బొప్పారం లో డెంగ్యూ పాజిటివ్ కుటుంబ సభ్యులకు పరామర్శ
రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ స్పెషల్ ఆఫీసర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ – కాటారం
రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం కాటారం మండలంలోని బొప్పారం గ్రామాన్ని సందర్శించి డెంగ్యూ పాజిటివ్ కుటుంబ సభ్యులను, జ్వరం తో బాధపడే వారిని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని వైద్య సేవల అమలు, పారిశుధ్య పరిస్థితులు, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత తదితర అంశాలను పరిశీలించారు.
ఆస్పత్రిలో రికార్డుల నిర్వహణ, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరుపై వెంకటేశ్వర్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, ఔట్ పేషెంట్ విభాగాలు, ఇంటర్‌నల్ వార్డులు, మందుల నిల్వ స్టోర్ ను ఆయన తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు. ప్రభుత్వం వైద్య సేవలపై చాలా ఫోకస్ చేస్తుందని విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు సమర్థవంతమైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ వైద్య శాలలు కీలక భూమిక వహించాలని అన్నారు.
పారిశుధ్యం, మందుల లభ్యత, సిబ్బంది హాజరు తప్పనిసరిగా నిరంతరం కొనసాగాలని సూచించారు. ప్రజల్లో వైద్య సేవలపై నమ్మకం కలిగించేలా సేవలు అందించాలి అని తెలిపారు. వైద్య సిబ్బంది సేవలకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆయన ప్రత్యేకంగా ఆదేశించారు. అనంతరం రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉపసంచాలకులు నాగరాజు, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి ,ఎంపిడిఒ బాబు,మండల పరిషత్ అధికారి వీరాస్వామి, వైద్యాధికారి డాక్టర్ మౌనిక, పంచాయతీ కార్యదర్శి షగీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.