అమరావతి : సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన ‘చలో విద్యుత్ సౌధ’ ఉద్రిక్తతంగా మారింది. కార్మికులను పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని, పిఆర్‌సి బకాయిలు తదితర అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యునిటైడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(సిఐటియు అనుబంధ సంస్థ) ఆధ్వర్యంలో గురువారం ‘చలో విద్యుత్ సౌధ నిర్వహించారు. విజయవాడలోని గుణదల సెంటర్‌కు చేరుకున్న వందలాది మంది విద్యుత్ కార్మికులు, అక్కడి నుంచి నినాదాలతో విద్యుత్ సౌధ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ సౌద వద్ద ముందుగానే భారీగా మోహరించిన పోలీసులు కార్మికుల ర్యాలీని అడ్డుకున్నారు. నాయకులు, కార్మికుల చేతుల్లో ఉన్న బ్యానర్లను బలవంతంగా చించివేసి అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో కార్మికులు ప్రతిఘటించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. వచ్చిన వారిని వచ్చినట్లు పోలీసులు బలవంతంగా అరెస్టులు చేశారు.
ముందుగా సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏవి నాగేశ్వరరావు, సిహెచ్ నర్సింగరావు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు డి సూరిబాబు, యునిటైడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జె రాజశేఖర్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ పిఆర్‌సి, హాలీడేస్ బకాయిలు, హమాలీలకు, బిల్ కలెక్టర్లకు పీస్‌రేటు పెంచాలని, 2019లో వాచ్‌మెన్ నుంచి ఆపరేటర్స్‌్‌గా ప్రమోటైన వారికి పాత ఆపరేటర్స్‌తో సమానంగా జీతాలు చెల్లించాలని, పదవి విరమణ పొందిన వారికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియో అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్టు చేసిన నాయకులను మాచవరం పోలీస్ స్టేషన్‌కు తరలించి సాయంత్రం విడిచిపెట్టారు. అరెస్టయిన వారిలో రాష్ట్ర నాయకులు డి సుమన్, కె శ్రీనివాసులు, కుమార్, నాగరాజు, భీమేష్, విజయరావు, అనిల్, ఎన్‌సిహెచ్ శ్రీనివాస్, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, కె దుర్గారావు తదితరులు ఉన్నారు. ఆందోళన అనంతరం ట్రాన్స్‌కో డిప్యూటీ సెక్రటరీ రాణి యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ యుజఫర్ అహ్మద్ నాయకత్వంతో చర్చలు జరిపారు. ఇన్సూరెన్స్ రూ.25లక్షలు అందిస్తామని, ఇతర సమస్యలను ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీఇచ్చారు.
ఖండించిన సీపీఐ(ఎం)
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల అరెస్టులను సిపిఎం రాష్ట్రకమిటీ ఖండించింది. సిఐటియు ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు, ఎలక్ట్రిసిటీ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె రాశేఖర్, ఏవి నాగేశ్వరరారవు తదితరలను అరెస్టు చేయడం అన్యాయమని ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సంస్థల్లో మూడు దశాబ్దాలకు పైగా చాలీచాలని వేతనాలతో అద్దె ఇళ్ళల్లో, పెరిగిన నిత్యావసర ధరలు, విద్య, వైద్యం ఖర్చులతో కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని పేర్కొన్నారు. వేతనాలు పెంచాలని, పెండింగ్ బకాయిలు అందకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. విద్యుత్ కార్మికుల న్యాయమైన ఆందోళనకు సిపిఎం తరపున మద్దతు ప్రకటించారు. సమస్యలపై కార్మికులు గత కొన్నేళ్లుగా ఆందోళనలు చేస్తున్నా రాష్ట్రప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. అధికారులకు, ప్రభుత్వానికి, మంత్రులకు విన్నవించుకున్నా ఫలితం లేకే విద్యుత్ సౌధ వద్ద ఆందోళనకు పూనుకున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.