Monday, August 4, 2025
E-PAPER
Homeజాతీయంశిబుసోరెన్‌ దశాబ్దాల రాజకీయ జీవితం.. జార్ఖండ్‌ చరిత్రలో చిర‌స్మ‌ర‌ణీయం

శిబుసోరెన్‌ దశాబ్దాల రాజకీయ జీవితం.. జార్ఖండ్‌ చరిత్రలో చిర‌స్మ‌ర‌ణీయం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌ నేటి ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆసుపత్రిలో నెల రోజులకు పైగా చికిత్స పొందుతున్నారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన జూలై చివరి వారంలో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని తన కుమారుడు ప్రస్తుత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా వెల్లడించారు.

జెఎంఎ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన శిబు సోరెన్‌ జనవరి 11, 1944లో జన్మించారు. నెమ్రా గ్రామంలో (గతంలో బీహార్‌లో భాగమైన..ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉన్నది) జన్మించారు. ఆయన తండ్రి షోబరన్‌ సోరెన్‌. శిబు సోరెన్‌కు 15 ఏళ్ల వయసున్నప్పుడు వడ్డీవ్యాపారులు చేసిన దాడిలో తన తండ్రి షోబరన్‌ మృతి చెందాడు. ఈ ఘటన శిబు సోరెన్‌పై తీవ్ర ప్రభావం పడింది. హజారిబాగ్‌లోని గోలా హైస్కూల్‌లో శిబు సోరెన్‌ మెట్రిక్యులేషన్‌ పూర్తిచేశారు. రూపి సోరెన్‌ను జనవరి 1, 1962లో వివాహమాడారు. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు దుర్గా సోరెన్‌ 2009లో మృతి చెందారు. కుమార్తె అంజని జెఎంఎం ఓడిశా యూన్‌ట్‌కు నాయకత్వం వహిస్తుంది. ఆయన చిన్న కుమారుడు బసంత్‌ సోరెన్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక మరో కుమారుడు హేమంత్‌ సోరెన్‌ జార్ఖండ్‌ రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు.

శిబు సోరెన్‌ మృతితో గిరిజనుల గొంతు వినిపించే జార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ఓ రాజకీయ శకం ముగిసింది. శిబు ‘డిషోమ్‌ గురు’ (దేశ నాయకుడు) గా విస్తృతంగా ప్రసిద్ధి చెందారు. గిరిజనుల హక్కుల కోసం నిరంతరాయంగా పోరాడిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. అలాగే ప్రాంతీయ, జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించారు.

జెఎంఎం వ్యవస్థాపక సభ్యులుగా..
1973లో ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు ఎ కె రారు, బిహారీ మహతోలతో కలిసి శిబుసోరెన్‌ జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జెంఎంఎం)ను స్థాపించారు. ఆయన నాయకత్వంలో గిరిజన రాష్ట్రం జార్ఖండ్‌ కోసం జెఎంఎం పార్టీ ప్రధాన శక్తిగా ఎదిగింది. ప్రత్యేక రాష్ట్రం కోసం చోటానాగ్‌పూర్‌, సంతల్‌ పరగణ ప్రాంతాలలో ఈ పార్టీ బలమైన మద్దతును కూడగట్టుకుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి.. పోరాడి వారి కలను సాకారం చేసుకున్నారు. వీరి ఆధ్వర్యంలో దశాబ్దాల తరబడి సాగించిన ఆందోళనల తర్వాత నవంబర్‌ 15, 2000 సంవత్సరంలో జార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.

రాజకీయ జీవితం
శిబు రాజకీయ జీవితం 1980లోనే మొదలైంది. 1980లో ఏడవ లోక్‌సభ ఎన్నికల్లో దుమ్కా స్థానం నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు. ఈ స్థానం నుంచే ఆయన పలుమార్లు గెలిచారు. ఆయన 2020లో రాజ్యసభకు ఎంపీగా కూడా పనిచేశారు. అక్టోబర్‌ 2024లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖకు సంబంధించిన కన్సల్టేటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు.

మూడుసార్లు ముఖ్యమంత్రి
శిబుసోరెన్‌ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఎప్పుడూ పూర్తికాలం ఆ బాధ్యతల్లో లేరు. కేవలం కొన్నిరోజులు లేక..కొన్ని నెలలే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యల్లో ఉన్నారు. మార్చి 2-11 2005, ఆగస్టు 27 (2008) – జనవరి 12 (2009) వరకు, డిసెంబర్‌ 30 (2009) – మే 31 (2010) వరకు ఆయన సిఎంగా ఉన్నారు. యుపిఎ-1 హయాంలో 2004-2006 మధ్య మూడుసార్లు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖామంత్రిగా పనిచేశారు. ఆయన కేంద్ర మంత్రితవర్గంలో ఉన్న సమయంలో.. చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

వివాదాలు.. కోర్టు చుట్టూ..
1975 చిరుదిహ్ ఊచకోత కేసుకు సంబంధించి సోరెన్‌పై 2004లో అరెస్టు వారెంట్‌ జారీ చేయబడింది. దీంతో అతను కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే ఆయన అరెస్టు అయిన తర్వాత కొంతకాలం కస్టడీలో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌ పొందిన తర్వాత తిగిరి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మార్చి 2008లో ఆయన ఈ కేసులో నిర్దోషిగా విడుదలయ్యారు.

1994లో తన మాజీ కార్యదర్శి శశినాథ్‌ ఝా కిడ్నాప్‌, హత్య కేసులో సోరెన్‌ నవంబర్‌ 2006లో దోషిగా నిర్ధారించబడ్డారు. 1993లో పి.వి నరసింహారావు ప్రభుత్వంపై జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాజకీయ పలుకుబడి కలిగిన ఝా నోరు మూయించేందుకు అతనిని శిబు సోరెన్‌ హత్య చేశారని సిబిఐ ఆరోపించింది. అయితే సోరెన్‌ ఈ కేసులో నిర్దోషిగా విడుదలయ్యాడు. ఏప్రిల్‌ 2018లో సుప్రీంకోర్టు శిబుసోరెన్‌ను నిర్దోషిగా తేల్చింది.

జూన్‌ 2007లో సోరెన్‌ను జైలుకు తీసుకెళుతున్నప్పుడు దేవఘర్‌ సమీపంలో ఆయన కాన్వారుపై పేలుడు పదార్థాలు విసిరి హత్యాయత్నం జరిగింది. అయితే ఈ దాడిలో ఆయన తప్పించుకున్నారు. ఆయన రాజకీయ జీవితంలో అస్థిరతలు ఉన్నప్పటకీ జార్ఖండ్‌లో ఆయన ప్రభావం చెక్కుచెదరకుండా ఉంది. ఆయన ఏప్రిల్‌ 2025వరకు 38 సంవత్సరాలు జెఎంఎం అధ్యక్షుడిగా నాయకత్వం వహించారు. ఆయన కుమారుడు హేమంత్‌సోరెన్‌ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఏప్రిల్‌లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
శిబుసోరెన్‌ దశాబ్దాల రాజకీయ జీవితం.. జార్ఖండ్‌ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతుంది. గిరిజనుల గుర్తింపు, గౌరవం, స్వయంపాలన కోసం చేసిన ఆయన పోరాటం.. ముందు తరాలకు శాశ్వత వారసత్వంగా నిలిచిపోతుంది.

Ranchi: Jharkhand Chief Minister and JMM chief Shibu Soren and BJP national general secretary Arjun Munda along with other party members showing victory mark after both parties agreed to lead the government in the state for 28-month periods each, in Ranchi on Tuesday. PTI Photo(PTI5_18_2010_000054B)
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -