Wednesday, August 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమరోసారి త్యాగానికి వెనుకాడను

మరోసారి త్యాగానికి వెనుకాడను

- Advertisement -

మంత్రి పదవి కోసం ఎవర్నీ బతిమిలాడ
కొడంగల్‌కు నిధులు కేటాయించినప్పటి నుంచి నిద్ర పట్టట్లే..
నేను లేకపోతే కాంగ్రెస్‌ అధికారంలోకొచ్చేదే కాదు
అవసరమైతే సెక్రెటేరియట్‌ను ముట్టడిస్తా : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి
నవతెలంగాణ- సంస్థాన్‌నారాయణపురం

మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం అవసరమైతే మరోసారి పదవి త్యాగానికి వెనుకాడేది లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తేల్చి చెప్పారు. నల్లగొండ జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం లచ్చమ్మగూడ గ్రామంలో నిర్మించిన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ”మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం పోరాడుతా.. ఎంత దూరమైనా పోతా.. అవసరమైతే వేల మంది కార్యకర్తలతో సెక్రెటేరియట్‌ను ముట్టడిస్తా.. అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.. తన రాజీనామా వల్ల గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నియోజకవర్గ ప్రజల కాళ్ల ముందుకు తీసుకొచ్చిన.. అవసరమైతే ప్రస్తుత ప్రభుత్వాన్ని తీసుకురావడానికి వెనుకాడేది లేదు..” అని అన్నారు. మంత్రి పదవి రాక రాజగోపాల్‌రెడ్డి ఏదేదో మాట్లాడుతుండని అనుకుంటున్నారని.. అది వాస్తవం కాదన్నారు. ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తానన్నారని, కానీ మునుగోడు ప్రజలు, అభివృద్ధి కోసం ఇక్కడి నుంచే పోటీ చేశానని చెప్పారు. మంత్రి పదవి తనకు ముఖ్యం కాదని, నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని అన్నారు. మంత్రి పదవి కోసం పాకులాడాల్సిన అవసరం తనకు లేదన్నారు. ”ఎంపీని గెలిపించమన్నారు.. గెలిపించిన.. పార్టీలోకి రమ్మన్నరు వచ్చిన.. మంత్రి పదవి ఇస్తానన్నది మీరే.. మాట తప్పింది మీరే.. నేను రాకపోతే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేదే కాదు” అని అన్నారు. పార్టీలో సీనియర్నీ.. నాకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. ఇస్తారా? ఇవ్వరా? అది మీ ఇష్టం.. మంత్రి పదవి కావాలని బతిలాడేటోన్ని కాదని చెప్పారు. కొడంగల్‌ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.5 వేల కోట్లు ఎట్లా తీసుకు పోతారని ప్రశ్నించారు. అప్పట్నుంచి తనకు నిద్ర పట్టడం లేదన్నారు. పార్టీలకతీతంగా నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాల్సిందేనన్నారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమన్నారు. రూ.1200 కోట్లతో రాచకొండ లిఫ్టు ప్రాజెక్టును పూర్తి చేసుకుందామని చెప్పారు. అనంతరం చిమిర్యాల గ్రామంలో నిర్మించనున్న సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. రాచకొండలోని పలు తండాలలో పర్యటించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

తమ్ముడికి మంత్రి పదవి ఇచ్చే స్థితిలో లేను : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి
తన తమ్ముడికి మంత్రి పదవి ఇచ్చే స్థితిలో లేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి స్పందించారు. మంగళవారం నాడిక్కడ వెంకట్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజీలో తాను లేనని స్పష్టం చేశారు. రాజగోపాల్‌ రెడ్డికి మంత్రి పదవిపై కేంద్ర పెద్దలు ఇచ్చిన హామీ గురించి తనకు తెలియదని అన్నారు. మంత్రి పదవిపై హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -