Monday, August 4, 2025
E-PAPER
Homeజాతీయంప్రజల మనిషి అచ్యుతానందన్‌

ప్రజల మనిషి అచ్యుతానందన్‌

- Advertisement -

– కేరళలో అసాధారణ అభిమానం చూరగొన్న వ్యక్తి
– ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన లాంటి వాళ్లు అవసరం : సంస్మరణ సభలో బీవీ రాఘవులు
అమరావతి:
ప్రజా పోరాటాల్లో ముందుండి ప్రజల కోసం పోరాడిన పోరాట యోధుడు వీఎస్‌ అచ్యుతానందన్‌ ప్రజల మనిషి అని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. సీపీఐ(ఎం) అగ్రనేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్‌ అచ్యుతానందన్‌ సంస్మరణ సభ సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగింది. పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రాఘవులు మాట్లాడారు. అచ్యుతానందన్‌ 99 ఏండ్లపాటు కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా, క్రీయాశీలకంగా, ఉద్యమకారునిగా, పోరాట యోధుడిగా జీవించారని తెలిపారు. పట్టుదల, క్రమశిక్షణతో ప్రజలను అంటిపెట్టుకొని ఉన్నారని చెప్పారు. చిన్న అవకాశం దొరికినా, శక్తి కొంచెమే ఉన్నా ప్రజల కోసం పోరాటం చేశారని తెలిపారు. వర్గ దృక్పథాన్ని ఆయన ఎప్పుడూ వదిలిపెట్టలేదని, కష్టజీవుల పక్షాన నిలబడ్డారని చెప్పారు. పోరాట యోధత్వం ఆయన జీవితంలో మిళితమైందన్నారు. కేరళలోనే అసాధారమైన అభిమానం చూరగొన్న వ్యక్తి అని కొనియాడారు. ప్రజల మనస్సు, హృదయాల్లో గాఢంగా నాటుకుపోయారని చెప్పారు. కమ్యూనిస్టు ఉద్యమంలో, వ్యక్తిగత జీవితంలో అత్యంత క్రమశిక్షణ ఆయన పాటించారని చెప్పారు. 17వ ఏటనే పీచు కార్మికుడిగా పని ప్రారంభించినప్పటి నుంచి ఆయన ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ పోరాటాల్లో ఉన్నారని చెప్పారు. ట్రావెన్‌కోర్‌ దివాన్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన పున్నప్ర – వాయలార్‌ పోరాటంలో ముఖ్యపాత్ర వహించారని తెలిపారు. కేరళలో ప్రజలు తమ బాధను చెప్పుకోకముందే శాసనసభలో వీఎస్‌ వారి బాధను వ్యక్తపరిచేవారని తెలిపారు. సైద్ధాంతిక నిబద్ధతకు ఆయన పట్టుదలగా నిలబడేవారని పేర్కొన్నారు. వీఎస్‌ ఏడో తరగతి వరకే చదువుకున్నా.. ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యమానికి అండదండగా నిలిచారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల్లో నిర్ధిష్ట భాగం పంచాయతీలకు నేరుగా కేటాయించి ప్రజా అవసరాలకు ఖర్చు చేసుకునే విధానానికి వీఎస్‌ శ్రీకారం చుట్టారని చెప్పారు. పరిపాలన సంస్కరణల కమిషన్‌కు చైర్మెన్‌గా పనిచేసిన ఆయన ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని అరికట్టేందుకు అనేక ప్రతిపాదనలు చేశారని వివరించారు. నమ్మిన సిద్ధాంతాన్ని, అనుకున్న విషయాన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదన్నారు. ప్రతి అంశాన్ని ప్రజల ముందే ఉంచి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు వారిని అందులో భాగస్వాములను చేశారని వివరించారు. దేశంలో జాతీయోద్యమం వల్ల అభ్యుదయ, సెక్యులర్‌, ప్రజాస్వామిక, సమానత్వ భావాలు ప్రజల్లో నాటుకుపోయాయని తెలిపారు. కానీ 1990 తరువాత ఈ భావాలకు చిల్లుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. మతతత్వం, నిరంకుశత్వ భావాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తన పెత్తనం కోసం రాష్ట్రాలకు హక్కులు లేకుండా చేసేందుకు ఫెడరిలిజానికి తూట్లు పొడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ వైఖరి చూస్తుంటే బ్రిటిష్‌ వాళ్లు దేశంలోకి మళ్లీ వస్తున్నారా? అనే పరిస్థితి నెలకొందన్నారు. బీహార్‌లో 65 లక్షల ఓటర్లను తీసేశారని, ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. వీఎస్‌ లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్లు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం అని ఆకాంక్షించారు. ఆయన చూపిన పోరాటం, తెగువ, త్యాగం, స్ఫూర్తి ఒరవడిని రాజీలేకుండా ఉద్యమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా అయితేనే దేశాన్ని, ప్రజలను రక్షించుకోవాలని చెప్పారు.
సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. వీఎస్‌ నిండు నూరేండ్లు కమ్యూనిస్టు జీవితం గడిపారని చెప్పారు. ప్రతిపక్షంలో కంటే అధికారంలోనే పోరాటం నిర్వహించి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేరళలో స్థానిక సంస్థలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, కిందిస్థాయి వరకూ క్రీయాశీలకంగా పాత్ర పోషించే పరిస్థితి ఉందన్నారు. ప్రజాస్వామ్యం, సెక్యులర్‌ భావాలను కాపాడుకునేందుకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 100 శాతం అక్షరాస్యత ఉన్న కేరళను పెద్దగా చదువుకోలేకపోయినా వీఎస్‌ ప్రభావితం చేయడం అంతుచిక్కని ప్రశ్న అని తెలిపారు. గర్వకారణమైన చరిత్ర కలిగిన నాయకుడు అని నివాళులర్పించారు. సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు పి మధు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ ప్రతిష్టను, వర్గ సిద్ధాంతాన్ని గొప్పగా అమలు జరిపిన వ్యక్తి అచ్యుతానందన్‌ అని అన్నారు. దానికి పునరంకితం కావడమే తమ కర్తవ్యమని చెప్పారు. వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వీఎస్‌ ప్రజాహిత యోధుడు అని అన్నారు. ప్రజా పోరాటాలు, ప్రజా సమస్యల్లో పీపుల్స్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారని తెలిపారు. జీవితాంతం ప్రజల కోసం, అవినీతికి వ్యతిరేకంగా, పార్టీ విస్తరణకు, కొత్త సమాజాన్ని నిర్మించేందుకు పోరాటం చేశారని చెప్పారు. అతిథులను సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు వేదికపై ఆహ్వానించగా, రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్‌ వందన సమర్పణ చేశారు. వీఎస్‌ అచ్యుతానందన్‌ సంస్మరణ సందర్భంగా ప్రజాశక్తి ప్రచురించిన ప్రత్యేక సంచికను బీవీ రాఘవులు ఆవిష్కరించారు. అంతకుముందు ప్రజా నాట్యమండలి కళాకారులు గేయాలను ఆలపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -