బ్రిటిష్ వలస పాలన నుండి భారతదేశం స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటం విదేశీ ఆధిపత్యాన్ని స్థానిక పాలనతో భర్తీ చేసిన విజయంగా ఆగస్టు 15ను జరుపుకుంటాం. అయితే, ఈ సాంప్రదాయ కథనం భారతదేశ స్వతంత్ర ఉద్యమ విస్తత దక్పథాన్ని విస్మరిస్తుంది. ఆ దక్పథం ఏంటంటే ” ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలే ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం” అనేదే. ప్రజల ఆలోచనల్లో, ఆకాంక్షలలో కేంద్రీకతమై ఉన్న దక్పథం. బ్రిటిష్ వారి నుండి స్వాతంత్య్రం పొందడం అనేది ఆ సుదీర్ఘ ప్రయాణంలో ఒక అడుగు మాత్రమే. ప్రజాస్వామ్యం దిశగానే మన పయనం సాగుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు అందుకు ఊతం ఇస్తున్నాయి. అత్యవసర పరిస్థితి వంటి చారిత్రక సంఘటనలు, కేంద్ర నిరంకుశ చట్టాలు, అసమ్మతిని అణచివేయడం వంటి ప్రస్తుత చర్యల ద్వారా ఇది రుజువు అవుతుంది.
స్వాతంత్య్ర ఉద్యమం వైవిధ్యభరితమైన, అత్యంత నిశితమైన పోరాటం. వివిధ భావజాలాలు, దక్పథాలు ఇందులో ఉన్నాయి. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు పౌర స్వేచ్ఛలు రక్షించబడే పాలన పారదర్శకంగా, జవాబుదారీగా ఉండే స్వేచ్ఛా భారతదేశాన్ని ఊహించారు. ఈ దక్పథం అబ్రహం లింకన్ చెప్పిన ”ప్రజలకోసం, ప్రజలచేత, ప్రజలే ఏర్పాటు చేసుకునే ప్రభుత్వం” అనే భావనను సమర్థించింది. భగత్ సింగ్‌తో పాటు అనేక మంది కమ్యూనిస్ట్ ఉద్యమకారులు రాజకీయ స్వేచ్ఛతో పాటు పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక అసమానతల నుండి విముక్తి ఆకాంక్షించారు. దాదాపుగా ప్రజలు ఇదే కోరుకున్నారు.
”ప్రజాస్వామ్యం గురించి నా భావన ఏమిటంటే, దాని కింద బలహీనులకు కూడా బలవంతులకు ఉన్నట్లే సమాన అవకాశాలు ఉంటాయి. నేడు ప్రపంచంలో ఏ దేశమూ బలహీనుల పట్ల సానుభూతి చూపడం తప్ప మరేమీ చేయడం లేదు. నేడు పనిచేస్తున్న పాశ్చాత్య ప్రజాస్వామ్యాన్ని ఫాసిజం పలుచన చేసింది. నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఇరవై మంది మధ్యలో కూర్చొని అమలు చేయలేం. ప్రతి గ్రామంలోని ప్రజల ద్వారా క్రింది నుండి అది అమలు జరగాలి” అని గాంధీజీ అన్నారు.
ఆగస్టు 14, 1947 అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా పార్లమెంటు భవనంలో భారత రాజ్యాంగ సభలో చేసిన ప్రసంగంలో నెహ్రూ, ”భారతదేశ సేవ అంటే పేదరికం, అజ్ఞానం, వ్యాధులతో, అవకాశాలలో అసమానతలతో బాధపడే లక్షలాది మందికి సేవ చేసి, వాటిని అంతం చేయడం” అని అన్నారు.
స్వాతంత్ర ఉద్యమ ఆకాంక్షలను 1950లో ఆమోదించబడిన భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిబింబించేలా రూపొందింది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం కోసం పనిచేయాలనే నాలుగు మూల సిద్ధాంతాలను ఆదర్శాలుగా కలిగి ఉంది. ఈ ఆకాంక్షలు నెరవేర్చడం ద్వారా దేశంలో లోతైన పరివర్తన దిశగా పయనించగలం.
అయితే, ఊహించినట్లుగానే, నిజమైన ప్రజాస్వామ్య మార్గం అనేక ఒడుదుడుకులు, సవాళ్లతో నిండి ఉంది. వీటిలో అత్యంత తీవ్రమైనవి 1975 నుండి 1977 వరకు ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రకటించిన అత్యవసర పరిస్థితి ఒకటైతే, రెండవది 2014 తరువాత నుండి నేటికీ కొనసాగుతున్న మోడీ పరిపాలన కాలం. ఎమర్జెన్సీ కాలంలో, రాజ్యాంగ హక్కులు నిలిపివేయబడ్డాయి. పత్రికా స్వేచ్ఛ తగ్గించబడింది. రాజకీయ అసమ్మతిని క్రూరంగా అణచివేయబడింది.
భారతదేశంలో 2014 తరువాత బిజెపి పాలనలో పరిస్థితి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలదన్నేలా ప్రతిధ్వనిస్తోంది. ఇక్కడ అనేక సంఘటనలు ప్రజాస్వామ్య నీతి నుండి వైదొలగుతున్నాయని సూచిస్తున్నాయి. రాజ్యాంగ వ్యవస్థలు లోపలినుండి ధ్వంసం చేయబడి, ప్రజల హక్కులను అణిచివేతకు సాధనాలుగా మారుతున్నాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఖAూA), పౌరసత్వ సవరణ చట్టం (జAA) వంటి చట్టాలను అమలు చేయడం వరుసగా పౌర స్వేచ్ఛలను దెబ్బతీస్తున్నాయి. లక్షలాది పౌరుల ఓటు హక్కును నిర్దాక్షిణ్యంగా తొలగించి ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని పెద్ద ప్రమాదంలోకి నెడుతోంది. మహారాష్ట్ర, డిల్లీ ఎన్నికలలో, బిహార్‌లో ఓట్ల తొలగింపులో ఎన్నికల సంఘం పాత్ర అత్యంత వివాదాస్పదమైనదిగా ఉంది. ఓటు హక్కు కల్పించడంలో మతం ఆధారంగా వివక్ష చూపుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మణిపూర్‌లో కుకీ మహిళలను నగంగా ఊరేగింపు చేయడం, కుకీలపై హింసకు పాల్పడేందుకు మెయితీలకు పోలీసు స్టేషన్ లోని ఆయుధాలను ఇవ్వాలని పోలీసులను స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించిన ఫోన్ రికార్డులు సంచలనం సష్టించాయి. 370 ఆర్టికల్ రద్దు తరువాత కాశ్మీర్ ప్రజలపై నిర్భందంతో బహిరంగ జైలుగా మారింది.
అంతేకాకుండా, సామాజిక కార్యకర్తలను, విద్యావేత్తలను, జర్నలిస్టులను అరెస్టు చేయడం ద్వారా, పరోక్ష సెన్సార్‌షిప్, నిఘా ద్వారా అసమ్మతిని అణచివేయడం భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఆరోగ్యం గురించి తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది.
నిరసనలు, పౌర ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరు ఈ కొనసాగుతున్న నిరంకుశ ధోరణులను మరింతగా చూపిస్తుంది. ఉదాహరణకు, 2020లో రైతుల నిరసనలకు ప్రతిస్పందనగా నిరసనకారులపై భాష్ప వాయువు, నీటి ఫిరంగులు, లాఠీలను ప్రయోగించడం వలసరాజ్యాల అణచివేత వ్యూహాలను గుర్తుకు తెస్తుంది. ఉపా కింద అరెస్టు చేయబడిన ఉమర్ ఖాలెద్, సిద్ధిఖీ కప్పన్ లాంటి వారు ఎలాంటి విచారణ లేకుండానే ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్న తీరు, స్టాన్ స్వామి, సాయిబాబా వంటి వారు అత్యంత దయనీయ స్థితిలో చనిపోవడం, మూక దాడులకు పాల్పడే వారిపై చర్యలు లేకపోవడం, పేదలు, మైనారిటీల ఇళ్ళు బుల్డోజర్‌లతో నేలమట్టం చేయడం… ఇటువంటి చర్యలు భారతదేశ వ్యవస్థాపకుల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు విరుద్ధంగా నియో ఫాసిస్టు పాలనా శైలిని వెల్లడిస్తున్నాయి.
చారిత్రక, సమకాలీన సవాళ్లతో కూడిన ఈ ప్రతిబింబం భారతదేశం నిజమైన ప్రజాస్వామ్యం కోసం పోరాటం కొనసాగుతోందని సూచిస్తుంది. స్వాతంత్య్రం యొక్క సారాంశం – పరిపాలన ప్రజల సమ్మతితో, పాలితుల సంక్షేమం కోసం నిర్వహించబడే సమాజాన్ని స్థాపించడం. ఇంకా పూర్తిగా సాకారం కాని ఆదర్శంగానే మిగిలిపోయింది.
ఈ ఆదర్శానికి దగ్గరగా వెళ్లడానికి, రాజ్యాంగ విలువలను నిలబెట్టడానికి, పౌర స్వేచ్ఛలను రక్షించడానికి, పాలన పారదర్శకంగా, అందరినీ కలుపుకుని, జవాబుదారీగా ఉండేలా చూసుకోవడానికి భారతదేశానికి కొత్త నిబద్ధత అవసరం. అలాంటి నిబద్ధత దానంతట అదే రాదు. ప్రజలు అత్యంత జాగరూకతతో, చైతన్యంతో కషి చేయాలి.
79 ఏళ్ల స్వతంత్ర పాలన తరువాత కూడా దేశ పౌరులను ఒకరిని మరొకరికి శత్రువులుగా చిత్రించి, పరస్పరం ద్వేషించుకునేలా చేయడం అత్యంత దారుణమైన విషయం. కర్నాటకలో ప్రధానోపాధ్యాయుడైన ముస్లింను తొలగించడం కోసం శ్రీరామ సేన కార్యకర్తలు విద్యార్థులు తాగే మంచినీటిలో విషం కలిపిన అమానవీయం ఏ కొలమానాలకు అందదు. ఈ స్థితి నుంచి దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలపైనే ఉంది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అలాంటి కర్తవ్య దీక్ష తీసుకోవాలి.
- ఎం డి అబ్బాస్
9490098032