– తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ : గిరిజన తెగలు తమ హక్కుల కోసం ఐక్యరాజ్యసమితి శనివారం (ఆగస్టు9) ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చిందని శనివారం తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తండాలు, మండల కేంద్రాల్లో శనివారం నుండి 13 వరకు జెండా ఆవిష్కరణలు, ప్రదర్శనలు నిర్వహిస్తు న్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా గిరిజన తెగల ఉనికి ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కులు క్రమంగా కోల్పోతూ కోట్లాదిమంది నిరాశ్రయులుగా మారుతున్నారని తెలిపారు. వారి హక్కులను కాపాడుకునేందుకు ప్రభుత్వాలు, గిరిజన హక్కుల సంఘాలు పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నదనీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. అడవులు, భూముల నుండి వారిని గెంటేయడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. గిరిజనులకిచ్చిన హామీల అమలుకోసం పోరాడుదాం అనే నినాదాలతో ప్రపంచ ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవాన్ని తాము జరుపుతున్నట్టు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చిన నాటి నుండి రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించిన హక్కులు, చట్టాలను ఎన్నడూలేని విధంగా కాలరాసే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అడవులు, అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టపెట్టేందుకే నూతన అటవీ సంరక్షణ చట్టం 2023ను కేంద్రం ఆమోదించిందని తెలిపారు. సంస్కృతి, భాష, ప్రకృతి ఆరాధనా వంటి ఆచారాలు కనుమరుగవుతున్నాయని పేర్కొన్నారు. గిరిజన తెగల ఉనికిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 2027లో చేపట్టబోయే జనాభా లెక్కల మతం కాలంలో షెడ్యూల్ ట్రైబ్ విశ్వాసాలు లేదా ప్రకృతి ఆరాధికులు అనే ప్రత్యేక కాలాన్ని పొందుపరచాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గిరిజనులకు కాంగ్రెస్ ఇచ్చిన 16 రకాల వాగ్దానాలను తక్షణం అమలు చేసేందుకు కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
నేడు ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES