లేటెస్ట్ కన్నడ బ్లాక్‌బస్టర్ ‘సు ఫ్రం సో’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఆలరిం చడానికి రెడీ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ రూరల్ కామెడీ హర్రర్ సినిమాని నేడు (శుక్రవారం) రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాత రాజ్ బి శెట్టి మాట్లాడుతూ, ‘మైత్రి మూవీ మేకర్స్‌కి ధన్యవాదాలు. మేము ఇండీ ఫిలిం మేకర్స్. మంచి కంటెంట్ తీస్తే మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద వ్యక్తులు సపోర్ట్ చేస్తారని నమ్మకం కలిగింది. ఇంత మంచి కంటెంట్‌ని ఆదరిస్తున్న మైత్రి శశికి, నవీన్‌కి థ్యాంక్యూ. ఈ సినిమా చాలా మంచి ఎంటర్‌టైనర్. ఈ సినిమా కన్నడలో అద్భుతాలు సష్టించింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఎప్పుడు చూస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. మంచి సినిమా వస్తే తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా గొప్పగా ఆదరిస్తారు. ‘గరుడగమన’ రిలీజ్ అయినప్పుడు తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన ఆదరణ మర్చిపోలేను’ అని అన్నారు.
‘ఇది కన్నడలో బిగ్ బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్తారనే నమ్మకం ఉంది. సినిమా తప్పకుండా ఆడియన్స్‌ని అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తుంది’ అని నిర్మాత నవీన్ యెర్నేని చెప్పారు.
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, ‘ఈ సినిమాని రీమేక్ చేయాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. అయితే ఒరిజినల్ తెలుగులోకి వస్తేనే బావుంటుందని మేము సుప్రీత్‌తో చెప్పడం జరిగింది. ఈ సినిమాని చూసి చాలా ఎంజారు చేస్తారు. ఈ సినిమా తెలుగులో చాలా పెద్ద సినిమా కాబోతోంది. రాజ్ బి శెట్టి ఈ సక్సెస్‌ని ముందుగానే ఊహించారు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అదిరిపోతుంది. సినిమాలో అందరం ఇన్వాల్వ్ అయిపోతాం. ఒకప్పుడు ఇవివి సత్యనారాయణని సినిమాల్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేది. తర్వాత అది చాలా రోజులు మిస్ అయ్యాం. ఆ లోటును ఈ సినిమా ఫిల్ చేస్తుంది’ అని తెలిపారు. షనీల్ గౌతమ్, జెపి తుమినాడ్, సంధ్య అరకెరె, ప్రకాష్ కె తుమినాడు, దీపక్ రారు పనాజే, మైమ్ రాందాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – తుమినాడు.