– ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 15వ తేదీన అలస్కాలో సమావేశమవుతారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంపై ఇరువురు నేతలు చర్చిస్తారు. పుతిన్‌తో సమావేశం గురించి ట్రంప్ సోషల్ మీడియాలో తెలియజేయగా రష్యా అధ్యక్ష భవనం ప్రతినిధి దానిని ధృవీకరించారు. అయితే ఏ పరిష్కారం కనుగొన్నప్పటికీ అందులో తమకు భాగస్వామ్యం ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక శాంతి కోసం భాగస్వాములందరితో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. యుద్ధం ఆగిపోవాలంటే ఉక్రెయిన్ తన భూభాగాన్ని కోల్పోవాల్సి ఉంటుందని అంతకుముందు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ‘మూడున్నర సంవత్సరాలుగా ఆ భూభాగం కోసం పోరాడుతున్నారు. అనేక మంది రష్యన్లు చనిపోయారు. అనేక మంది ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు’ అని ట్రంప్ శుక్రవారం అధ్యక్ష భవనంలో చెప్పారు. ఇది చాలా సంక్లిష్టమైన సమస్య అని అంటూ ఇరువురి ప్రయోజనం కోసం భూభాగాలను ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. అయితే ప్రతిపాదన ఏ విధంగా ఉంటుందో ఆయన వివరించలేదు. కాగా తూర్పు ఉక్రెయిన్‌లోని దాన్‌బాస్ ప్రాంతాన్ని పూర్తిగా రష్యా తీసుకోవాలని, దానికి బదులుగా తాను పాక్షికంగా ఆక్రమించిన ఖెర్సాన్, జపోర్జియా ప్రాంతాలను ఉక్రెయిన్‌కు ఇచ్చి వేయాలని ట్రంప్ ప్రతిపాదించారని సీబీఎస్ న్యూస్ చెప్పింది. ట్రంప్ దూత స్టీవ్ విట్‌కాఫ్ వద్ద రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇదే ప్రతిపాదన ఉంచారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. ప్రాదేశిక రాయితీలకు ముందస్తు షరతులను అంగీకరించే ప్రశ్నే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇదివరకే తేల్చి చెప్పారు. ‘ఉక్రెయిన్ ప్రాదేశిక అంశానికి సంబంధించిన జవాబు మా రాజ్యాంగంలో ఉంది. దాని నుంచి ఎవరూ పక్కకు వెళ్లలేరు. ఉక్రెయిన్ ప్రజలు తమ భూభాగాన్ని ఆక్రమణదారులకు అప్పగించరు’ అని ఆయన శనివారం స్పష్టం చేశారు. శాంతి స్థాపనకు దోహదపడే వాస్తవ పరిష్కారానికి తాము సిద్ధమేనని చెప్పారు.
15న అలస్కాలో ట్రంప్, పుతిన్ భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES