Monday, August 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపాలస్తీనియన్లు మ‌ద్ద‌తుగా మిన్నంటిన ఆందోళ‌న‌లు

పాలస్తీనియన్లు మ‌ద్ద‌తుగా మిన్నంటిన ఆందోళ‌న‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆక్రమిత వెస్ట్‌బాంక్‌లో వేలాది మంది పాలస్తీనియన్లు ఆదివారం భారీ నిరసన చేపట్టారు. గాజాలో ఇజ్రాయిల్‌ చేపడుతున్న దాష్టీకానికి, అక్కడి జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లకు మద్దతుగా ఈ నిరసన చేపట్టారు. జెరూసలెంకు ఉత్తరాన ఉన్న రమల్లాలో జరిగిన ఆందోళనలో భాగంగా ప్రధాన కూడలిలో వందలాది మంది పాలస్తీనియన్‌ జెండాలను ప్రదర్శించారు. రమల్లాతో పాటు ఉత్తరాన నబ్లస్‌, దక్షిణాన హెబ్రాన్‌ వంటి ఇతర ప్రధాన పాలస్తీనా నగరాల్లో నిరసనలు హోరెత్తాయి. కార్యాలయాలకు సెలవు తీసుకుని మరీ ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రదర్శనలో భాగస్వామ్యమయ్యారు.

ఇజ్రాయిల్‌ హత్య చేసిన, జైళ్లలో ఉన్న పాలస్తీనియన్ల ఫోటోలను ప్రదర్శించారు. అలాగే గాజా స్ట్రిప్‌లో ఆహార సంక్షోభానికి సంబంధించిన ఫోటోలను ప్రదర్శించారు. గాజాస్ట్రిప్‌లో ‘కరువు విస్తరిస్తోంది’ అని ఐరాస అధికారులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయిల్‌ యుద్ధంతో గాజాలో పోషకాహార లోపం పిల్లలపై చూపుతున్న తీవ్రప్రభావాన్ని కళ్లకు కట్టేట్లుగా అస్థిపంజరాలతో కూడిన దుస్తులు ధరించి, చనిపోయిన వారిని మోసుకెళుతున్నట్లు కొందరు నిరసన వ్యక్తం చేశారు.

”నా కుమారుడు ఇజ్రాయిల్‌ మెగిడో జైలులో ఉన్నాడు. మందులు, ఆహారం లేకపోవడంతో అనేక సమస్యలతో బాధపడుతున్నాడు” అని నిరసనలో పాల్గన్న పాలస్తీనా విద్యావేత్త, రచయిత రులా ఘనేమ్‌ పేర్కొన్నారు. పది కేజీల బరుతు తగ్గిపోయాడని, జైలులో చర్మ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ” ఈ రోజు మా నిరసన గాజాలోని పాలస్తీనియన్లకు, ఆకలితో ఉన్న పిల్లలకు మద్దతు ఇవ్వడంలో ప్రభావం చూపుతుందని మేము ఆశిస్తున్నాము ” అని నిరసనకారుల్లో ఒకరైన తగ్రీద్‌ జియాదా తెలిపారు.

గాజాపై వైమానిక దాడులు ప్రారంభమైన తర్వాత ఇజ్రాయిల్‌ జైళ్లలో బంధించిన పాలస్తీనియన్ల సంఖ్య విపరీతంగా పెరిగిందని, హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని, సోషల్‌మీడియాలో రాజకీయ ప్రకటనలు పోస్ట్‌ చేశారంటూ పలువురిని బంధించారని పాలస్తీనియన్‌ కమిషన్‌ ఆఫ్‌ డిటైనీసస్‌అండ్‌ ఎక్స్‌ డిటైనీస్‌ అఫైర్స్‌ తెలిపింది. పాలస్తీనియన్‌ ప్రజలను కాపాడటానికి మరియు జైళ్లలో, నిర్బంధ కేంద్రాల్లో మగ్గుతున్న ఖైదీలను రక్షించడానికి త్వరగా జోక్యం చేసుకోనంతవరకు అంతర్జాతీయ సమాజం కూడా ఈ బాధలన్నింటిలోనూ భాగస్వామి అని కమిషన్‌ ప్రతినిధి థాయర్‌ శ్రీతే మీడియాకు తెలిపారు.

గాజాలో మానవతాసాయాన్ని ఇజ్రాయిల్‌ పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయిల్‌ అనుమతిస్తున్న మానవతా సాయం దోచుకోబడుతోందని, దారిమళ్లించబడుతోందని ఐరాస సంస్థలు, మానవతా సంఘాలు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -