నవతెలంగాణ-హైదరాబాద్: సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, అనుబంధాలకు ప్రతికైనా రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది.రాఖీ పండుగకు నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో మాత్రమే టికెట్ ధరలను సవరించింది. స్పెషల్ బస్సులు మినహా రెగ్యూలర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి. ఈ నెల 11వ తేదీ వరకు నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఈ సవరణ చార్జీలు వర్తిస్తాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ ప్రకటన ప్రకారం స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను రాఖీ పండుగ సందర్బంగా సంస్థ సవరించింది. ఆర్టీసీ సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులని, సొంతూళ్లకు వెళ్లే వారు తమ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతూ.. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపింది.