నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మకు చెందిన కెనడాలోని కేఫ్‌పై మరోసారి కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. సుర్రే నగరంలో ఉన్న ‘క్యాప్స్ కేఫ్’ ను లక్ష్యంగా చేసుకుని దుండగులు గురువారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడ్డారు. ఈ నెలలో ఇది రెండో దాడి కావడం గమనార్హం. ఈ ఘటనకు తామే బాధ్యులమని గ్యాంగ్‌స్టర్లు గోల్డీ ధిల్లాన్, లారెన్స్ బిష్ణోయ్‌లకు చెందిన ముఠాలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించుకున్నాయి. అంతేకాకుండా, తదుపరి దాడి ముంబయిలో ఉంటుందని హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. గురువారం తెల్లవారుజామున 4:40 గంటల సమయంలో ‘క్యాప్స్ కేఫ్’ వద్ద భారీగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుల కాల్పుల్లో కేఫ్ కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో కేఫ్‌లో సిబ్బంది ఉన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. పోలీసులు కేఫ్ బయట ఒక పెట్రోల్ బాంబును కూడా గుర్తించి, ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. అందులో దుండగులు సుమారు 25 రౌండ్లకు పైగా కాల్పులు జరుపుతున్నట్లు రికార్డయింది. “మేం టార్గెట్‌కు కాల్ చేశాం, కానీ అతను స్పందించలేదు. అందుకే ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా మా మాట వినకపోతే, తదుపరి చర్య ముంబయిలో ఉంటుంది” అని ఆ వీడియోలో ఒక గొంతు హెచ్చరించింది. ఈ ఘటనతో ముంబయి పోలీసులు, ఇతర భారత భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించాయి. ఇదే కేఫ్‌పై జులై 10న తొలిసారి దాడి జరిగింది. ఆ సమయంలో కేఫ్ కిటికీలపై 10కి పైగా బుల్లెట్ గుర్తులను పోలీసులు గుర్తించారు. సిక్కుల సాంప్రదాయ వస్త్రధారణపై కపిల్ శర్మ షోలో చేసిన వ్యాఖ్యల వల్లే ఈ దాడి చేశామని ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) సభ్యుడు హర్జిత్ సింగ్ లడ్డీ అప్పట్లో ప్రకటించుకున్నాడు. ఈ వరుస దాడుల నేపథ్యంలో కేఫ్ యాజమాన్యం స్పందించింది. హింసకు వ్యతిరేకంగా తాము దృఢంగా నిలబడతామని, తమ కేఫ్ ఎల్లప్పుడూ ఆత్మీయతకు, సమాజానికి ప్రతీకగా ఉంటుందని స్పష్టం చేసింది. కెనడా పోలీసులు రెండు దాడులపైనా విచారణ జరుపుతున్నారు.