Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిమోడీకి అగ్నిపరీక్ష!

మోడీకి అగ్నిపరీక్ష!

- Advertisement -

సోవియట్‌ యూనియన్‌ కూల్చివేత తర్వాత అమెరికాతో మనదేశ సంబంధాలు బాగా దిగజారటం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇంతకాలం వాషింగ్టన్‌తో అనేక విధాలుగా రాజీపడి జూనియర్‌ భాగస్వామిగా లబ్ది పొం దాలని చూసిన దేశపాలకవర్గానికి డోనాల్డ్‌ ట్రంప్‌ రూపంలో అగ్ని పరీక్ష ఎదురైనట్లే చెప్పవచ్చు. తమకే పెద్దపీట వేయాలని అంతర్జాతీయ కార్పొరేట్లు భావిస్తే చిన్నవారికి అది మింగుడుపడదు. అయితే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ”సమీప భవిష్యత్‌”లో ”సృజనాత్మక దౌత్యం”తో ఇరుదేశాలు దెబ్బతిన్న సంబంధాలను సరిచేసుకోవచ్చు అన్న వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా వెలువడటాన్ని కొట్టిపారవేయలేము. ఛీ పో అంటే ఛా పో అనేదాకా వస్తే పరిణామాలు అనూహ్యంగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచంలో ఏ దేశం కూడా చొరవ చూపకముందే మనం అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి ముందడుగు వేశాం. ట్రంప్‌ తాజా ప్రకటనతో మనదేశంతో పాటు బ్రెజిల్‌ మీద యాభై శాతం పన్ను విధించాడు. మరే పెద్దదేశం మీద ఇంత పన్నులేదు. లాటిన్‌ అమెరికాలో ఒక వామపక్ష శక్తిగా అమెరికాకు కొరకరానికొయ్యగా బ్రెజిల్‌ ఉంది. మెరమెచ్చు మాటలతో తన కౌగిలిలోకి వస్తుందనుకున్న భారత్‌ అనూహ్యంగా అడ్డం తిరిగింది. మన జాతీయ భద్రతా సలహాదారు ఎంతో ముందుగానే గురువారం నాటి మాస్కో పర్యటనకు నిర్ణయించుకున్నారు. ఈ నెలాఖరులో రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన జరపవచ్చనే ఉప్పందుకున్న ట్రంప్‌ తట్టుకోలేక ఉక్రోషంతో రెచ్చిపోతున్నాడు. ఈ నెల 25వరకు భారత్‌కు గడువు ఉందని, చర్చలు జరుపుతామని చెప్పిన అమెరికా ఎంతో ముందుగానే కొరడా ఝళిపించటానికి కారణాలివే.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఎంతగా రెచ్చగొడుతున్నప్పటికీ నరేంద్రమోడీ ఇంతవరకు ఎక్కడా ప్రత్యక్ష విమర్శకు దిగలేదు. అదే విధంగా ట్రంప్‌ కూడా ఇప్పటికీ అనేక తురుపు ముక్కలను దగ్గర ఉంచుకున్నాడు. పాతిక నుంచి యాభైశాతానికి పన్నులు లేదా జరిమానా మొత్తాన్ని పెంచుతున్నట్లు బుధవారం ప్రకటన చేసినప్పటికీ మన ఎగుమతుల్లో ముఖ్యమైన వాటికి ఇంకా మినహాయింపు ఇవ్వటాన్ని బట్టి తెగేదాకా లాగేందుకు సిద్దంగా లేమనే సంకేతాన్ని ట్రంప్‌ ఇప్పటికే ఇచ్చాడు. దీన్లో విభజించి పాలించు అన్న ఎత్తుగడ కూడా ఉంది. ఎవరి ప్రయోజనాలను వారు చూసుకోవటంలో కార్పొరేట్ల తర్వాత ఎవరైనా.అందువలన ఇబ్బందులు లేని రంగాలకు చెందిన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి మద్దతు ఇస్తారు. చైనా వైపు నుంచి అమెరికా మాదిరి సమస్యల్లేకపోయినా అదే జరుగుతోంది. చైనా దిగుమతులతో లబ్ది పొందే రంగాల వారు బీజింగ్‌ నుంచి వచ్చే పెట్టుబడులకు, సంస్థలతో చేతులు కలిపేందుకు సిద్దంగా ఉన్నారు, ఒత్తిడి తెస్తున్నారు. ఈ కారణంగానే 2019 తర్వాత తొలిసారిగా నరేంద్రమోడీ ఈ నెలాఖరులో బీజింగ్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ సమావేశాలకు హజరవుతున్నారు. గతేడాది కాలంలో ఇరు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొల్పుకొనేందుకు అనేక చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.
రష్యాతో వాణిజ్య లావాదేవీలను సాకుగా చూపి మనదేశం మీద జరిమానా ప్రకటించిన ట్రంప్‌ అంతకంటే ఎక్కువ చమురు, గ్యాస్‌, బొగ్గు దిగుమతులు చేసుకుంటున్న చైనా, ఐరోపా యూనియన్లను మినహాయిం చటమంటే మనదేశాన్ని బ్లాక్‌మెయిల్‌ చేయటం తప్ప మరొకటి కాదు.వ్యవసాయం, పాడి, కోళ్ల పరిశ్రమల రంగాన్ని పూర్తిగా తెరవాలన్నది అమెరికా పట్టు. గత యుపిఏ ప్రభుత్వ హయాం నుంచి కోరుతున్నది అదే. అవి మినహా మిగతా రంగాలలో రాయితీలకు సిద్ధమే అని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు వార్తలు.ఎంఎస్‌ స్వామినాధన్‌ శతజయంతి సమావేశం లో ట్రంప్‌, అమెరికా పేరెత్తకుండా ఎంత మూల్యం చెల్లించి అయినా దేశ ప్రయోజనాలను కాపాడుకుంటామని ప్రధాని నరేంద్రమోడీ గురువారం నాడు చెప్పటం గమనించాలి. ఇప్పటి వరకు నోరు విప్పని పెద్దమనిషి పరోక్షంగానైనా మాట్లాడటం గుడ్డిలో మెల్ల అని సంతృప్తి చెందవచ్చు. ఎందుకు మాట్లాడటం లేదంటూ స్వజనంలోనే మధనం, అనుమానాలు, ప్రతిపక్షాలు, యావత్‌ దేశం నుంచి రోజు రోజుకూ పెరుగుతున్న వత్తిడే ఈ మాత్రానికైనా ముందుకు రావటానికి అసలు కారణం. మనపాలకవర్గానికి అమెరికాతో అనేక అనుభవాలున్నాయి. తన ప్రయోజనాలకు అడ్డుపడు తున్నది అనుకున్న కారణంగానే గతంలో సోవియట్‌ యూనియన్‌తో చేతులు కలిపే విదేశాంగ విధానానానికి మొగ్గిన సంగతి తెలిసిందే. అయితే నాటికీ నేటికీ పరిస్థితుల్లో ఎంతో తేడా ఉంది.
ఏమైనప్పటికీ అప్పుడూ ఇప్పుడూ స్వంత ప్రయోజనాలకే పెద్ద పీటవేసేట్లయితే చైనాతో సహకరించేందుకు కూడా వెనుకాడదు. ఇప్పటికే గాల్వన్‌ ఉదంతాల వివాదాన్ని పక్కన పెట్టి సయోధ్యకు పూనుకోవటం దానిలో భాగమే. అమెరికాను ఎదుర్కొనేందుకు రష్యాతో పాటు భారత్‌ కూడా కలసివస్తే చైనాకూ ప్రయోజనమే గనుక అది కూడా సానుకూలంగానే స్పందించవచ్చు. పరిస్థితిని అమెరికా అంతదాకా రానిస్తుందా, అయితే మనదేశానికి ఉన్న ప్రత్యామ్నాయం ఏమిటన్నది ప్రశ్న.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img