తిరువనంతపురం : భారతీయ లౌకికవాదాన్ని, వైవిధ్యభరితమైన సాంస్కృతిక బహుళత్వాన్ని పరిరక్షించేందుకు నాయకత్వ స్థానాన్ని చేపట్టాలని సీపీఐ (ఎం) సీనియర్ నేత బృందా కరత్ కేరళను కోరారు. ప్రముఖ మార్క్సిస్టు మేధావి పి.గోవింద పిళ్లై శత జయంతి సందర్భంగా తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘సమకాలీన భారత్‌లో సాంస్కృతిక రాజకీయాలు’ అనే అంశంపై ఆమె ప్రసంగించారు. దేశ బహుళత్వ గుర్తింపునకు నయా ఉదారవాద, మితవాద శక్తుల నుంచి ముప్పు పొంచి ఉన్నదని బృందా కరత్ చెప్పారు. భిన్నత్వంలో సాంస్కృతిక ఏకత్వం అనే సుసంపన్నమైన చరిత్ర కలిగిన కేరళ రాష్ట్రం దేశంలోని మిగిలిన ప్రాంతానికి వెలుగు చూపాలని ఆకాంక్షించారు.
సమానత్వానికి, లౌకికవాదానికి సవాళ్లు ఎదురవు తున్నాయని, న్యాయం కోసం పోరాటాలు చేసిన సుదీర్ఘ చరిత్ర కలిగిన కేరళ రాష్ట్రం ఓ ఉదాహరణగా నిలవాలని బృందా కరత్ కోరారు. పౌరుల్ని వినియోగదారులుగా మార్చిన నయా ఉదారవాదాన్ని ఆమె తీవ్రంగా విమర్శిస్తూ ఈ ఆర్థిక భావజాలం ప్రజల హక్కులు, గౌరవాన్ని హరించిందని చెప్పారు. ‘నేను వినియోగదారుని అయితే కన్పిస్తాను. పేదనో, వలస కార్మికురాలినో, కార్మిక వర్గానికి చెందిన దానినో అయితే నాకు గుర్తింపు ఉండదు. ఈ నయా ఉదారవాద దృక్పథం వ్యక్తివాదాన్ని, దురాశను పెంచుతుంది. దీనినే భారత్ ఆకాంక్షగా చిత్రీకరిస్తున్నారు. అయితే తీవ్ర అసమానతలు ఉన్న ఈ సమాజంలో న్యాయంగా లేని ఆకాంక్షలు నిరాశకు, సామాజిక నాశనానికి మాత్రమే దారితీస్తాయి’ అని అన్నారు. ఒకే మతానికి గుర్తింపు ఇవ్వడం ద్వారా భారతీయ సంస్కృతిని ఆర్ ఎస్‌ఎస్ గుత్తాధిపత్య ధోరణిలో చూస్తోందని బృందా కరత్ విమర్శించారు.
ఆర్‌ఎస్‌ఎస్ సాంస్కృతిక జాతీయతావాదం భారతీయ బహుళ సంప్రదాయాలను అణచి వేస్తోందని, హిందూ యిజాన్ని పునర్నిర్వచి స్తోందని మండిపడ్డారు. కులాన్ని, పితృస్వా మ్యాన్ని ప్రోత్సహిస్తున్న మనుస్మృతి భాగాలపై మౌనం ఎందుకని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వారు విశ్వాసాలలో భిన్నత్వాన్ని తమ రాజకీయ అజెండాకు అనుగుణంగా సజాతీయ సాంస్కృతిక రూపంగా మార్చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బజరంగ్‌దళ్ సభ్యుల దాడికి గురైన ఇద్దరు క్రైస్తవ సన్యాసినులను ఇటీవల తాను జైలులో కలిశానని గుర్తు చేశారు. వారిలో ఒకరైన సిస్టర్ ప్రీతి మేరి తనపై దాడి చేసినందుకో, తనను జైలులో పెట్టినందుకో బాధపడడం లేదని, తనను చెద పురుగు అన్నందుకు ఏడ్చారని చెప్పారు. ‘ఈ రకమైన భాష ఆమోదయోగ్యం కాదు. విద్వేషపూరిత గుర్తింపులు సృష్టించే అమానుష సంస్కృతిలో ఇది ఒక భాగం’ అని తెలిపారు. భారతీయ సంస్కృతి, చారిత్రక గుర్తింపును తిరగరాసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రతిఘటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గతాన్ని పరిరక్షించుకోవడానికే కాకుండా న్యాయసమ్మతమైన, సమాన భవిష్యత్తు కోసం ఇలాంటి భావజాలాలలో ధైర్యంగా పోరాడాలని బృందా కరత్ కోరారు. శత జయంతి ఉత్సవాలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభిస్తూ పి.గోవింద పిళ్లైకి ఘనంగా నివాళులు అర్పించారు. లౌకికవాదంపై సంఫ్‌ు పరివార్ తన దాడులను ఉధృతం చేస్తూ చరిత్రను తిరగరాసేందుకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో పీజీ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించారు. గోవింద పిళ్లై జీవితాన్ని, ఆయన పనులను గుర్తిస్తూ తిరువనంతపురంలోని మెట్టుకడ వద్ద ఆయన పేరిట పరిశోధన, అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ కేంద్రంలో ఆయన వ్యక్తిగత రచనలతో పాటు పాతిక వేల పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తారు.