– రాహుల్ ప్రశ్నలకు యూపీ సీఈఓ పొంతనలేని సమాధానాలు
న్యూఢిల్లీ/లక్నో : కర్నాటక ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అవకతవకలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన పలు ప్రశ్నలకు ఎన్నికల కమిషన్ నుంచి ఇప్పటికీ సరైన సమాధానాలు లభించలేదు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ ఓ అంశాన్ని లేవనెత్తారు. కర్నాటక ఓటర్ల జాబితాలో పేరున్న ఆదిత్య శ్రీవాత్సవ, విశాల్ సింగ్… వీరిద్దరికీ ఉత్తరప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలలో కూడా ఓటు హక్కు ఉన్నదని ఆయన ఆధారాలతో సహా చూపించారు. తన వాదనకు మద్దతుగా మార్చి 16న ఎన్నికల కమిషన్ వెబ్‌సైటు నుంచి తీసుకున్న స్క్రీన్‌షాట్లను చూపారు. ఒకే ఓటరు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల ఓటర్ల జాబితాలలో ఎలా ఉంటాడని ప్రశ్నించారు.
రాహుల్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం… ఆదిత్య శ్రీవాత్సవ (ఓటర్ ఐడీ నెంబర్ : ఎఫ్‌పీపీ64370040)కు కర్నాటకలోని మహదేవ్‌పురా నియోజకవర్గంలో రెండు పోలింగ్‌్ కేంద్రాల్లో ఓటు ఉంది. అంతేకాదు….మహారాష్ట్రలోని జోగేశ్వరి ఈస్ట్‌లోనూ, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ఈస్ట్‌లోనూ ఆయనకు ఓటుంది. ఇక విశాల్ సింగ్ (ఎపిక్ నెంబర్ : ఐఎన్‌బీ2722288) విషయానికి వస్తే ఆయన పేరు కూడా మహదేవ్‌పురాలోని రెండు పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితాలలో ఉంది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కంటోన్మెంట్ స్థానంలో కూడా అదే ఎపిక్ నెంబరుతో ఓటుంది.
రాహుల్ ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) అదే రోజు స్పందించారు. ఆదిత్య శ్రీవాత్సవ, విశాల్ సింగ్‌లకు యూపీలో ఓటు లేదని చెప్పారు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైటు ప్రకారం వారికి మహదేవ్‌పురా శాసనసభ స్థానంలోనే ఓటు హక్కు ఉన్నదని తెలిపారు. మరి రాహుల్, సీఈఓల వాదనల్లో ఎవరిది నిజం? రాహుల్ మార్చి 16న ఈసీ వెబ్‌సైటు నుంచి స్క్రీన్‌షాట్ తీసుకున్నారు. ఈ నెల 7న ఈసీ వెబ్‌సైటులో ఎపిక్ నెంబర్ ఆధారంగా వెతకగా లభించిన సమాచారాన్ని సీఈఓ ఉటంకించారు. యూపీ సీఈఓ ప్రకటనలో వాస్తవాన్ని తెలుసుకునేందుకు ‘ది వైర్’ పోర్టల్ ప్రయత్నించింది. లక్నో ఈస్ట్, వారణాసి కంటోన్మెంట్ స్థానాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ 2024 అక్టోబర్ 29న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జబితాలు, ఈ ఏడాది జనవరి 7న ప్రచురించిన తుది జాబితాలలో వారిద్దరి పేర్లు, ఎపిక్ నెంబర్లను (రాహుల్ షేర్ చేసినవి) వెతికింది. ఈ జాబితాలలో వారిద్దరి పేర్లూ కన్పించాయి. రాహుల్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్లతో ఇద్దరి ఎపిక్ నెంబర్లు సరిపోయాయి. ఇక ఎన్నికల కమిషన్ వెబ్‌సైటులో అందుబాటులో ఉన్న ముసాయిదా ఓటర్ల జాబితా, తుది జాబితాలలో ఉన్న సమాచారానికి, యూపీ సీఈఓ చేసిన ప్రకటనకు పొంతన కుదరడం లేదు. అంటే ఎన్నికల అధికారి ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉన్నదని, అందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టమవుతోంది.
యూపీ సీఈఓ చేసిన ప్రకటనను జాగ్రత్తగా గమనిస్తే అందులో మరిన్ని తప్పులు కన్పించాయి. మహదేవ్‌పురా శాసనసభ స్థానంలోని పోలింగ్ కేంద్రం
నెంబర్ 458లో ఆదిత్య శ్రీవాత్సవ పేరు వరుస నెంబరు 1265లో ఉన్నదని ఆ అధికారి తెలిపారు. అయితే ఆదిత్య శ్రీవాత్సవ ఎపిక్ నెంబరుతో వెతకగా ఓటరు వివరాలలో తేడా కన్పించింది. ఆదిత్య శ్రీవాత్సవ తండ్రి పేరు కాకుండా అక్కడ బంధువు పేరు ఉంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేమంటే ఆదిత్య శ్రీవాత్సవ పేరు తండ్రి పేరుతో సహా లక్నో ఈస్ట్ స్థానం ఓటర్ల జాబితాలో ఉంది. ఎపిక్ నెంబరు మాత్రం వేరేలా ఉంది. ఉత్తరప్రదేశ్ సీఈఓ చేసిన ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నదని, సరిగా పరిశీలించకుండానే హడావిడిగా జారీ చేశారని దీనినిబట్టి అర్థమవుతోంది.