– నోటిఫికేషన్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్
– అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలు
– ఈనెల 21వరకు నామినేషన్ల దాఖలు
– 22న నామినేషన్ల పరిశీలన
– 25 వరకు ఉపసంహరణ
– సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక
న్యూఢిల్లీ : ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ (ఈసీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో నామినేషన్ ప్రక్రియ గురువారం నుంచే అధికారికంగా మొదలైంది. సెప్టెంబర్ 9న రాష్ట్రపతి ఎన్నిక జరగనున్నదని ఈసీ వివరించింది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరిగి, ఫలితాలు విడుదల కానున్నాయని పేర్కొన్నది. ఈసీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 21. ఆగస్టు 22న నామినేషన్ పేపర్ల పరిశీలన(స్క్రుటినీ) ఉంటుంది. నామినేషన్లను ఉపసంహరించుకోవటానికి చివరి తేదీ ఆగస్టు 25. సెప్టెంబర్ 9న ఎన్నికల నిర్వహణ ఉంటుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరిగి, ఫలితాలు వెలువడుతాయి. ఆరోగ్య కారణాలతో గతనెల 21న జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మంచి ఆధిక్యం ఉన్నదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యులు కూడా ఓటు వేయటానికి అర్హులే. 543 మంది సభ్యులుండాల్సిన లోక్‌సభలో ప్రస్తుతం ఒక స్థానం (పశ్చిమ బెంగాల్ నుంచి బసిర్‌హట్ సీటు) ఖాళీగా ఉన్నది. 245 మంది సభ్యులుండాల్సిన రాజ్యసభలో ప్రస్తుతం ఐదు ఖాళీలు (జమ్మూకాశ్మీర్ నుంచి నాలుగు, పంజాబ్ నుంచి ఒకటి) ఉన్నాయి. దీంతో రెండు సభల సభ్యుల మొత్తం సంఖ్య 786గా ఉన్నది. విజయం సాధించాలంటే మొత్తం 394 మంది సభ్యుల బలం అవసరం ఉంటుం దని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యులు ఉన్నారు. ఇక రాజ్యసభలో అధికార కూటమికి 129 మంది సభ్యుల మద్దతు ఉన్నది. దీంతో ఎన్డీఏకు పార్లమెంటు ఉభయ సభల్లో కలుపుకొని మొత్తం 422 మంది సభ్యులు ఉన్నారు.
సెప్టెంబర్ 9నఉపరాష్ట్రపతి ఎన్నిక
- Advertisement -
- Advertisement -