుండా విభూతి భూషణ్ బందోపాధ్యాయ, తారాశంకర్ బందోపాధ్యాయ, బన్ ఫూల్, మహా శ్వేతాదేవి, ఆశాపూర్ణాదేవి మొదలైన వారి గురించి, వారి రచనల గురించి పరిచయం చేశారు. మొత్తానికి బెంగాల్ నుండి తెలుగులోకి వచ్చినట్లుగా, తెలుగు నుండి బెంగాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.
‘బెంగాలీ, తెలుగు కవిత్వ ధోరణుల’ ను వివరిస్తూ తెలుగు కవిత్వాన్ని భావ, అభ్యుదయ, విప్లవ, స్త్రీవాద, దళిత, అనుభూతి వాద కవిత్వంగా ఎలా విభజించారో అలాగే బెంగాలీ కవిత్వాన్ని ఠాగూర్ ముందరి కవిత్వం, ఠాగూర్ కాలం కవిత్వం, ఠాగూర్ తర్వాతి కవిత్వంగా విభజించవచ్చునంటారు. ఠాగూర్ మీదనే ముకుంద రామారావు ఏడు వ్యాసాలు రాయడం విశేషం.
ఠాగూర్ బాల్యం నుండే చిత్రకళ పట్ల ఆసక్తి. నల్లటి జీవాలు, వెంటాడే ప్రకతి ఠాగూర్ చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. జనం నా చిత్రాల అర్థమేమిటి అని అడుగుతారు. అప్పుడు నా చిత్రాల్లానే నేను నిశ్శబ్దంగా ఉండిపోతాను. సాంప్రదాయక రూపురేఖలతో అలవాటైన ప్రక్రియ కాకుండా, స్వతంత్ర శైలిలో క్రమరహిత ఆకతినే కోరుకునేవాడు. కవి చిత్రకారుడైనప్పుడు చిత్రలేఖనంలో కూడా కవిత్వ ప్రేరణ ఎక్కువగా కనిపిస్తుంది అంటారు.
ఠాగూర్ తర్వాత శరత్ ఎక్కువగా ఆంధ్రులని ఆకర్షించారు అంటూ అతని జీవిత చరిత్రను, రచనల విశిష్టతను, అనువాదాల పరంపరను విపులంగా తెలియజేసిన విధానం బాగుంది. అలాగే తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, స్వేచ్ఛ కోసం కుటుంబ సంబంధాలలోంచి బయటపడిన నిబద్ధ రచయిత్రి, ఆదివాసుల పక్షాన నిలబడిన రచయిత్రి, 120 కు పైగా గ్రంథాలను రాసిన మహాశ్వేతాదేవి పరిచయం కూడా ఉంది. 1994లో సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ‘మధుపురం బహుదూరం’ అనే శీలభద్ర గారి కథల సంకలనంపై పరిచయ వ్యాసం ఒకటి ఉంది.
ప్రపంచంలో మొట్టమొదటి కవయిత్రి సుమేరియన్ అర్చకురాలు, క్రీస్తుపూర్వం 2285 – 2250 ప్రాంతపు ఎనెడువన్న ఒక గొప్ప విశేషం. ఆమెవి 42 కవితలు శరాకార లిపిలో దొరికాయి. ఆమె ఆకారం సైతం సున్నపురాయి మీద ముద్రితమై ఉంది. కళారంగాల్లో, అందులోనూ బహుశా కవిత్వంలో స్త్రీలు మొదటి నుండి ముందంజలో ఉన్నారు. ప్రాచీన కాలం నుండి అత్యంత అభివద్ధి చెందిన నాగరికదేశాలైన చైనా, జపాన్, భారతదేశం, మద్యప్రాచ్యం, యూరప్ లాంటి దేశాల్లో ఎందరో ముఖ్యమైన కవయిత్రులు ఉద్భవించారు. మౌఖిక సంప్రదాయాల్లో ఆఫ్రికా, ఎస్కిమో, ఆగేయాసియా, మధ్యాసియా లాంటి ప్రాంతాలలో సైతం స్త్రీల పాటలు అనేకం ఉన్నాయి. కాశ్మీర్ లో రాణిగా ఉన్న చివరి కవయిత్రి హబ్బా ఖతూన్ (1554). ఫారసీ భాష రాజ్యమేలుతున్న కాలంలో అక్కడి స్థానిక కాశ్మీర్ భాషలో అందరిని వోలలాడించిన ఆమె కవిత్వం, పాటలు ఇప్పటికీ కాశ్మీరులో సజీవంగా ఉన్నాయి. అంతేకాదు, మొట్టమొదటి కాశ్మీరీ శృంగార కవయిత్రి హబ్బా ఖతూన్. అక్కడి కవిత్వంలో వాట్సూన్ శైలిని ప్రవేశపెట్టిన కవయిత్రి కూడా. అవి ఆమె స్వీయ భావా వేషాలు, యాతన, ప్రేమతో నిండి ఉంటాయి. ఆమె భావావేశాలు సాధారణ స్త్రీలు అందరివిగా ప్రతిపలిస్తాయి.
తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొని, వాద వివాదాలకు గురైన ముద్దుపళని(17 వ శతాబ్దం) కావ్యం పేరు ‘రాధిక సాంత్వనము’. ఈ శృంగార ప్రబంధం ఆనాటి దక్షిణ దేశపు శృంగార కావ్యాల కోవకు చెందింది. స్త్రీ అంతరంగాన్ని, స్త్రీల భావనలను ఆవిష్కరించిన కావ్యం ఇది అని, దాని గొప్పతనాన్ని తెలియజేశారు.
నోబెల్ బహుమతి గ్రహీతల పరిచయ వ్యాసాలు ఈ పుస్తకానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యుద్ధ భీభత్సాన్ని తన రచనల్లో నమోదు చేసిన బెలారసి నివాసి, పరిశోధనాత్మక పాత్రికేయురాలు స్వెట్లనా అలెగ్జీవిచ్ పరిచయ, సాహిత్య విశ్లేషణ ఉంది. ప్రపంచంలోని అన్ని సజనాత్మక రంగాల్లో విమర్శకుల ప్రశంసలను పొంది – వాణిజ్యపరమైన విజయాలను కూడా పొందిన జర్మన్ కు చెందిన సాహిత్య కారుడు గుంతర్ గ్రాస్ గురించి తెలియజేశారు. నోబెల్ బహుమతి పొందిన ఫ్రెంచ్ రచయిత ఫ్యాట్రిక్ మోదీయానో పరిచయం ఉంది. సాహిత్యంలో జనరంజక సంగీతానికి నోబెల్ బహుమతిని అందుకున్న బాబ్ డిలన్ గురించిన విశేషాలను తెలియజేశారు. నోబెల్ బహుమతితో పాటు బుకర్ ప్రైజ్ మరో 16 ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన జపాన్ రచయిత కజువో ఇషిగురో సాహిత్య రచనలపై ఒక వ్యాసం, సంగీత సాహిత్యం పై మరో వ్యాసం ఉన్నాయి. 2020లో సాహిత్యానికి నోబెల్ బహుమతి పొందిన లూయిస్ గ్లిక్ అనే అమెరికన్ రచయిత్రి, లీయూ జియాబో అనే చైనీస్ సాహిత్యకారుడు, నార్వే కు చెందిన జాన్ ఫోనే ల పరిచయాలు, సాహిత్య విశ్లేషణలు ఉన్నాయి. తన అకవిత్వానికి ,తాను అకవిని అని చెప్పుకుని చిలీ కవి నీకొనార్ పారా శతజయంతి సందర్భంగా పరిచయం చేసిన వ్యాసం బాగుంది. రొమేనియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి పండితుడు మీర్చా 1933లో రొమేనియా భాషలో రాసిన ‘మైతేయి’ నవల- దానికి ప్రతిక్రియగా 1974లో ప్రముఖ రచయిత్రి, ఠాగూర్ కు ఆశ్రితురాలైన మైత్రేయి దేవి రాసిన ‘నహన్వతే’ బెంగాలీ నవలపై తులనాత్మక విశ్లేషణ బాగా వచ్చింది. మైత్రేయి రాసిన ”నహన్వతే” కు ముకుంద రామారావు చేసిన తెలుగు అనువాదం త్వరలో రానుంది. అలాగే లక్ష్మీప్రసాద్ దేవ్ కోటా నేపాలి ప్రసిద్ధ కథాకావ్యం ‘మూనా మదన్’ పరిచయం కూడా ఇచ్చారు.
అనువాదం అంటే ఏమిటి? అనువాదంలో రకాలు, సమస్యలు, మంచి అనువాదం ఎలా ఉండాలి? అని వివరిస్తూ తమ ‘అనువాదాల అనుభవాల’ గురించి తెలియజేశారు. నిఖిలేశ్వర్ గారి అనుసజన అనువాద సంకలనం యొక్క విశిష్టతను, దాని గొప్పదనాన్ని వివరిస్తూ మరో వ్యాసం ఇందులో చోటుచేసుకుంది.
అనువాదం అయినా, విమర్శ అయినా చెప్పదలుచుకున్న అంశం పట్ల క్లారిటీ ఉండటం ముఖ్యం. ఆ దిశగా చెప్పదలుచుకున్న అంశానికి సరిపడే సమాచారాన్ని గుర్తించడం, దాన్ని అనువదించడం, దాన్ని వింగడించి, విశ్లేషించి వ్యాసంగా రూపుదిద్దడం ఈ వ్యాసాలలో కనిపిస్తుంది. బెంగాలీ రచయితలు- వారి రచనల గొప్పతనాన్ని, అలాగే నోబెల్ కవుల పరిచయాలు ఇంతకుముందు వచ్చి ఉండవచ్చు. అయినా వారెవరూ చెప్పలేని ఎన్నో విషయాలను ఇందులో వివరించారు. దేశ విదేశీ కవులను పరిచయం చేస్తూ, వారి కవిత్వాన్ని కూడా అనువదించి అందజేయడం విశేషం. విజ్ఞానాత్మకంగా రూపొందిన ఈ వ్యాసాలు పాఠకులను ఆసక్తిగా చదివింపజేస్తాయి.
– కె.పి.అశోక్
కుమార్
9700000948
విమర్శకుడిగా ముకుంద రామారావు
- Advertisement -
- Advertisement -