Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనేలను కప్పేస్తున్న కాంక్రీట్‌

నేలను కప్పేస్తున్న కాంక్రీట్‌

- Advertisement -


– భారీ వర్షాలున్నా.. నీరు ఇంకే దారేది?
– భూగర్భజలాల పెంపునకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ
– ప్రజాస్థలాల్లోనూ ఇంకుడు గుంతల నిర్మాణాలు
– జీఐఎస్‌ అనుసంధానంతో డ్యాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షణ
– వచ్చే వారంలో ప్రారంభం కానున్న 50 రోజుల ప్రత్యేక కార్యాచరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
: గ్రేటర్‌ హైదరాబాద్‌లో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. కోటిన్నరకుపైగా జనాభా ఉన్న నగరంలో నీరు సరిపోవడం లేదు. ఎండాకాలంలోనైతే పరిస్థితి తీవ్రంగా ఉంటోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జలమండలి భూగర్భజలాల పెంపుకు ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమైంది. ‘వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలోకి ఇంకేలా చేద్దాం.. భూగర్భజలాలను పెంపొందిద్దాం..’ అనే నినాదంతో ‘ఇంకుడు గుంతల జలయజ్ఞం-2025’కు జలమండలి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే అమలు చేస్తున్న ’90 రోజులు ఇంటింటా ఇంకుడు గుంత’ల కార్యక్రమంలో భాగంగా 50 రోజుల ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
నగరంలో సాధారణంకన్నా అధికంగా వర్షపాతం నమోదవుతున్నా.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరిస్తున్న నివాస, వాణిజ్య సముదాయాలతో పాటు ఖాళీ స్థలాలు, బహిరంగ ప్రదేశాలన్నింటినీ కాంక్రీట్‌తో కప్పేస్తోంది. దీంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకుండా పోయింది. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఫలితంగా తాగునీటి కంటే నిత్యావసరాల కోసం నీటి ట్యాంకర్ల డిమాండ్‌ పెరుగుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుదూర ప్రాంతాల నుంచి నీరు తీసుకురావడం జలమండలికి తలకు మించిన భారమైంది. నగరంలో కురుస్తున్న వర్షపు నీరు వరద ప్రవాహంగా డ్రెయినేజీల్లో కలిసి వృథాగా పోతుండటాన్ని జలమండలి తీవ్రంగా పరిగణించింది. భూగర్భజలాలను పెంచితే సీజన్‌తో సంబంధం లేకుండా నిత్యావసరాల కోసం సరఫరా చేసే ట్యాంకర్ల వినియోగం తగ్గుతుందని భావిస్తోంది. భూగర్భజలాల పెంపు లక్ష్యంగా వచ్చే వారం నుంచి సెప్టెంబర్‌ 30 వరకు నాలుగు రకాల ‘గ్రౌండ్‌వాటర్‌ రిచార్జీ’ ప్రణాళిక అమలుకు రంగం సిద్ధమైంది.
ప్రతి ఇంట్లోనూ ఇంకుడు గుంత
వర్షపు నీటి సంరక్షణలో భాగంగా 300 చదరపు మీటర్ల గల ప్రతి ఇంటా భూగర్భ జలాలను రీస్టోర్‌ చేసుకునే దిశగా ప్రాంగణంలో ఇంకుడు గుంత తప్పనిసరి చేస్తూ జలమండలి చర్యలు చేపట్టింది. పాత, కొత్త నివాస, వాణిజ్య సముదాయాలపై దృష్టి సారించింది. నల్లా కనెక్షన్‌ క్యాన్‌ నెంబర్‌ ఆధారంగా సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతి నెలా 20 కంటే ఎక్కువ ట్యాంకర్లను బుక్‌ చేసుకునే ప్రాంగణాలను గుర్తించింది. ఇప్పటికే సుమారు 42,784 క్యాన్‌ నెంబర్లను గుర్తించి 40,209 నివాస సముదాయలపై సర్వే నిర్వహించగా, కేవలం 22,825 నివాసాల్లోనే ఇంకుడు గంతలు ఉన్నాయి. 17,384 నివాసాల్లో లేవు. దీంతో 16,196 గృహాలకు నోటీసులు జారీచేసి ఇంకుడు గుంత తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టింది. ఒకే ఒక బోర్‌ బావి పని చేస్తుంటే.. 60మీటర్లు లేదా 200 లోతు వరకు భూమి మట్టానికి దిగువన డ్రిల్లింగ్‌కి కొత్త బోర్‌ బావి ఏర్పాటు చేసుకునే విధంగా సిఫార్సు చేయాలని నిర్ణయించింది.
ప్రజా స్థలాల్లోనూ..
ప్రజాస్థలాల్లోనూ ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని జలమండలి నిర్ణయించింది. ప్రజా స్థలాలు, కాలనీలు, ప్రభుత్వ సముదాయాలు, విద్యా సంస్ధలు, రోడ్డు పక్కన గల నివాస, వాణిజ్య సముదాయాల రూఫ్‌ టాప్‌ నుంచి కిందికి పడే వర్షపు నీటిని పైపుల ద్వారా ఇంకుడుగుంతలో పడేలా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైంది. మొత్తం సుమారు 16 వేల వరకు ప్రజా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
హార్వెస్టింగ్‌ పిట్స్‌గా హ్యాండ్‌ పంప్స్‌
నిరుపయోగంగా ఉన్న బోరు బావులను హార్వెస్టింగ్‌ పిట్‌లతో ఇంజక్షన్‌ బోర్‌వెల్‌గా మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే సుమారు 3,222 బోర్‌వెల్స్‌ను జలమండలి గుర్తించింది. అందులో పవర్‌ బోర్‌వెల్స్‌ 1,045 ఉండగా, వాటిలో కోర్‌ సిటీ పరిధిలో 246, శివారు పరిధిలో 7,99 బోర్లు ఉన్నట్టు గుర్తించింది. హ్యాండ్‌ బోర్‌వెల్స్‌ 2,177 ఉండగా వాటిలో కోర్‌సిటీలో 1,665, శివార్లలో 1,557 బోర్లు ఉన్నాయి. మరిన్ని గుర్తింపు కోసం చర్యలు చేపట్టింది.
డ్యాష్‌ బోర్డు ద్వారా పర్యవేక్షణ
ప్రజా బహిరంగ స్థలాల్లో ఏర్పాటు చేసే ఇంకుడు గుంతలను జీఐఎస్‌ మ్యాపింగ్‌తో డ్యాష్‌ బోర్డు ద్వారా పర్యవేక్షించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే గుర్తించిన ‘ప్రజా ఇంకుడు గుంత’ల ప్రాంతాలను జియో ట్యాగ్‌ చేస్తారు. నిర్మాణం ముందు, నిర్మాణం తరువాత తీసిన ఫోటోలను అప్లోడ్‌ చేసే వీలుగా ఐటీ విభాగం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ రూపకల్పన చేస్తున్నారు. ప్రజా ఇంకుడు గుంతల నిర్మాణం పురోగతిని తెలుసుకునే విధంగా మొబైల్‌ యాప్‌ అనుసంధానంతో డ్యాష్‌ బోర్డు ద్వారా పర్యవేక్షించనున్నారు.
జలయజ్ఞంలో ఇంకుడు గుంతల భాగస్వామ్యం అవసరం
అశోక్‌ రెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌, జలమండలి
భూగర్భజలాల పెంపు కోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం తమ కర్తవ్యంగా భావించి జలయజ్ఞం- 2025లో ప్రతి నివాస సముదాయమూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. నగరంలో నేలనంతా కాంక్రీట్‌ కప్పేస్తుండటంతో వర్షపు నీరు భూమిలో ఇంకే పరిస్ధితి కనిపించడం లేదు. భూగర్భజలాలు దిగువకు పడిపోయి పైకి చుక్క నీరు రావడం లేదు. వర్షపు నీటి సంరక్షణతోనే భూగర్భజలాలు పెంచొచ్చు. వృథాగా పోతున్న వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలోకి ఇంకేలా చెయ్యాలి. ప్రతి ఇంటా ఇంకుడు గుంత తప్పని సరి. దీంతో భూగర్భజలాలు పెరుగుతాయి. నీటి ఎద్దడి సమస్య తగ్గుతుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img