Monday, August 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం

సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం

- Advertisement -

– మతం పేరుతో రాజకీయం ఎల్లకాలం చెల్లదు
– బీఆర్‌ఎస్‌లో నాలుగు ముక్కలాట
– ఆర్థిక నిర్బంధం ఉన్నా.. పథకాలు అమలు చేస్తున్నాం : ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ,టీపీసీసీ ప్రెసిడెంట్‌ బొమ్మ మహేశ్‌ కుమార్‌గౌడ్‌
– ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకులతో సమావేశం
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, మతం పేరుతో రాజకీయాలు ఎల్లకాలం చెల్లవని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. దేవుడు, గుళ్లు మతం వేరని.. రాజకీయాలు వేరని.. మత రాజకీయాలు భవిష్యత్తు తరాలకు తీవ్ర నష్టం చేకూర్చుతాయని తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ముఖ్య కార్యకర్తల, నాయకుల సమావేశం నిర్వహించారు. పార్టీ పరిస్థితి, పథకాల అమలు తీరుతెన్నులు, లోపాలు తదితర అంశాలపై కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడారు. వారి నుంచి వచ్చిన సూచనలు నోట్‌ చేసుకున్నారు. అనంతరం పార్టీ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మీనాక్షి నటరాజన్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో రెండు మోడల్స్‌ నడుస్తున్నాయని చెప్పారు. సామాజిక న్యాయం, హక్కులు కల్పిస్తూ బాపు, పెరియర్‌ చూపిన బాటతో తెలంగాణ ప్రభుత్వ మోడల్‌ నడుస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. రెండోది బీహార్‌ మోడల్‌ అని, మనిషిని మనిషిగా గుర్తించకుండా బుల్డోజర్‌ సంస్కృతి నడుస్తుందని.. ఏది కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. గల్ఫ్‌కు వలస వెళ్లి అక్కడ మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం.. దేశంలో ఎక్కడా అమలు జరగడం లేదని తెలిపారు.
బొమ్మ మహేహ్‌ కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. 2014 నుంచి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటున్నా.. మళ్లీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ దేవుడు, మతం పేరుతోనే ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. అవసరానికి దేవుళ్లను వాడుకోవడం కాదని.. సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచి అభివృద్ధి చేసే సత్తా ఉండాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మొదట బీజేపీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారని, కానీ బయటకు రాగానే ప్లేటు ఫిరాయించినట్టు తెలిపారు. అందులో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న బూచీ చూపెట్టి పేచీ చేస్తున్నారని.. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సైతం ముస్లింలకు ఇదే విధంగా రిజర్వేషన్లు కొనసాగుతున్నట్టు చెప్పారు. తెలంగాణలో భౌగోళికంగా, సామాజికంగా చైతన్యవంతమైన ప్రజలు ఉన్నారని, ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాబోదని అన్నారు. బీసీ రిజర్వేషన్‌లపై తాడోపేడో తేల్చుకునేందుకు 5వ తేదీన చలో ఢిల్లీ నిర్వహిస్తున్నారని, ట్రైన్‌లో కార్యకర్తలతో సహా తాము కూడా వెళ్తున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం నాలుగు ముక్కలాట నడుస్తుందని కేటీఆర్‌, కవిత ఆస్తి తగాదాలతో కేసీఆర్‌ ఫాం హౌస్‌కు పరిమితం అయ్యారని.. అదును కోసం హరీశ్‌రావు ఎదురుచూస్తున్నట్టు ఆరోపించారు. 2016లో అపెక్స్‌ సమావేశంలో కేసీఆర్‌ చెప్పడంతోనే బనకచర్ల పురుడుపోసుకుందని అన్నారు. ఆ జీవోను కాంగ్రెస్‌ అడ్డుకొని ఆపితే.. తమ మీదనే బట్ట కాల్చి పడేసినంత పని చేస్తున్నారని విమర్శించారు. చెప్పనిది చెప్పినట్టు.. ఉన్నది లేనట్టు మార్ఫింగ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలకు పట్టం కట్టే సమయం ఆసన్నమైందని.. కష్టపడ్డ వారికి అవకాశాలు వస్తాయని ఓపికగా ఉండాలని సూచించారు. అనంతరం బాధిత గల్ఫ్‌ కుటుంబీకులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, తోట లక్ష్మికాంత్‌రావు, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -