Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంమోడీ, జిన్‌పింగ్‌తో పుతిన్‌ టెలిఫోన్‌ చర్చలు

మోడీ, జిన్‌పింగ్‌తో పుతిన్‌ టెలిఫోన్‌ చర్చలు

- Advertisement -

– వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళతాం : ప్రధాని
మాస్కో/ న్యూఢిల్లీ :
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో టెలిఫోన్‌ సంభాషణలు జరిపారు. ఈ నెల 17న అలస్కాలో పుతిన్‌తో సమావేశమవుతానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన నేపథ్యంలో జరిగిన ఈ టెలిఫోన్‌ సంభాషణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉక్రెయిన్‌తో జరుపుతున్న పోరుకు వెంటనే స్వస్తి చెప్పాలని పుతిన్‌కు ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే పోరు ఆపాలంటే ప్రధాన ప్రాదేశిక రాయితీలకు ఉక్రెయిన్‌ అంగీకరించాలని పుతిన్‌ డిమాండ్‌ చేస్తున్నారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక తెలిపింది.
రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తే జరిమానాగా పాతిక శాతం టారిఫ్‌ కట్టాల్సి ఉంటుందని భారత్‌ను ట్రంప్‌ బెదిరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్‌, మోడీ మధ్య సంప్రదింపులు జరగడం గమనార్హం. పుతిన్‌తో టెలిఫోన్‌ చర్చల అనంతరం మోడీ మాట్లాడుతూ రష్యా నేతతో ‘చాలా మంచి, సవివరమైన సంభాషణ’ జరిగిందని వ్యాఖ్యానించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ తాజా పరిణామాలను మోడీకి పుతిన్‌ వివరించారు. ‘ద్వైపాక్షిక అజెండాలో పురోగతిని కూడా మేము సమీక్షించాం. రెండు దేశాల ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించాం’ అని మోడీ తెలిపారు. మాస్కో పర్యటనలో ఉన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ గురువారం పుతిన్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ట్రంప్‌ టారిఫ్‌ హెచ్చరికలను భారత్‌ ఇప్పటికే తిప్పికొట్టింది. దేశీయ ఇంధన ధరలను స్థిరంగా ఉంచాలంటే రష్యా నుంచి చమురును కొనుగోలు చేయక తప్పదని స్పష్టం చేసింది. కాగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా పుతిన్‌ ఫోన్‌లో మాట్లాడారు. ట్రంప్‌ ప్రత్యేక దూత స్టీవ్‌ విట్‌కాఫ్‌తో తాను జరిపిన సమావేశం గురించి తెలియజేశారు. దీర్ఘకాలిక ప్రాతిపదికన ఉక్రెయిన్‌ సంక్షోభానికి పరిష్కారం సాధించాలని జిన్‌పింగ్‌ సూచించారు. రష్యా యుద్ధానికి మద్దతు ఇస్తున్న చైనా శాంతి స్థాపనకు, చర్చలు జరగడానికి కృషి చేస్తుందని తెలిపారు. కాగా విట్‌కాఫ్‌తో పుతిన్‌ జరిపిన చర్చలు మంచి ఫలితాన్ని, పురోగతిని ఇచ్చాయని ట్రంప్‌ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img