Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజివిజ్ఞత.. బాధ్యత...

విజ్ఞత.. బాధ్యత…

- Advertisement -

మాట ఇవ్వటం.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం మన గౌరవాన్ని మరింతగా పెంచుతాయి. వ్యక్తికైనా, వ్యవస్థకైనా ఈసూత్రం తప్పక వర్తిస్తుంది. ఒకవేళ చేసిన వాగ్దానాన్ని అమలు చేయలేకపోతే ఎందుకు అలా జరిగిందో చెప్పటం కనీసధర్మం. ఎప్పటిలోగా ఆ హామీని అమలు చేస్తారో ప్రకటించటం బాధ్యత. వీటన్నింటినీ విస్మరించింది కాబట్టే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురైంది. ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కారు అడుగులు కూడా అటువైపే పడుతున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.మధ్యాహ్న భోజనం కార్మికులపట్ల తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆ అనుమానాలను మరింతగా బలపరుస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల ప్రవేశాల పెంపుతోపాటు వారిలో పోషకాహారలోపాన్ని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్కారు బడుల్లో సంయుక్తంగా నిర్వహిస్తున్న పథకమే మధ్యాహ్న భోజనం. పేద, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు వరంలా మారిన ఈ పథకం దాని నిర్వాహకులకు మాత్రం భారమవుతోంది. కొన్నేండ్ల నుంచి సరైన సమయా నికి బిల్లులు రాకపోయినా…ఆ ఆర్థిక బాధలను తట్టుకుని మధ్యాహ్నభోజనం పథకం కార్మికులు పిల్లల ఆకలి తీర్చటానికి నిరంతరం నిబద్ధతతో పనిచేస్తున్నారు. అయితే గత ఐదునెలలుగా ప్రభుత్వం వారికి వేతనాలు చెల్లించటం లేదు. పిల్లలకు పెట్టే కోడిగుడ్లు, వంటగ్యాస్‌ బిల్లులు పది నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కోవిద్యార్థికి మూడుగుడ్లు పెట్టాలంటూ ఆదేశించింది, కానీ అదిచ్చే డబ్బులకు రెండు గుడ్లు కూడా రావటం లేదన్నది కార్మికుల ఆవేదన. పైగా పది నెల్ల నుంచి పెట్టిన గుడ్లకే డబ్బులు రానప్పుడు ఇంకెంతకాలం అప్పులు చేసి, వండి పెడతామంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలంటూ చెప్పులరిగేలా తిరిగినా అధికారులు స్పందించటం లేదంటూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులైన పేదమహిళలు వాపోతున్నారు. మరోవైపు వంటకు విధిగా గ్యాస్‌స్టౌవ్‌లనే వాడాలి తప్ప, కట్టెల పొయ్యిలను వాడొద్దంటూ అధికారులు హుకూం జారీ చేశారు. కానీ సర్కారు స్టౌవ్‌లను మాత్ర మే ఇస్తుందట, గ్యాస్‌ను మాత్రం కార్మికులే కొనాలంటూ నిబంధనలు విధించటం కడు విచిత్రం! పైసమస్యలతో పాటు తెచ్చిన సరుకులకు సకాలంలో నగదు చెల్లించాలి, వంట గదులను నిర్మించాలంటూ కార్మికులు కోరుతున్నారు. పెండింగ్‌ బిల్లులు, వేతనాలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.10వేల వేతనమివ్వాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రయివేటువారికి అప్పగించే చర్యలను మాను కోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీటన్నింటినీ పరిష్కరించట మనేది కనీస బాధ్యతంటూ ప్రభుత్వానికి గుర్తుచేస్తున్నారు.
వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాలన్నింటిపై కాంగ్రెస్‌ స్పష్టమైన హామీలిచ్చింది. మధ్యాహ్న భోజన పథక కార్మికుల కష్టాలను చూస్తే కన్నీరొస్తోందంటూ ఆ పార్టీ పెద్దలు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఇది జరిగి ఇరవై నెలలైంది. కానీ ఆనాడు ఇచ్చిన హామీలను అధికార పార్టీ తుంగలో తొక్కింది. ఇదిగో.. అదిగో.. అంటూ మీనమేషాలు లెక్కిస్తోంది. సహనం నశించిన కార్మికులు రోడ్డెక్కారు. అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చీ ఇచ్చీ విసిగివేసారి, హైదరాబాద్‌కు బయల్దేరారు. తద్వారా విద్యాశాఖ ఉన్నతాధికారులకు తమ గోడును వినిపిద్దామని భావించారు. అప్పుడైనా తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశపడ్డారు. కానీ ప్రజాప్రభుత్వం వారిని ఎక్కడికక్కడ తొక్కిపట్టింది. మండలాలు, జిల్లాలతోపాటు రాష్ట్ర రాజధాని నగరంలోని నేతలను సైతం హౌజ్‌ అరెస్టులు చేయించింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఎక్కడిపడితే అక్కడ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అక్రమ నిర్బంధాలకు పూనుకున్నారు. ప్రజాపాలన, ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అనుకునేలా సర్కారు వ్యవహరించింది.
ఇలాంటి నిర్బంధాల ద్వారా ప్రజలు, కార్మికుల నోళ్లను ఎన్ని రోజులు మూయగలరనేది పాలకులు ఆలోచిం చుకోవాలి.నిర్బంధాలు, అక్రమ అరెస్టులనేవి కార్మికుల సమస్యలను పరిష్కరింపజాలవనే వాస్తవాన్ని గుర్తెరగాలి. హక్కులు, డిమాండ్ల సాధన కోసం ఉద్యమించే వారిపట్ల రాష్ట్ర ప్రభుత్వం మున్ముందు ఎలా ఉండబోతోందో అనే దానికి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పట్ల అది అనుసరించిన వైఖరే ప్రత్యక్ష ఉదాహరణంటూ కార్మిక నేతలు, సామాజిక వేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళనను అర్థం చేసుకుని ప్రజా ఉద్యమాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన తీరు మార్చుకుని, కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలి. లేదంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img