నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై పార్లమెంటులో చర్చించడానికి కేంద్రం అంగీకరించాలని వయనాడ్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా డిమాండ్ చేశారు. జూలై 21న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో త్వరలో ఎన్నికలు జరగబోయే బీహార్‌లో ఎన్నికల సంఘం (ఈసీ) ఎస్‌ఐఆర్ ప్రక్రియను చేపట్టింది. పార్లమెంటు సమావేశాల్లో దీనిపై చర్చ జరగాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. నిరసనలు చేశారు. అయినా కేంద్రం ఎస్‌ఐఆర్‌పై చర్చకు సిద్ధపడడం లేదు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐఆర్ ఎంతో కీలకమైన అంశం కాబట్టి.. కచ్చితంగా చర్చ జరగాలని.. చర్చించడానికి కేంద్రం అంగీకరించాలని ప్రియాంక కోరారు.
కాగా, నేడు పార్లమెంటు వెలపుల ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎస్‌ఐఆర్ అనేది చాలా కీలకమైన అంశం. ఇది ఓటరు జాబితాకు సంబంధించిన విషయమైతే.. మనం ఈ అంశంపై ఎందుకు లేవనెత్తకూడదు? ఈ అంశంపై చర్చించడానికి కేంద్రం అంగీకరించాలి’ అని ఆమె అన్నారు.
ఎస్‌ఐఆర్, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ – పాక్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షడు జోక్యం చేసుకోవడంపైన.. తదితర అంశాలపై చర్చ జరగాలని లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. వీరి నిరసనల మధ్యే సభను స్పీకర్ ఓంబిర్లా మధ్యాహ్నం 2 వరకు వాయిదా వేశారు.