ఉప్పునుంతల గ్రామీణ బ్యాంకులో వివాదాస్పద ఘటన
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రంలోని గ్రామీణ బ్యాంకులో ఖాతాదారుని అనుమతి లేకుండానే బ్యాంకు ఖాతాను ఇతర బ్రాంచ్‌కు ట్రాన్స్ఫర్ చేసి, ఖాతాదారుడిని తీవ్ర అవమానానికి, ఆర్థిక అయోమయానికి గురిచేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. రాయిచేడు గ్రామానికి చెందిన నక్కెర కంటి రంజిత్ కుమార్ గతంలో హైదరాబాద్‌లో తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం కోర్టులో కేసు కోసం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతా తెరిచారు. అనంతరం స్థానిక అవసరాల దృష్ట్య ఉప్పునుంతల గ్రామీణ బ్యాంక్‌కు ఖాతా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. శుక్రవారం రూ.30,000 నగదు, రూ.1 లక్ష ఎస్బీఐ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశారు. శనివారం న రూ.1.5 లక్షలు డ్రా చేశారు. కానీ సోమవారం తిరిగి బ్యాంక్‌కి వెళ్లగా, ఖాతా మళ్లీ హైదరాబాద్ బ్రాంచ్‌కు ట్రాన్స్ఫర్ అయినట్లు మేనేజర్ క్రాంతి కుమార్ బాధితునికి సమాచారం ఇచ్చారు.
వివరణ కోరినప్పుడు, క్యాషియర్ పొరపాటు వల్ల ఖాతా లావాదేవీలు హైదరాబాద్ బ్రాంచ్ ద్వారా జరిగాయని, పై అధికారులకు ఫిర్యాదు చేస్తే బాధ్యత అకౌంటెంట్‌దే అని బ్యాంక్ మేనేజర్ పేర్కొన్నారూ. కానీ ఇంత పెద్ద తప్పిదాన్ని సరిదిద్దడానికి బ్యాంక్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధితుడిని తీవ్ర నిరాశకు గురిచేసింది. “చదువుకున్న ఖాతాదారులకే ఇలాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు, సాధారణ ప్రజల ఖాతాలు ఏ రీతిలో దోచిపెడుతున్నారో ఊహించడానికి కూడా భయంగా ఉంది,” అంటూ బాధితుడు రంజిత్ కుమార్ వాపోయారు.
హైదరాబాద్ ఎకౌంటులో ప్రతిసారి అమౌంట్ లావాదేవీలు జరపాలంటే ఇబ్బందిగా ఉందని నా స్థానిక మండలమైన తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు నా అకౌంట్ ను ట్రాన్స్ఫర్ చేపించుకున్నాను. రెండు రోజులుగా మన విత్ డ్రా ఇచ్చారు. మూడవసారి వెళ్లగా మీ గ్రామానికి మా బ్యాంకు సేవలలో లేదని మా ఖాతాదారులకే డబ్బులకు ఇబ్బందిగా ఉంది అంటున్నారు. నా ప్రమేయం ఎలాంటి దరఖాస్తు లేకుండా మళ్లీ హైదరాబాదు బ్రాంచ్ కు నా అకౌంట్ ను బదిలీ చేశారు. ఉన్నత అధికారులకు ఈ గోడు చెప్పుకునేలోగా నీ అకౌంటు మళ్ళీ అదే బ్రాంచ్ కి బదులు అయిందని అధికారులు చెప్పి చేతులు దులుపుకున్నారు. తన పాత పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించిన బ్యాంకు అధికారుల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.- తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఖాతాదారుడు, నక్కర కంటి రంజిత్ కుమార్, రాయిచెడు గ్రామం.
క్యాషియర్ తెలియక అమౌంటు ఇచ్చాడు. ఆ ఖాతా పై అకౌంటు పత్రాలు మాకు అందలేదు ఖాతాదారుని ప్రమేయం లేకుండానే మేము మళ్లీ అదే బ్రాంచ్ కి అకౌంటు బదిలీ చేయవచ్చు. అకౌంట్ ఖాతాదారుడు ఫిర్యాదు చేస్తే అకౌంట్ క్యాషియర్ ఆయన వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటాడని అన్నారు. – తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్, క్రాంతి కుమార్, ఉప్పునుంతల.
ఈ విషయంపై గంట తర్వాత నేనే సమాచారం ఇస్తా..
ఖాతాదారుని అకౌంటును నాకు పంపించండి. ఖాతా వివరాలు తెలుసుకొని పూర్తి సమాచారం తెలుపుతానని చెప్పి సాయంత్రం అయినా ఫోన్లో అందుబాటులోకి రాకపోవడం విశేషం. – తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జిల్లా పరిపాలన అధికారి, గౌతమ్, నాగర్ కర్నూల్.