Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుహైకోర్టు ప్రాంగణంలో న్యాయవాది గుండెపోటుతో మృతి

హైకోర్టు ప్రాంగణంలో న్యాయవాది గుండెపోటుతో మృతి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైకోర్టు ప్రాంగణంలో గురువారం మధ్యాహ్నం విషాద ఘటన చోటుచేసుకుంది. సీనియర్‌ న్యాయవాది పర్సా అనంత నాగేశ్వర్‌రావు (47) కోర్టు కారిడార్‌లో గుండెపోటుతో మృతి చెందారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కూర్చుని ఉన్న ఆయన, పక్కనే ఉన్న ఫైల్స్‌పై తలవాల్చిన అనంతరం కుర్చీలోనే కూలిపోయారు. అది గమనించిన వారు వెంటనే అంబులెన్స్‌ను రప్పించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఆయన లా పూర్తి చేసి ప్రాక్టీస్‌ ప్రారంభించారు. సీనియర్‌ న్యాయవాది వై. రామరావు వద్ద జూనియర్‌గా పనిచేశారు. అనంతరం అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌, ప్రభుత్వ న్యాయవాది, స్పెషల్‌ జీపీగా సేవలందించారు. మృతదేహాన్ని షేక్‌పేట్‌లోని నివాసానికి తరలించగా, హైకోర్టు న్యాయమూర్తి పుల్లా కార్తీక్‌, న్యాయవాదులు, అడ్వొకేట్‌ క్లర్కులు నివాళులు అర్పించారు. అలిండియా లాయర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ గౌరవాధ్యక్షలు కొల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కె పార్ధసారథి, నాయకులు జి విద్యాసాగర్‌, హైదరాబాద్‌జిలా అధ్యక్షులు డి ప్రవీణ్‌, కార్యదర్శి సి రామచంద్రారెడ్డి సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.
రేవంత్‌రెడ్డికి హైకోర్టు హాజరు నుంచి మినహాయింపు
ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో 2016 జూన్‌లో నమోదైన క్రిమినల్‌ కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు మంజూరు చేసింది. ఈ కేసును విచారిస్తున్న కింది కోర్టు హాజరు అవసరమని ఆదేశిస్తే, హాజరుకావాలని స్పష్టం చేసింది. కేసును సవాల్‌ చేస్తూ రేవంత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ కె. లక్ష్మణ్‌ గురువారం విచారించారు. ప్రతివాదులైన పోలీసులకు నోటీసులు జారీ చేసిన కోర్టు, కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన తెలంగాణ జనజాతర బహిరంగ సభలో నాటి ఎంపీగా పాల్గొన్న రేవంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలియజేయడంతో, విచారణ సెప్టెంబర్‌ 1కి వాయిదా పడింది. తెలుగు ద్వితీయ భాష అమలుపై ఆదేశాలు రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగు భాషను ద్వితీయ భాషగా దశలవారీగా అమలు చేయడంపై హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, అన్‌ఎయిడెడ్‌, ప్రయివేటు పాఠశాలల్లో అమలవుతున్న తీరును వివరించే ప్రణాళికను రెండు వారాల్లో సమర్పించాలంది.తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ 2023 డిసెంబరులో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రమీలా పాతక్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలుగును తప్పనిసరి చేయడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని వాదించారు. హిందీ, సంస్కృతం వంటి ఇతర భాషలు చదువుతున్న విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభాలో 42 శాతం ఉర్దూ మాట్లాడే వారు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనల ప్రకారం, ప్రస్తుతం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు తెలుగు ద్వితీయ భాషగా అమలవుతోంది. 9, 10 తరగతులకు మినహాయింపు కొనసాగుతోందని తెలిపారు. ధర్మాసనం వాదనలు పరిశీలించి, పూర్తి కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img