నవతెలంగాణ-హైదరాబాద్: మెగా కోడలు, హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యే కొత్తగా క్రీడా పాలసీని ప్రకటించారు. ఇందులో భాగంగా పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విషయంమై క్రీడారంగాల్ని ప్రోత్సాహిస్తున్న కార్పొరేట్ సంస్థలు, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్నవాళ్లతో ఓ బోర్ట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌ని నియమించింది. ఇందులో ఉపాసనకు చోటు దక్కింది.
ఐపీఎల్‌లో లక్నో జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్న సంజీవ్ గోయెంకాని ఛైర్మన్‌గా నియమించారు. కో ఛైర్మన్‌గా ఉపాసనకు బాధ్యతలు అప్పగించారు. బోర్డ్ సభ్యులుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, ఒలింపిక్ విజేత అభినవ్ బింద్రా, భూటియా, రవికాంత్ రెడ్డి తదితరులని నియమించారు. ఈ మేరకు తాజాగా ట్వీట్ చేసిన ఉపాసన.. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కో ఛైర్మన్‌గా అవకాశం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు ఉపాసన చెప్పారు. తనను నియమించిన సీఎం రేవంత్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి ఇదో శక్తివంతమైన అడుగు అని రాసుకొచ్చారు. రానున్న రోజుల్లో మంచి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ పాలసీ తీసుకొచ్చినట్లు ఈ మధ్యే రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. రానున్న రోజుల్లో ఈ దేశాన్ని ముందుకు నడిపించడానికి, ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని అభిప్రాయపడ్డారు.